వరి, మొక్కజొన్న కొనుగోలు చేయాలి

– మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్నను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి – సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
పండిన ప్రతి వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ నిబంధనల పేరుతో పూర్తి పంటను కొనుగోలు చేయకపోవటం సరైన పద్ధతికాదని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలియచేశారు. ఇప్పటికే ఇటీవల కురిసిన వర్షాలతో అలాగే కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిచాయని వాటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మళ్ళీ పంటలు కొనుగోలులో జాప్యం వల్ల ప్రజలకు నష్టం ఏర్పడుతుందని వారన్నారు. జిల్లాలో 90,709 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారని, పండిన ప్రతి మొక్కజొన్న గింజనూ మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఎకరానికి 40 నుండి 50 క్వింటాళ్ళ వరకు మొక్కజొన్న దిగుమతి వస్తున్నప్పటికీ, మార్క్‌ఫెడ్‌ అధికారులు ఎకరాకు 26 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన విధించటం రైతులను ఇబ్బంది పెట్టడమేనన్నారు. మిగిలిన 10 నుండి 15 క్వింటాళ్ళ మక్కలను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు తలలు పట్టుకుంటున్నారని అన్నారు. ఆన్‌లైన్‌లో సాగు వివరాలు నమోదు కాకపోయినా, కౌలుదారుల పంట ఉత్పత్తులను కొనేది లేదనే నిబంధన కూడా రైతులను ఇరకాటంలో పెడుతున్నదని అన్నారు. వివిధ రకాల కొర్రీలు పెడుతూ మార్క్‌ఫెడ్‌ అధికారులు పంటలు కొనుగోలు చేయడం లేదన్నారు. పండిన ప్రతి గింజను మార్క్‌ఫెడ్‌ సంస్థ కొనుగోలు చేయాలని తెలియజేశారు. అదేవిధంగా వడ్లు నేటికీ కొనుగోలు కేంద్రాల వద్దే వుంటున్నాయని తక్షణమే కొన్న ప్రతి బస్తాను మిల్లులకు తరలించాలని వర్షాలు వచ్చే వాతావరణ సూచన వల్ల వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆందోళన చెందుతున్నారని త్వరితగతిన కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. వరి కొనుగోలు విషయంలో మిల్లుల యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాయని, తరుగు పేరుతో దోపిడీ జరుగుతుందని సుమారు ప్రతి బస్తాకు 6 కేజీల వరకు కొనుగోలు కేంద్రం వద్ద మరియు మిల్లర్ల వద్ద తరుగు తీయడంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని, దీనిపైన జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు నష్టం జరగకుండా తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసి మద్ధతు ధర వచ్చేలా చూడాలన్నారు. జిల్లా మంత్రి, కలెక్టర్‌ జోక్యం చేసుకొని ప్రతి గింజ కొనుగోలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

Spread the love