– మతరాజ్య స్ధాపనకు ఆ పార్టీ కుట్రలు
– ప్రజల నరనరాల్లో మత మౌఢ్యాన్ని ఎక్కించే ప్రయత్నం
– ప్రశ్నించే గొంతుకలపై ఉక్కు పాదం
– ఎన్‌ఐఏను అడ్డంపెట్టుకుని ఉద్యమ కారులపై కేసులు
– ఇక్కడి కాంగ్రెస్ పాలనలో సైతం పౌరహక్కులపై అప్రకటిత నిషేధం
– నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి
– పౌరహక్కుల సంఘం 50వ వార్షికోత్సవ సదస్సు పిలుపు
నవతెలంగాణ – హైదరాబాద్
” దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. ప్రజల నరనరాల్లో హిందూత్వ మౌఢ్యాన్ని ఎక్కించి జాతుల మధ్య, ప్రజల మధ్య వైషమ్యాల్ని పెంచుతోంది. 2024లో ఆ పార్టీ మరోసారీ గెలిస్తే ఆర్‌ఎస్‌ఎస్ వందో వార్షికోత్సవమైన 2025 నాటికి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు రంగం సిద్దం చేస్తుంది. భారత రాజ్యాంగం ఉనికికే ప్రమాదం వస్తుంది. ప్రశ్నించే గొంతుకలను ఎన్‌ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలతో అణచి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఐక్యంగా ఉద్యమించి ఇండియాను ఫాసిస్టు దేశంగా మార్చే కుట్రలను తిపికొట్టాలి” అని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. పౌరహక్కుల సంఘం 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ”ఫాసిజాన్ని వ్యతిరేకిద్దాం…ప్రజాస్వామిక హక్కులకై పోరాడుతాం” అనే నినాదంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగే సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త హర్షమందర్ మాట్లాడుతూ ”ఒక ముస్లిం యువకుడు రైలు పట్టాలపై నడుచుకుంటూ పోతుంటే ఓ కానిస్టేబుల్ అతన్ని కాల్చి చంపుతాడు. ఓ ముస్లిం బాలుడు గణేష్ మంటపంలోకి చొరబడ్డారని అతన్ని చితక బాదుతారు. ఎక్కడికి పోతోంది ఈ దేశం? మోడీ నేతృత్వలోని బీజేపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఓ వర్గంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. మెజార్టీ ప్రజల మద్దతు సైతం ఇందుకు కూడగడతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసం వారి మెదళ్లలో మతం అనే డ్రగ్‌ను జొప్పిస్తోందని అన్నారు. కాషాయ దళం మరోసారి గద్దెనెక్కితే రాజ్యాంగం ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూలర్ అనే పదాన్ని, రాజ్యాంగ పీఠికలనుంచి తొలగించి దాన్ని కోరలు లేని పాములా మారుస్తున్నారు. దేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ ముస్లిం దేశంగా మారితే గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి పరిణితి చెందిన రాజకీయ నాయకులు, మేధావులు భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లేలా రాజ్యాంగాన్ని రూపొందించి భారత్‌ను ప్రపంచం మెచ్చే ప్రజాస్వామ్య దేశంగా మార్చారని గుర్తు చేశారు. ఈ రకంగా లౌకిక స్ఫూర్తితో ఏర్పడ్డ ప్రజాస్వామ్యానికి మోడీ సర్కార్ వల్ల ప్రమాదం ఏర్పడ్డ నేపథ్యంలో ప్రజలందరూ ఐక్యంగా పోరాడలని హర్షమందర్ ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని గుప్పిట్లో ఉంచుకునేందుకు పెట్టుబడిదారి వర్గానికి చెందిన మార్కెట్ శక్తులు పాలకులను తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారని ఆరోపించారు. వారిని ఎదిరించి పాలకులు ఏం చేయలేని పరిస్థితి ఈ దేశంలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. అదాని లాంటి గుత్తా పెట్టుబడిదారులకు కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. వాటిని ప్రశ్నించే మేధావి వర్గాన్ని ఎన్‌ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలతో అణచి వేస్తోందని గుర్తు చేశారు. ఊపా చట్టాన్ని ప్రయోగించి ప్రొఫెసర్ సాయిబాబా లాంటి హక్కుల ఉద్యమ కారులను పదేండ్లు నిర్భందించారని విమర్శించారు. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు బుల్డోజర్ జస్టిస్ అనే కొత్త ఆటవిక న్యాయాన్ని తెరపైకి తెచ్చి దానికి ప్రజామోదం ఉందని చెప్పే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ప్రమాదమని హెచ్చరించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రజా హక్కులకై పోరాడుతున్న వ్యక్తులపై రాజ్య నిర్భందం గత కొన్నేండ్లుగా మరింత పెరిగిందని చెప్పారు. ప్రజల కోసం పని చేసే వారిని నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చైతన్య మహిళా సంఘం నేతలను అరెస్ట్ చేయడం, పౌరహక్కుల సంఘం ర్యాలీకి అనుమతివ్వక పోవడం లాంటి చర్యలు ఇందుకు అద్దం పడుతున్నాయని చెప్పారు. పౌర హక్కులను కాపాడుతానని అధికారంలోకి రాక ముందు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పాత సర్కార్ బాటలో నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైర్ సీనియర్ జర్నలిస్ట్ హర్ఫాఖానుం షేర్వాని మాట్లాడుతూ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి వారి హక్కులను కాలరాసేందుకు కామన్ సివిల్ కోడ్‌ను బీజేపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని విమర్శించారు. వారిని మెజార్టీ ప్రజలకు శత్రువులుగా చూపేందుకు కుట్ర సాగుతోందని చెప్పారు. దేశంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న ఫాసిస్ట్ దోరణులను ప్రశ్నించే వారిపై హిందూ వ్యతిరేకి, దేశ ద్రోహి అనే ముద్ర వేస్తున్నారని విమర్శించారు. ఈ చర్యలకు దేశంలోని మెజార్టీ మీడియా సైతం వత్తాసు పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ ”ఒక సైకిల్ దొంగ తనం చేసిన కేసులో ఓ వ్యక్తి పద్నాగేళ్లుగా జైల్లో మగ్గాడు. అతను ఎందుకు జైలు కెళ్లాడో జైలు అధికారులు, చట్టం, సర్కార్ మర్చి పోయింది. ఓ సామాజిక వేత్త పిల్ వేస్తే గాని బయటకు రాలేదు. తీవ్ర చర్చలు వాదోప వాదనల తర్వాత కోర్టు బాదితునికి రూ. 30 వేల నష్ట పరిహారం ఇచ్చి విడుదల చేసింది. ఇది ఈ దేశంలోని పోలీస్ వ్యవస్థ తీరు” అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు ఎందుకు పెడుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయనడానికి ఈ కేసు ఉదహరణ అని చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసుల్లో ఎంతో మంది జైల్లో మగ్గుతున్నారని అన్నారు. ప్రజలు తమ హక్కులను కాపాడుకునేందుకు స్వయంగా పోరాడాలని కోరారు. ప్రొఫెసర్ కాత్యయని విద్మహే మాట్లాడుతూ రామనాధం, పురుషోత్తం లాంటి ఎందరో నాయకులను రాజ్యం కాల్చి చంపినా మడమ తిప్పక 50 ఏండ్లుగా హక్కుల కోసం పోరాడుతున్నారని కొనియాడారు. ప్రభుత్వ నిర్బంధాలకు వ్యతిరేకంగా సంఘటితంగా హక్కుల ఉద్యమంలో బాగస్వామ్యములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మన్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.