– సీపీఐ(ఎం) నియోజక వర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-భద్రాచలం
అమరవీరుల త్యాగాలతో పునీతమైన భద్రాద్రి నియోజకవర్గం గిరిజన గిరిజనేతరుల ఐక్యతకు నిదర్శనం. అమరవీరుల త్యాగాలతో పునీతమైన పోరుగడ్డ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) ఏడు పర్యాయాలు, సీపీఐ ఒక పర్యాయం మొత్తంగా ఎనిమిది సార్లు ఈ నియోజకవర్గంలో కమ్యునిస్టు ప్రజాప్రతినిధులు గెలిచారు. సీపీఐ(ఎం) తరుఫున ఎంపీగా డాక్టర్ మీడియం బాబురావు గెలిచారు. ఎమ్మెల్యేలుగా 1978 నుండి సీపీఐ(ఎం) ప్రస్థానం ప్రారంభమైంది. కామ్రేడ్ ముర్ల యార్రయ్య రెడ్డి ఒక సారి, కామ్రేడ్ కుంజా బొజ్జీ మూడు సార్లు, కామ్రేడ్ సున్నం రాజయ్య మూడు సార్లు గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి వన్నెతెచ్చారు. ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు జవాబుదారుతనంగా సేవ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి దగ్గర నుండి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు వరకు అన్ని స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులతో కలకలలాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఒకపక్క అరాచక మావోయిస్టు శక్తులు రెండవ పక్క కాంగ్రెస్ నిర్భాందాలు ఈ తరుణంలోనే 1984లో తెలుగుదేశం హౌరు వీటన్నింటినీ తట్టుకొని సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గంలో అనేక వరుస విజయాలు సాధించిన చరిత్ర సీపీఐ(ఎం) సొంతం. మరొక పక్క కాంగ్రెస్ ఎమర్జెన్సీ లాంటి సమయంలోకాంగ్రెస్ నిర్భాందాలను ఎదుర్కొంటూనే ప్రజల కోసం మావోయిస్టుల చేతుల్లో చందర్రావు, బత్తుల భీష్మారావు, శ్యామల వెంకట రేడ్డి అమరులైనారు. టివిఆర్ చంద్రం, ఎలమంచి సీతారామయ్య, బిఎస్ రామయ్య, కుంజా బుజ్జి, సున్నం రాజయ్యలు సైతం కడకంట వరకూ ఎర్ర జెండా నీడలో అశువులు బాశారు. ఇది భద్రాచలం నియోజకవర్గంలో సీపీఐ(ఎం) పోరాటాల చరిత్ర. ఈ చరిత్రను ప్రజలకు గుర్తుండకుండా చేయటం కోసం పాలకవర్గాలు కుట్రలు, కుతంత్రాలు చేశాయి. ఈ నియోజకవర్గాన్ని మూడు ముక్కలుగా చేశారు. ప్రజలకు అన్యాయం చేశాయి. నియోజకవర్గ అభివృద్ధి నాడు సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు సాధించినవే తప్ప ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలు అదనంగా ఈ కాలంలో సాధించింది ఏమీ లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా భద్రాద్రి జిల్లా భద్రాద్రి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారు. ఆనాడు ఉమ్మడిగా ఉన్నటువంటి భద్రాచలం నియోజకవర్గం లోని చింతూరు, వీఆర్ పురం, కూనవరం, భద్రాచలం మండలాలను తూర్పుగోదావరి జిల్లాలోకి అలాగే వెంకటాపురం, వాజేడు మండలాలను ములుగు జిల్లాలోకి మార్చి ప్రజలపై తమ కసిని కేంద్ర బిజేపి తీర్చుకున్నది. సీపీఐ(ఎం) పట్టును తగ్గించాలని ప్రజలతో ఉన్న బంధాన్ని లేకుండా చేయాలని పాలకవర్గాలు చేసినటువంటి ఈ కుట్రలో ప్రజలు సమిధలు అయ్యారని చెప్పక తప్పదు. పోలవరం బ్యాక్ వాటర్ వలన భద్రాచలం పట్టణంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని మానసిక ఆవేదనను పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఈ పాపం బీజేపీ దే. చివరకు నిత్యం శ్రీరామ జపం చేసే బీజేపీ భద్రాద్రి రామాలయాన్ని, రామున్ని సైతం జల సమాధి చేసే ప్రమాదకర నిర్ణయం బీజేపీ తీసుకుంది. అందుకు కారణం భద్రాద్రి రాముడు మతోన్మాద రాముడు కాదు లౌకికవాది అనేది మేధావుల చర్చ. బిజెపి తన సొంతం హిందుత్వ ఎజెండా కోసం ఇటువంటి నిర్ణయాలకు పూనుకుంది. చివరకు భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలన్న రెండు తెలుగు రాష్ట్రాలను ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బిజెపిపై ఉన్నది. కానీ ఆ పని బిజెపి చేయదు. ఫలితంగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలే మూల్యం చెల్లించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.
ఖచ్చితంగా పాలకవర్గాల మెడలు వంచి ప్రజల హక్కులు సాధించడానికి సీపీఐ(ఎం) పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలు సీపీఐ(ఎం) పోరాట చరిత్రను అర్ధం చేసుకుంటున్నారు. ఆదరిస్తారని అభిలాషిస్తు నియోజకవర్గంలోని సీపీఐ(ఎం) తరఫున అశువులు పాసిన అమరవీరుల త్యాగాలను వృధా కానీయకుండా వారి లక్ష్యం ఆశయం కోసం పనిచేయటమే నేడు వారికి మనవిచ్చే ఘనమైన నిజమైన నివాళి.