– మూడు సార్లు అసెంబ్లీకి వెళ్లినప్పటికీ…. కడవరకూ సాధారణ జీవితమే
– పార్టీ సిద్ధాంతాలను వదల కుండా ప్రజాజీవితంలో..
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్న గూడెం గ్రామానికి చెందిన కుంజా బొజ్జి 1952లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. 1970లో వర రామచంద్రపురం మండలం రామవరం సర్పంచిగా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమిపాలయ్యారు. ఏజెన్సీలో నిరుపేద గిరిజన, గిరిజనేతరుల సమస్యల పరిష్కారం కోసం, తునికాకు కార్మికుల కూలీ ధరల పెంపు కోసం పలు ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. ఎప్పుడు పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి సల్పిన కుంజా బొజ్జిని ఏజెన్సీ సుందరయ్యగా పలువురు పిలుస్తారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985లో సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలుగుదేశం మద్దతుతో పోటీ చేసిన బొజ్జి 1989, 94లలో సైతం విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు.
కుంజా బొజ్జి 1950లో సాయుధ తెలంగాణా పోరాటంలో గెరిల్లా దళాల కొరియర్‌గా పనిచేశాడు. సీపీఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1952లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాడు. పార్టీ తరఫున అనేక పోరాటాలు చేశారు. అనేక పర్యాయాలు అరెస్టు అయి జైలు జీవితం గడిపారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన నేత ఆయన. ఆయన గ్రామానికి కనీసం బస్సు సౌకర్యం కూడా ఉండేది కాదు. అటువంటి గ్రామం నుంచి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కుంజా బొజ్జి. తరువాత సైకిల్ మీద తన ప్రయాణాలు సాగించేవారు. ఎంత దూరం అయినా ప్రజల కోసం సైకిల్ పైనే వెళ్లేవారు. ఈయనకు మావోయిస్టుల నుంచి ఎన్నో సార్లు బెదిరింపులు వచ్చేవి. కానీ, ఏనాడూ ఆ బెదిరింపులకు అయన లొంగలేదు. పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించారు. దీంతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.
ప్రజల్లో ఆయనకు ఉన్న నమ్మకంతోనే వరుసగా మూడుసార్లు భద్రాచలం నుంచి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 1985-1999 వరకు మూడు సార్లు అధిక మెజారిటీతో గెలిచిన నేతగా ఆయనకు గుర్తింపు ఇచ్చారు. ప్రజలు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లిన నాయకుడు కుంజా బొజ్జి. అంతంత మాత్రం ఆర్థిక స్థితిలోనూ ఆయన తనకున్నదానిని ప్రజల కోసమే ఖర్చు చేసేవారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా…చివరి వరకు పూరిగుడిసె లోనే జీవనం సాగించిన ప్రజా నాయకుడు ఆయన. వయసు మీదపడినా తునికాకు సేకరిస్తూ జీవించారు. కుంజా బొజ్జి ఆయన భార్య మరణించడంతో ఒంటరి అయ్యారు. అప్పటి నుంచి ఆయన భద్రాచలంలో కూతురి ఇంటివద్ద ఉంటున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందజేశాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తన దగ్గరకు వచ్చిన ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలని పరితపించేవారు. అరుదైన నాయకుడిగా కుంజా బొజ్జి చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పటి తరం నేతలకు ఆయన జీవితం ఆదర్శప్రాయం.