నిలువు దోపిడీ

– ఫర్టిలైజర్‌ షాపుల
– బ్లాక్‌ మార్కెట్లో అధిక రేట్లకు పత్తి గింజల అమ్మకాలు
– స్టాక్‌ ఉన్నా లేదని చెప్తున్న నిర్వాహకులు
– డిమాండ్‌ ఉన్న యుఎస్‌ 7067 అగ్రి, రేవంత్‌ ప్రవర్ధన్‌ కంపెనీ పత్తి రకాల సీడ్స్‌
– బిల్లు రిసీట్‌లో రూ.853 , విక్రయించేది రూ.1300-1400
– గింజల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు
– పట్టించుకోని అధికారులు
భూమిని నమ్ముకొని ఆరుగాలం రాత్రనకా పగలనకా కష్టపడి పంటలు పండించే రైతులకు కష్టాలు తప్పడంలేదు. పండిన పంటను మార్కెట్లో అమ్మాలన్నా.. అదునుకు పంటలు సాగు చేసేందుకు విత్తనాలు కొనాలన్నా రైతులు ఎప్పుడూ ఏదో ఒకచోట దోపిడీకి గురై అప్పులపాలవుతున్నారే తప్ప ఎలాంటి లాభం చేకూరడం లేదు.
నవతెలంగాణ- కొండమల్లేపల్లి
ఖరీఫ్‌ సాగు రోహిణి కార్తె నెల ప్రారంభం కావడంతో ఈ ఏడాది రైతులు పత్తి పంటను సాగు చేసేందుకు వారికి దగ్గరలోని ఫర్టిలైజర్‌ షాపుల వద్దకు వెళ్లి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. గతేడాది రైతులు అధిక మొత్తంలో పత్తి పంటను సాగు చేశారు. కొంతమంది రైతులు యూఎస్‌ 7067 అగ్రి, రేవంత్‌ ప్రవర్ధన్‌ అనే కంపెనీ రకాల సీడ్స్‌ను సాగు చేశారు. ఆ రకం సీడ్స్‌ పంట దిగుబడి బాగా రావడంతో ఈ పంట సాగు చేసిన రైతులు తోటి రైతులకు ఈ రకం పత్తి పంట దిగుబడి చేస్తే పంట బాగా వస్తుందని చెప్పారు. ఆ రకాల పంటను సాగు చేసేందుకు పత్తి విత్తనాలను కొనుగోలు చేయడానికి కొండమల్లేపల్లి పట్టణంలో సాగర్‌ రోడ్డు హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న పలు ఫర్టిలైజర్‌ షాప్‌ల్లో విత్తనాలను కొనేందుకు వెళ్తున్నారు. ఈ రకం గింజలు షాప్‌లో ఏదో ఒకచోట స్టాక్‌ దాచి ఉన్నప్పటికీ మావద్ద స్టాకు లేవని చెప్తూ వారికి నమ్మకం కలిగినటువంటి రైతులకు మాత్రమే విక్రయిస్తున్నారు.ఈ రకం గింజలు దొరకడం చాలా కష్టంగా ఉందని బ్లాక్‌ మార్కెట్లో మాకే కంపెనీలు అధిక రేట్లకు ఇస్తున్నాయని చెబుతూ ఒక్కో ప్యాకెట్‌కు రూ.1300 నుంచి 1400 వరకు విక్రయిస్తున్నారు. మరి కొంతమంది రైతులకు ఈ రకం గింజలు తమ వద్ద లేవని చెప్తున్నారు. ఖరీఫ్‌ సాగు సమయం ప్రారంభమవుతుండడంతో మున్ముందు గింజలు దొరుకుతాయో లేదో అన్న బెంగతో చేసేదేమీ లేక రైతులు 853 రూపాయల ఎమ్మార్పీ గల పత్తి ప్యాకెట్‌ రూ.1300 1450 రూపాయలకు కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. కొనుగోలు చేసిన రైతులకు ఇచ్చేటటువంటి బిల్లు రిసిప్ట్‌లో పత్తి ప్యాకెట్‌ ధర రూ.853 మాత్రమే రాసిస్తున్నారు. బయట ఎక్కడ ఎవరైనా అడిగితే అధిక రేట్లకు కొన్నామని చెప్పకుండా ఎమ్మార్పీ ధరలకే కొన్నామని చెప్పమని రైతులకు సలహాలిస్తూ ఒక్కో ప్యాకెట్‌ పైన 400 నుంచి 500 రూపాయలు అదనంగా వసూలు చేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలలో ఫ˜ర్టిలైజర్‌ షాప్‌ నిర్వాహకులు వేరే రకం పత్తి గింజలు 10 ప్యాకెట్లు తీసుకుంటే మీరు అడిగిన రకం రెండు ప్యాకెట్లు ఇస్తామని చెబుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌ మార్కెట్లో ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయించేటటువంటి ఫర్టిలైజర్‌ షాప్‌ల పైన దాడులు నిర్వహించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎమ్మార్పీ ధరలకే ఆయా రకాల పత్తి గింజలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. దేవరకొండ డివిజన్‌ పరిధిలోని ఉన్నటువంటి కొండమల్లేపల్లి, దేవరకొండ ,పీఏ పల్లి, చింతపల్లి, చందంపేట, డిండి, నేరేడు గొమ్ము మండలాల్లో ఉన్నటువంటి పలు ఫర్టిలైజర్‌ షాపుల డీలర్లు సబ్‌ డీలర్ల ద్వారా రైతులకు ఇలాంటి రకాల పత్తి గింజలను ఎమ్మార్పీ ధరల కంటే అధికారం రేట్లకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొన్ని రకాల జీరో గ్రేడ్‌ విత్తనాలను సైతం రైతులకు అంటగట్టి రైతులను నిలువునా దోచుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు డివిజన్‌ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఫర్టిలైజర్‌ షాప్‌ల పైన తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్యాకెట్‌ కు రూ.1400 చెబుతున్నారు
రైతు పంది శ్రీనివాస్‌ ,చిలకమర్రి గ్రామం
నాకు మా గ్రామంలో మూడు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు మరో పదకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. పోయిన సంవత్సరం నేను మాచర్ల రెట్ట చింతల వెళ్లి రేవంత్‌ ప్రవర్ధన అనే పత్తి రకం సీడ్స్‌ ను ప్యాకెట్‌ కు రూ.980 పెట్టి కొనుగోలు చేసి పంట సాగు చేశాను. ఆ పంట దిగుబడి బాగా వచ్చింది. ఇప్పుడు అదే రకం సీడ్‌ కోసం కొండమల్లేపల్లి పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌ లో ఉన్నటువంటి శ్రీ ధనలక్ష్మి ఫర్టిలైజర్‌ షాపులకు వెళ్లి అడగగా గింజలు కొనడం నీవల్ల అయితదా ప్యాకెట్‌ కు రూ.1400 రూపాయలు ఇస్తే ఇస్తా లేదంటే మా దగ్గర స్టాక్‌ లేదు అని చెప్పాడు. అంత డబ్బు పెట్టలేక ఇంటికి వెళ్లి పోయాను. అధిక రేట్లకు విక్రయించే ఫర్టిలైజర్‌ షాపుల పైన అధికారులు చర్యలు తీసుకొని ఎమ్మార్పీ ధరలకే విక్రయించేలా చూడాలి.
ఫర్టిలైజర్‌ షాప్‌ లపై అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలి
రైతు గణపురం యాదగిరి గుడిపల్లి
నేను గత సంవత్సరం 7067 అగ్రి కంపెనీ సీడ్స్‌ పత్తి పంటను సాగు చేశాను. పంట దిగుబడి బాగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా అదే రకం పత్తి పంటను సాగు చేద్దామనుకొని కొండమల్లేపల్లి పట్టణంలోని సాగర్‌ రోడ్‌ లో ఉన్నటువంటి ఓ ఫర్టిలైజర్‌ షాపుకు వెళ్లి పత్తి విత్తనాలను అడిగాను. ఈ రకం గింజలు బ్లాక్‌ మార్కెట్లో అమ్ముతున్నారు. ఒక్కో ప్యాకెట్‌ కు 1300 రూపాయలు రేట్‌ పెడితే అమ్ముతాం లేదంటే మా దగ్గర స్టాక్‌ లేదని చెబుతున్నారు. ఇలాంటి షాప్‌లపైన ఉన్నతాధికారులు దాడులు జరిపి చట్టపరంగా చర్యలు తీసుకొని రైతులకు ఎమ్మార్పీ ధరలకే ప్రతి విత్తనాలను విక్రయించేలా చూడాలి.
ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం
మండల వ్యవసాయ అధికారి వెంకన్న
ఫర్టిలైజర్‌ షాప్‌ నిర్వాహకులు రైతులకు పత్తి గింజలను ఎమ్మార్పీ ధరల కంటే బ్లాక్‌ లో అధికంగా రేట్లకు విక్రయించినట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే అలాంటి వారిపై చట్టపరంగా చర్య తీసుకుంటాం. రైతులు విత్తనాలు, ఎరువులను కొనే సమయంలో తప్పనిసరిగా ఫర్టిలైజర్‌ షాప్‌ దుకాణ బిల్‌ రిసీట్‌ను తీసుకోవాలి. ఫర్టిలైజర్‌ షాప్‌లపై తనిఖీలు నిర్వహించి అధిక రేట్లకు విక్రయించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

Spread the love