జాబ్‌ మేళా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌

ఖమ్మం : పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్‌ మేళా ఏర్పాట్లను పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌ పరిశీలించారు. ఆదివారం జరిగే జాబ్‌ మేళాకు 15 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు రానున్న నేపథ్యంలో పోలీస్‌ కమిషనర్‌ శనివారం నగరంలోని ఎస్బీఐటి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బంది చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా వివిధ ప్రముఖ కంపెనీలను ఒప్పించి జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐటీ, హౌటల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, విప్రో వంటి సంస్థలు, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు మేళాలో పాల్గొంటున్నట్లు తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగిన దాదాపు 8 వేల మందికి పైగా ఈ జాబ్‌ మేళా ద్వారా ప్రయివేటు, కార్పొరేట్‌ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు పోలీస్‌ రిక్రూట్మెంట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం జాబ్‌ మేళాలను సైతం నిర్వహిస్తూ ఆదర్శవంతమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ సుభాష్‌ చంద్ర బోస్‌, నగర ఏసీపీ గణేష్‌, ఎస్బీ ఏసీపీ ప్రసన్న కుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ రామోజీ రమేష్‌ పాల్గొన్నారు.

Spread the love