అమరజీవి ముర్ల యర్రయ్యరెడ్డి

నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత అల్లూరి జిల్లా, విఆర్‌పురం మండలం జీడిగుప్ప గ్రామంలో అమరజీవి ముర్ల యర్రయ్యరెడ్డి జన్మించారు. ఉమ్మడి కమ్యూనిస్ట్‌ పార్టీలో ఉంటూ… ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్వహించారు. అనంతరం కమ్యునిస్ట్‌ పార్టీలో చీలిక అనంతరం సిపిఐ (ఎం)లో చేరి చురుకైన పాత్ర పోషించారు. భద్రాచలం నియోజకవర్గంలో పార్టీ బలమైన నిర్మాణానికి పునాదులు వేసిన నాయకులలో ముర్ల యర్రయ్య రెడ్డి ఒకరు. కాంగ్రెస్‌ పార్టీ నిర్బంధాలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. ఫారెస్టు అధికారుల వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, తునికాకు పోరాటాలు చేసారు. ఎమర్జన్సీ కాలంలో అజ్ఞాత జీవితం గడిపారు. సిపిఐ (ఎం) తరపున భద్రాచలం నియొజకవర్గం నుండి రెండు పర్యాయాలు ( 1978, 1983) ఎంఎల్‌ఏ గ గెలిచి శాసనసభలో ప్రాతినిత్యం వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన గళాన్ని వినిపించారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధిలో ముర్ల యర్రయ్య రెడ్డి పాత్ర గణనీయం. నాదెండ్ల భాస్కర్‌ రావు, నందమూరి తారక రామారావు రాజకీయ సంక్షోభం సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంకోసం, పార్టీ నిర్ణయం మేరకు నందమూరి తారక రామారావుకి ఓటు వేయటం జరిగింది. విఆర్‌ పురం, వేలేరుపాడు, చర్ల మండలాల్లో భూ పోరాటాలు నిర్వహించి వందలాది ఎకరాల భూములు ఇప్పించారు. ఆదివాసీ సమస్యల పరిష్కరానికి రాజీలేని అనేక పోరాటాలు చేసారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరానికి నిబద్దతతో పనిచేసారు. ఓంకార్‌ ప్రభావంతో సీపీఎం పార్టీ లో చేరి చివర శ్వాసవరకు ఎర్ర జెండా నీడలో నిజాయితీగా జీవించారు.

Spread the love