– సమీక్షా సమావేశంలో కలెక్టర్ గౌతమ్
నవతెలంగాణ-ఖమ్మం
పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలపై విద్యాశాఖ ఇతర శాఖల జిల్లా అధికారులుతో జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిభ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని, జిల్లాలో మొత్తం 70 పరీక్షా కేంద్రాలలో 36578 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు. అలాగే మార్చి 18 నుండి ఏప్రిల్ 02 వరకు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని, ఇందుకోసం జిల్లాలో 97 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పరీక్షలను నిర్వహించాలని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా సుబ్బారావు, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వినోద్, డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్, ఏసిపి సాంబయ్య, వైరా, సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్లు సి.హెచ్.వేణు, రవిబాబు, పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ బి.రవికుమార్, ఆర్టిసి డివిజనల్ మేనేజర్, జిల్లా కోశాధికారి సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
3న జిల్లాలో పల్స్పోలీయో : కలెక్టర్
మార్చి 3వ తేదీన జిల్లాలో పల్స్పోలీయో కార్యక్రమాన్ని అనుబంధ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 0-5 సంవత్సరాల వయస్సు చిన్నారులకు మార్చి 3వ తేదీ వేయనున్న పల్స్పోలీయో ఇమ్యున్కెజేషన్ ఏర్పాట్లపై సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, సంక్షేమ, గ్రామీణాభివృద్ధి అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించి, పలు సూచనలు, ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 92,511 మంది 0-5 సంవత్సరాల లోపు చిన్నారులను గుర్తించడం జరిగిందని, మార్చి 3వ తేదీన వీరందరికి పల్స్పోలీయో ఇమ్యున్కెజేషన్ కొరకు 4,984 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 30 అర్భన్ ప్రాంతాల్లో 252, రూరల్ ప్రాంతాల్లో 843, ట్రైబల్ ప్రాంతాల్లో 151 మొత్తం 1246 కేంద్రాలు, 70 మోబైల్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటితో పాటు బస్స్టాండ్, రైల్వేస్టేషన్, జనసమూహాలు అధికంగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికి పోలీయో చుక్కలు వేయాలని సూచించారు. మార్చి 3వ తేదీన జరిగే ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో మిగిలిన చిన్నారులకు మరుసటి రోజు ఇంటింటికి తిరిగి పోలీయో చుక్కలను వేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సన్యాసయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ సైదులు, డాక్టర్ ప్రమీల, డాక్టర్ ప్రశాంత్, జిల్లా పరిషత్ సి.ఇ. వినోద్, డిఇఓ సోమశేఖర్ శర్మ, డిడి సోషల్ వెల్ఫేర్ సత్యనారాయణ, ఎస్ఇ ట్రాన్స్కో సురేందర్, బిసి.వెల్ఫేర్ అధికారి జ్యోతి, జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి, అనుబంధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.