అక్షరానికి మరణం లేదు

A letter has no death– పుస్తక పఠనం జీవితాన్ని మారుస్తుంది చదువుతో ప్రశ్నించే గుణం అలవడుతుంది
– నిర్వీర్యమైన గ్రంథాలయాలను పునరుద్ధరించాలి
– 36 జాతీయ పుస్తక ప్రదర్శనలో వక్తలు
”అక్షరానికి మరణం లేదు. పుస్తక పఠనం వ్యక్తిత్వాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందిస్తుంది. పుస్తకం ప్రశ్నించే గుణాన్ని నేర్పుతుంది. టాల్‌స్టారు రాసిన చిన్న పుస్తకం గాంధీని మహాత్మగాంధీగా తీర్చిదిద్ధింది. 90పేజీల కమ్యూనిష్టు మ్యానిఫెస్టో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది. ఈ రకంగా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే పుస్తకాన్ని బతికించాలి” అని పలువురు వక్తలు సూచించారు.

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ కళాభారతి(ఎన్‌టీఆర్‌ స్టేడియం)లో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శనను పద్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకం మనిషిని పరిపూర్ణంగా మార్చే గొప్ప సాధనమని అన్నారు. ప్రతి ఒక్కరూ పఠనాన్ని తమ నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపు నిచ్చారు. అక్షరాలను, పాటలను జీవితంగా మలుచుకుని చివరి వరకు పాటుపడిన రవ్వా శ్రీహరి, గద్దర్‌ పేర్లను ఈ పుస్తక ప్రదర్శనలో పెట్టి సముచిత స్ధానం కల్పించారని కొనియాడారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ పుస్తకం అందరికి అందుబాటులో ఉన్నప్పుడే చదువు, జ్ఞానం విస్తరిస్తుందని అన్నారు. అయితే కేవలం వ్యక్తులు, సంస్థలతోనే ఇది సాధ్యం కాదని, ప్రభుత్వాలు కూడా సహాయ, సహకారాలు అందించాలని కోరారు. గత పదేండ్లుగా తెలంగాణలో గ్రంథాలయాలు నిర్వీర్యమయ్యాయనీ, వాటిని పునరుద్దరించే బాధ్యతను కొత్త ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. సరైన నిధులు కేటాయించి, నియామకాలు చేపట్టడం ద్వారా వాటికి పూర్వ వైభవం తీసుకు రావాలని అన్నారు. ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పుస్తకాలను కొనుగోలు చేసి అన్ని గ్రంథాలయాలకు అందించాలని సూచించారు. సీనియర్‌ జర్నలిస్టు జహీరుద్ధీన్‌ అలీఖాన్‌ లాంటి వారి పేర్లను ఈ ప్రదర్శనలోని వేదికలకు పెట్టడం హర్షనీయమన్నారు. నవతెలంగాణ ఎడిటర్‌ ఆర్‌. సుధా భాస్కర్‌ మాట్లాడుతూ చదువుతో జ్ఞానం పెరుగుతుందనీ, తద్వారా ప్రశ్నించే గుణం అందరికి అలవడుతుందని అన్నారు.
ప్రశ్నను జీర్ణించుకోలేని ప్రభుత్వాలు నిర్బంధాలను పెంచుతాయనీ, ఈ వేదిక మీదున్న ఒకరు బాధితులని మిగిలిన వారిపై కూడా రావచ్చని చెప్పారు. వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత పెరిగి, అరచేతిలో ప్రపంచం కనిపిస్తున్నా ప్రజల్లో పుస్తక పఠనం తగ్గక పోవడం గొప్ప పరిణామమన్నారు. ఇటీవల కోల్‌కత్తాలో 14 రోజుల పాటు జరిగిన పుస్తక ప్రదర్శనను 29 లక్షల మంది సందర్శించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సభాధ్యక్షులు జూలూరు గౌరి శంకర్‌ మాట్లాడుతూ గత 35 ఏండ్లుగా కాలాతీతంగా వస్తున్న మార్పులను తట్టుకుంటూ ఎంతో మంది కొత్త రచయితలను, రచనలను, పాఠకులకు ఈ పుస్తక ప్రదర్శన పరిచయం చేసిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ వ్యవస్ధాపకులు రాజేశ్వర్‌ రావు, కార్యదర్శి ఆర్‌.వాసు, గద్దర్‌ కూతురు వెన్నెల, బుక్‌ ఫెయిర్‌ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్‌, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రదర్శనను సందర్శించిన మంత్రి జూపల్లి
తెలంగాణ కళాభారతిలో కొలువు దీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శనను సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి సకల రుగ్మతలకు విరుగుడు పుస్తకమేనని అన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎన్నో సమస్యలతో సతమత మవుతున్నాడనీ, వాటినుంచి పుస్తక పఠనం స్వాంతన చేకూరుస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరు పుస్తకాలను తమ నేస్తాలుగా మలుచుకోవాలని ఆయన సూచించారు.

Spread the love