– మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు
– ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు :మంత్రి శ్రీధర్‌బాబు
– ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణంపై విష ప్రచారం తగదు : సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు మైండ్‌సెట్ మార్చుకోవాలని మంత్రులు శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్, సీతక్క హితవు పలికారు. సభలో అబద్దాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కాంగ్రెస్ సభ్యులు వేముల వీరేశం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. అనంతరం బీఆర్‌ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై చేసిన విమర్శలు సభలో గందరగోళానికి దారితీసింది. బీఆర్‌ఎస్ సభ్యులు వివేకానంద స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లగా..ఇది పద్ధతి కాదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వారించారు. వెంటనే అలర్ట్ అయిన జగదీశ్‌రెడ్డి వెంటనే వివేకానందను చేయిపట్టి వెనక్కి తీసుకొచ్చారు.విపక్ష సభ్యుల తీరుపై మంత్రులు శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్, సీతక్క తీవ్రస్థాయిలో స్పందించారు. .బీఆర్‌ఎస్ సభ్యులు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారనీ, వారు మైండ్‌సెట్ మార్చుకోవాలని మంత్రి పొన్నం హితవు పలికారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 60 రోజులు సమ్మె చేసినా, ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదనీ, ఇప్పుడు వాళ్లే ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆటోవాలాలపై వేలాది రూపాయల చలాన్లు వేయించింది మీరు కాదా? అని నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేసినా పట్టించుకోనివాళ్లు ఇప్పుడు ఆటోకార్మికులపై మాట్లాడటం అంటే వారిని అవమానించడమేనని అన్నారు. ఆటోవాలాలను రెచ్చగొట్టి ఆత్మహత్యలు చేసుకునేలా బీఆర్‌ఎస్ సభ్యులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఫ్యూడలిస్టులు ఆటోల్లో వచ్చి ఆటోకార్మికులను అవమానిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు పదేండ్లలో ఒక్కసారి కూడా పీఆర్సీ ఇవ్వలేదనీ, ఆర్టీసీ ఆస్తులను అమ్మేశారని విమర్శించారు. ఓ నేత తన బంధువైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రిటైర్డ్ అయిన వ్యక్తిని ఎమ్‌డీగా నాలుగేండ్లు నియమించారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం తమ ప్రభుత్వం ధ్యేయమన్నారు.
గవర్నర్ ప్రసంగంపై మాట్లాడమంటే సభ్యులు రాజేశ్వర్‌రెడ్డి సంబంధంలేని అంశాలు మాట్లాడుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ‘ఉచిత బస్సు ప్రయాణం 13 అంశాల్లో ప్రధానమైనది. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయంపై బీఆర్‌ఎస్ సభ్యులు అనుకూలమా? వ్యతిరేకమా? అనేది చెప్పాలి. మ్యానిఫెస్టోలో పెట్టినప్పుడే ఆటోడ్రైవర్ల సంక్షేమం కూడా తమ బాధ్యత అని చెప్పాం. ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని పొందుపర్చాం. రానున్న రోజుల్లో దాన్ని అమలు చేసితీరుతాం. ప్రజలను తప్పుదోవ పట్టించేలోగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడటం తగదు” అని అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసిందని సీతక్క విమర్శించారు. ‘ఆర్టీసీ భూములను కబ్జాలు చేసివాళ్లు, కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన వాళ్లు ఇప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారన్నారు. గత ప్రభుత్వం పేదవాళ్లు ఎక్కే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ధరలు పెంచింది. ఇవ్వాళ మేం ఆడవాళ్లకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. దీన్ని బీఆర్‌ఎస్ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పెట్టొద్దా? చెప్పండి? భూములను బీడులుగా పెట్టిన కోటీశ్వర్లకు రైతుబంధు కట్టబెడితే ఏనాడైనా పేదలు రోడ్లెక్కినారా? మీ ఇండ్ల ముందు ధర్నా చేశారా? ఆటో కార్మికులను ముందుపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారా? మీరె ప్పుడు సెంటిమెంట్లతో ఆడుకుంటారు. ఒకరిని ముందు పెడతారు..మీరు వెనుక నుంచి వస్తారు. ఇది బీఆర్‌ఎస్ సభ్యుల నైజం. గతంలో అగ్గిపుల్లలు దొరక్క డ్రామాలు చేస్తే వేరే పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. పేదల మీద పన్నులేసి కోట్ల రూపాయలను పెద్దపెద్ద భూస్వాములకు పంచిపెట్టారు. ఆనాడు ఏ పేదనైనా మాకెందుకు ఇవ్వలేదని రోడ్లు ఎక్కారా? ఆ విధంగా మేం ప్రోత్సహించామా? అరె ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకు ఆరేడువేలు మిగులుతున్నాయని ఆడబిడ్డలు సంతోషడుతుంటే ఎందుకు తట్టుకోలేకపోతురు? ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తే మీకేంటి ప్రాబ్లమ్? ‘ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
గుట్టలో 500 మంది పొట్టగొట్టినోళ్లు..ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతారా? : విప్ బీర్ల అయిలయ్య
‘యాదగిరిగుట్టలో గుట్టపైకి ఆటోలు వెళ్లకుండా నిషేధించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. అక్కడ 500 మంది ఆటోకార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. యాదాద్రి డెవలప్‌మెంట్ పేరుతో 50 శాతం నిధులను దోచుకున్నారు. వైటీడీఏ పేరు చెప్పి కవిత, జగదీశ్‌రెడ్డి ఆస్తులను పోగేసుకున్నారు. ఇప్పుడు అదే బీఆర్‌ఎస్ వాళ్లు ఆటోకార్మికుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. యాదగిరి గుట్టలో ఆటోకార్మికులకు మేలు చేసేందుకు ఈ నెల 11 నుంచి గుట్టపైకి ఆటోలకు అనుమతిస్తున్నాం’ అని అయిలయ్య తెలిపారు..