– పైన బ్రాండెడ్.. లోన కల్తీ
– అసలుకు నకిలీకి తేడా తెలియకుండా లేబుల్స్
– బ్రాండెడ్ కంపెనీల పేరుతో దందా
– తిన్నా తాగినా ప్రమాదమే..
– ఎక్స్‌పైరీ వస్తువులు.. అందంగా ప్యాకింగ్
– అధికారుల తనిఖీలు అంతంతే..
– ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు
కాదేదీ కల్తీకనర్హం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. పాలపొడి, వంటనూనె, కొబ్బరినూనె, నెయ్యి, తేనె, అల్లంపేస్ట్ ఇలా తినే వస్తువుల నుంచి తాగే శీతల పానీయాలు, సబ్బులు, మసాలాలు ఏదైనా కల్తీ చేసేస్తున్నారు. డేట్ అయిపోయిన వస్తువులను అందంగా ప్యాకింగ్ చేసి లేబుల్స్ వేసి అమ్ముతున్నారు.
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజల ఆరోగ్యంతో తమకేం పని.. వ్యాపారమే పరమావధిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వినియోగదారులకు.. ఆ వస్తువులు నకిలీవా.. మంచివా తెలియకుండా బ్రాండెడ్ కంపెనీల పేరుతో అమ్ముతున్నారు. పైన స్టిక్కర్ చూస్త్తే బ్రాండెడ్.. లోన వస్తువులు కల్తీ ఉంటున్నాయి.
తాజాగా హైదరాబాద్ నగరంలో నకిలీ అల్లం పేస్ట్ తయారీ బయటపడింది. ఇలా తరచూ నకిలీ వస్తువులు, ప్యాకింగ్‌లో పురుగులు బయటపడుతున్నా అధికారుల తనిఖీలు.. చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయని ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్నాయి. చూస్తూ వూరుకుంటే మేస్తూ పోయిన చందంగా హైదరాబాద్ నగరంలో పోనుపోను ఎంపిక చేశామని వివరించారు. ఆహార కల్తీ మాఫియా విజృంభిస్తోంది. నీరు, తిండి, రక్తం, పాలు, పాలపొడి, పసుపు మొదలు కారం, పండ్లు, శీతల పానీయాలతోపాటు వంటనూనెల దాకా అన్నింటా పెచ్చరిల్లుతున్న కల్తీ దందా ప్రజారోగ్యాన్ని కుళ్లబొడుస్తోంది. చట్టాలు ఉన్నా వాటిని సరిగా అమలు చేయకుండా.. తూతూమంత్రంగా కొనసాగుతున్న దాడులు, మోసగాళ్లకు శిక్షలు పెద్దగా పడకపోవడంతో నగరంలో నలుమూలలా కల్తీ మాఫియా పెరుగుతోంది. రసాయనాలు కలగలసిన కల్తీ వస్తువులతో జనం కడుపులో విషం నింపుతున్నారు. పాలల్లో కల్తీ పసిబిడ్డల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుండగా.. ఎక్స్‌పైరీ వస్తువులు, రసాయనాల వినియోగం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. నూనెలు తదితరాల కల్తీ క్యాన్సర్లు, పేగుల్లో పుండ్లకు కారణభూతమవుతోంది. వీటి వెనుక పెద్ద పెద్ద తలకాయల హస్తం ఉండటం.. రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. చిన్న చిన్న వారిపై దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
గరంమసాల నుంచి నూనెవరకు
గరం మసాల నుంచి నూనె వరకు ప్రతొక్కటీ కల్తీ చేస్తున్నారు. జంతువుల కొవ్వు, కళేబరాల నుంచి తీసిన నూనె లీటర్ రూ.50 నుంచి రూ.70 ధరకు విక్రయిస్తున్నారు. దానిని ప్యూరిఫై చేసి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. చిన్న హోటల్ నుంచి ఓ మోస్తరు పెద్ద హోటళ్లకు దీన్ని సరఫరా చేస్తున్నారు. హోటళ్లకు వచ్చే వినియోగదారులకు అనుమానాలు రాకుండా నిర్వాహకులు అసలైన నూనె సగం, నకిలీ నూనె సగం వాడుతుంటారు. డబ్బాలలో నింపి విక్రయిస్తుండటంతో కొందరు మంచి నూనెగా భావించి కొంటున్నారు. నకిలీ నూనె పామాయిల్‌లా తెల్లగా గడ్డకట్టి ఉంటుంది. నూనె దురాస్వన వస్తే అది కచ్చితంగా నకిలీదేనని చెప్పొచ్చు. డాల్డాలా ఉండే ఈ నకిలీ ఆయిల్ అసలు డాల్డా, పామాయిల్ కరిగే సమయం కంటే ఆలస్యంగా కరుగుతుంది. ఈ నూనెలు వాడిన ఆహారం తింటే భవిష్యత్‌లో గుండె, ఊపిరితిత్తులు, కాలేయంపై ప్రభావం పడుతుంది.
ఐదు రోజుల్లో మూడు కేసులు
ప్రముఖ కంపెనీలకు చెందిన టీపౌడర్లు, వాషింగ్ పౌడర్ల పేరుతో నకిలీ వస్తువులు తయారీ చేస్తూ దుకాణదారులకు సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను గత శనివారం సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2కోట్ల విలువైన కోకోనట్ ఆయిల్, టీ పౌండర్, లైజాల్, హార్పిక్, ఎవరెస్ట్ తదితర కంపెనీలకు చెందిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గడువుతీరిన రసాయనాలతో బూందీ, మిక్చర్ తయారీ చేస్తూ మార్కెట్‌లో సరఫరా చేసిన నిందితుడిని గత సోమవారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. తాజాగా నగరంలో సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్సు పోలీసులు బేగంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నకిలీ అల్లం పేస్టు తయారీదారులు నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.5లక్షల విలువగల అల్లంపేస్ట్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
సులువుగా సంపాదన కోసం
కష్టపడకుండానే సులువుగా డబ్బులు సంపాదించాలన్న దురాలోచనతో అన్నిటినీ కల్తీ చేస్తున్నారు. పాడుబడ్డ కార్భానా, గోదాంను అడ్డాగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్నారు. ఇంకొందరు కుటీర పరిశ్రమలాగా ఏకంగా ఇంట్లోనే తయారు చేస్తున్నారు. గడువుతీరిన వాటిని తీసుకొచ్చి కొత్తగా ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నారు. బెల్లంతో పానకం తయారు చేసి వాటిలో కెమికల్స్ కలిపి తేనెగా అమ్ముతున్నారు. డాల్డా, పామాయిల్, నకిలీ నెయ్యి తయారు చేస్తూ స్థానిక కిరాణ జనరల్ స్టోర్స్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. డేట్ అయిపోయిన మందులను కూడా.. వాటిపై స్ట్రిక్కర్స్ తొలగించి కొత్త వాటిగా మార్పు చేసి మెడికల్ షాపుల్లో అమ్ముతున్న వైనాలు జరుగుతున్నాయి. కల్తీ అయిన ఆహార పదార్థాలను తినకూడదని వైద్యాధికారులు చెబుతున్నా.. సూచనల వరకే పరిమితమవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటే తప్ప ఇలాంటి కల్తీలను అరికట్టడం సాధ్యపడదని విద్యావేత్తలు అంటున్నారు.