– అమరజీవి యలమంచి సీతారామయ్య

నవతెలంగాణ-దుమ్ముగూడెం
బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారంలో నిర్విరామ పోరాటయోధుడు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ ప్రజా పోరాటాల ద్వారా ఏజన్సీ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన అమరజీవి యలమంచి సీతారామయ్య మన నుంచి దూరమై దశాబ్దకాలం దాటింది. ఆ మహానాయకుడు మనమధ్య లేక పోయినా ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోయేందుకు నేటికి పార్టీ నాయకులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. యలమంచి సీతారామయ్య పేరు చెబితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన పేరు తెలియని రాజకీయ పార్టీల నాయకులు ఉండరు. మండల ప్రజలు ప్రేమగా వైఎస్‌, పెద్దాయనగా, అయ్యగారిగా పిలవబడే యలమంచి సీతారామయ్య ఏపిలోని గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ల గ్రామంలో రత్తమ్మ, పున్నయ్య దంపతులకు 1923 సంవత్సరంలో మే 5వ తేదీన జన్మించారు. వీరిది ధనిక రైతు కుటుంబం. హైస్కూల్‌ విద్యను పూర్తి చేసి విశాఖలోని ఆంద్రా యూనివర్శిటీలో 1947లో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో స్టూడెంట్‌ ఫెడరేషన్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1947-1948 సంవత్సరంలో తన వాటాకు వచ్చిన భూమి అమ్మి వర్జీనియా పొగాకు వ్యాపారం నిమిత్తం భద్రాచలం డివిజన్‌కు వచ్చి ఆ తరువాత దుమ్ముగూడెం ప్రాంతంలో కొంత వ్యవశాయ భూమి కొనుగోలు చేసి రైతుగా స్థిర పడ్డారు. ఆ రోజుల్లో డిగ్రీ అంటే మంచి ఉన్నత చదువు. తనకు కావాలంటే మంచి ఆఫీసర్‌ ఉద్యోగం వస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ త్యాగం చేశారు. మార్క్సిజాన్ని నమ్మారు. దోపిడీ లేని సమాజాన్ని నిర్మించే కృషిలో భాగస్వామి అయ్యారు. యలమంచి సీతారామయ్య, సుగుణాదేవిలకు ఏడుగురు సంతానం కాగా వీరిలో నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు యలమంచి రవికుమార్‌(పెద్దబాబు) సిపిఐ(ఎం) పార్టీలో వివిధ హోదాలో పని చేయడంతో పాటు డిసిసిబి చైర్మన్‌గా పని చేశారు. రెండవ కుమారుడు యలమంచి వేణుగోపాల్‌ గత ఆరు ఏండ్ల క్రితం వ్యవసాయ పొలంలోనే గుండె పోటుతో మృతి చెందారు. మూడవ కుమారుడు యలమంచి శ్రీనివాసరావు (శ్రీనుబాబు) సిపిఐ(ఎం) మండల పార్టీలో క్రియాశీలకంగా పని చేయడంతో పాటు రైతు సంఘం నాయకుడిగా సొసైటీ డైరెక్టర్‌ గా బాధ్యతల్లో ఉన్నారు. కాగా ఆయన యలమంచి సీతారామయ్య ట్రస్టు పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాలుగవ కుమారుడు వాసుబాబు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రవికుమార్‌ పెద్ద కుమారుడు యలమంచి వంశీకృష్ణ తాతకు తగ్గ మనువడిగా పార్టీలో కీలకంగా పని చేస్తుంటాడు. వంశీ కృష్ణ సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడి బాధ్యతల్లో ఉన్నారు. యలమంచి సీతారామయ్య దర్మపత్ని సుగుణాదేవి వైస్‌కంటే ముందే మృతి చెందారు. దుమ్ముగూడెం ప్రాంతంలో పెత్తందారులు, వడ్డీవ్యాపారులు,పోలీస్‌, ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌ వారు గిరిజన ప్రజలను నిలువు దోపిడి చేస్తుంటే వైయస్‌ వాటిని చూసి చలించారు. తన వ్యవసాయ పనులు చూసుకుంటూనే గిరిజన గ్రామాల ప్రజలను సమీకరించి ఫారెస్టు, వడ్డీ వ్యాపారులు, పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు పడిపారు. గ్రామాలకు రహదారి సౌకర్యం కూడా లేని ఆ రోజుల్లో వైఎస్‌ కాలినడక ద్వారా మండలంలో అన్ని గ్రామాలు తిరిగే వారు. గిరిజన గూడెల్లో వారు పోసే గంజి, జావ తాగుతూ వారితో మమేకంగా ఉండేవారు.
క్రమశిక్షణ వైయస్‌ సొంతం : అమరజీవి వైయస్‌ స్వతాహాగా ఉక్కు క్రమశిక్షణ పాటించేవారు. అనుకున్న సమయానికి అనుకున్న చోటికి చేరడం, అనుకున్న పని చేయడం ఆయనకు అలవాటు. కార్యకర్తలు ఎవరైనా క్రమశిక్షణ పాటించక పోతే గట్టిగా మందలించేవారు. వైఎస్‌ దగ్గరకు పంచాయితీ వెళ్లింది అంటే చాటు ఇతరులు కూడా న్యాయం జరుగుతుంది అనే ధైర్యం ఉండేది. వైయస్‌ తీర్పు న్యాయంగా ఉంటుంది. పార్టీ శ్రేణుల తప్పు చేశారని తెలిస్తే తనదైనశైలిలో మందలించేవారు. కమ్యూనిస్టులు నీతి, నిజాయితీగా జీవించాలి. మనం తప్పు చేస్తే వర్గ శత్రువులు మన తప్పులను ఎత్తి చూపిస్తారు. మనల్ని, మన ఉద్యమాన్ని దెబ్బ తీస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరిక చేసేవారు.
ఎన్నో నిర్బంధాలు దాడులు : వైఎస్‌ తన రాజకీయ జీవితంలో ఎన్నో నిర్బంధాలు దాడులను ఎదుర్కొన్నారు. ఏనాడు నిర్బంధాలకు భయపడలేదు. ఆనాటి కాంగ్రెస్‌ నాయకులు జలగం వెంగళరావు ఉన్న సమయంలో కాంగ్రెస్‌ వాదులు 1971 జూన్‌ 26న దాడి చేసి హత్యాప్రయత్నం చేశారు. తన ఇంటికి వెళుతున్న సమయంలో దారి కాపు కాసి దాడి చేసన ఘటనలో తలకు గాయం అయింది. అయినా వైఎస్‌ చలించలేదు. కాంగ్రెస్‌ నాయకులు వచ్చి సమాధానం చెప్పాలంటూ దాడి జరిగిన చోటే కూర్చున్నారు. దాడిని ఖండిస్తూ జూన్‌ 29 న మూడు వేల మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు. దీంతో దిగి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు తప్పు అయిందంటూ వైఎస్‌కు క్షమాపణ చెప్పారు. 1989లో సంక్రాంతి పండుగ రోజున 25 మంది సాయుధ నక్సలైట్లు వైఎస్‌ ఇంటి పై దాడి చేశారు. ఆ రోజు వైఎస్‌ ఇంట్లో లేక పోవడం వలన కుటుంబ సభ్యులకు హెచ్చరికలు చేసి వెళ్లి పోయారు. వైఎస్‌కు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని గుర్తించిన నక్సలైట్లు సైతం తమ పంథాను మార్చుకున్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మంచి నాయకుడిగా గుర్తింపు వచ్చినప్పటికి ఏనాడు గాడి తప్పక జీవింతాంతం కట్టుకున్న సిద్దాంతం కోసం ఆదర్శ కమ్యూనిస్టుగానే తుది శ్వాస విడిచారు. రేపటి తరాలకు యలమంచి సీతారామయ్య ఆదర్శ కమ్యూనిస్టు యోధుడు అనే చెప్పవచ్చు.

Spread the love