ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Peaceful start of inter exams– మొదటిరోజు 4,88,113 మంది హాజరు
– 19,641 మంది గైర్హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటిరోజు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు 5,07,754 మంది దరఖాస్తు చేయగా, 4,88,113 (96.14 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 19,641 (3.86 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. కరీంనగర్‌లో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, జనగామలో ఒకరు చొప్పున ముగ్గురు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులను నమోదు చేశామని పేర్కొన్నారు. సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు సెట్‌ ఏ ప్రశ్నాపత్రాన్ని  ఎంపిక చేశామని వివరించారు. నల్లగొండ, మెదక్‌, జనగామ, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఇంటర్‌ బోర్డు నుంచి పరిశీలకులు వెళ్లి పరీక్షను పరిశీలించారని తెలిపారు. ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కొనసాగిందని పేర్కొన్నారు. గురువారం నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. వారికి సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్ష ఉంటుంది.
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉన్న శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆయన ఆదేశించారు. మొబైల్‌ఫోన్లను పరీక్షా కేంద్రాల వద్ద అనుమతించొద్దని కోరారు.

Spread the love