– ఉద్యోగాలకే ఎసరు
– వీధులపాలవుతున్న కుటుంబాలు
– ప్రత్యామ్నాయాలు చూపాలి : టీఎస్‌యూఈఈయూ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌శాఖలో బిల్ కలెక్టర్లకు గృహజ్యోతి కష్టాలొచ్చిపడ్డాయి. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రకటించడంతో బిల్లులు చెల్లించేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిం ది. దాదాపు 30 ఏండ్లుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో 600 మంది బిల్ కలెక్టర్లు కమిషన్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరి కొలువులకే ఎసరు వచ్చింది. బిల్ కలెక్షన్ తగ్గడంతో సిబ్బందిని తగ్గించుకోవాలని విద్యు త్ సంస్థలు భావిస్తున్నాయి. బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్న 600 మంది ఉమ్మడి రాష్ట్రంలో ఏసీఎస్‌ఈబీ ఉన్నప్పటి నుంచి, ఇప్పటి డిస్కంల వరకూ పనిచేస్తున్నారు. 1987లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థల్లో స్లాబ్ సిస్టం అమల్లో ఉండేది. అప్పుడు వీరందరూ శాశ్వత పనివిధానంలో ఏజెన్సీల ద్వారా నియమితులయ్యారు. విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో క్యాషియర్స్ చేయాల్సిన పనిని కాంట్రాక్ట్ పద్ధతిలో బిల్ కలెక్టర్ల ద్వారా చేయిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ పేరుతో ప్రజలు విద్యుత్ బిల్ కలెక్షన్ సెంటర్ల వద్దకు వచ్చి డబ్బులు చెల్లించడం తగ్గిపోయింది. విద్యుత్ సంస్థలు కూడా ఆన్‌లైన్‌లోనే డబ్బులు కట్టండంటూ ప్రచారం చేయడంతో బిల్ కలెక్టర్లకు వచ్చే కమిషన్ మొత్తం గణనీయంగా పడిపోయింది. గృహజ్యోతి పథకం అమల్లోకి రాకముందు వీరికి నెలకు కమిషన్ పద్ధతిలో నెలకు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు వచ్చేది. ఇప్పుడు ఆ సొమ్ము కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదని బిల్ కలెక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన 18 ఏండ్లుగా యాజమాన్యాలు వీరికిచ్చే పీస్‌రేట్ చార్జీలను కూడా పెంచలేదు. 2005లో సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం చేస్తే పెరిగిన కమిషనే వీరికి ఇప్పటికీ వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో వీరు కూడా సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. 36 రోజులు విధులకు దూరంగా ఉండి, ఆర్థికంగా నష్టపోయారు. విద్యుత్ సంస్థల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 23 వేల మంది కార్మికులను ఆర్టిజన్‌లుగా గుర్తించారు. కానీ అప్పటికే 25 ఏండ్లుగా రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లను ఈపీఎఫ్, ఈఎస్‌ఐ లేవనే సాకుతో 2016లో ఆర్టిజన్స్‌గా గుర్తించలేదు. శాశ్వత పని విధానంలో ఏండ్ల తరబడిి పని చేస్తున్న కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ ఇవ్వకుండా పని చేయించుకోవడం ముమ్మాటికీ యాజమాన్య నిర్లక్ష్యమే! దీనికి ఆయా విద్యుత్ సంస్థలే జవాబుదారీ వహించాల్సి ఉంటుంది. కానీ దాన్ని ఒప్పుకొనేందుకు ప్రభుత్వం, యాజమాన్యం సిద్ధంగా లేకపోవడం గమనార్హం. కరోనా సమయంలోనూ బిల్ కలెక్టర్లు విధులు నిర్వహించారు. అయినా ప్రభుత్వ గుర్తింపునకు నోచుకోలేదు. విద్యుత్ సంస్థల్లో పర్మినెంట్ కార్మికులకు నాలుగు సార్లు వేతన ఒప్పందాలు జరిగినా, వీరికి మాత్రం కమీషన్ చార్జీలు పైసా పెరగలేదు. ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్లింపు, గ్రామాల్లో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది కూడా విద్యుత్ బిల్లులు వసూలు చేస్తుండటంతో బిల్ కలెక్లర్ల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈనెల 1వ తేదీ నుంచి విద్యుత్ సంస్థలు వినియోగదారులకు గృహజ్యోతి స్కీం ద్వారా జీరో బిల్లులు ఇస్తున్నాయి. దీనితో ఉన్న కొద్ది ఆర్థిక ఉపాధిని కూడా కోల్పోతున్నారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మానవతా కోణంలో తమకు ప్రత్యామ్నాయ పని చూపాలనీ, ఆర్టిజన్లుగా గుర్తించి వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. మూడు దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఏదో ఒక రోజు సంస్థలో పర్మినెంట్ అవుతామనే ఆశతో పనిచేస్తున్నామని బిల్ కలెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ ఆఫీసుల్లో ఉద్యోగాలు ఇవ్వాలి
ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసుల్లో బిల్ కలెక్టర్ల సేవల్ని వినియోగిం చుకోవాలి. మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని వీధులపాలు చేయడం సరికాదు. బిల్ కలెక్షన్లు ఆన్‌లైన్ అయ్యాక వారి పీస్‌రేట్ కమిషన్ తగ్గిపోయింది. గృహజ్యోతితో వచ్చే ఆదాయం పూర్తిగా పోయింది. అందువల్ల వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి. ఆర్టిజన్లుగా గుర్తించాలి. వారికి అన్యాయం చేస్తే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తాం.
– కే ఈశ్వరరావు, అధ్యక్షులు, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్
30 ఏండ్లుగా చేస్తున్నా…పీస్ రేటే…
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 30 మంది బిల్ కలెక్టర్లు 20 ఏండ్లుగా పనిచేస్తున్నారు. ఇప్పటికీ మాకు పీస్‌రేట్ జీతాలే చెల్లిస్తున్నారు. సంస్థను నమ్ముకొని, మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తిస్తారనే ఆశతో ఇన్నేండ్లుగా పనిచేస్తున్నాం. ప్రభుత్వరంగ సంస్థలే ఇలా వ్యవహరిస్తే…మా సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలి. తక్షణం ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించి, మమ్మల్ని ఆర్టిజన్లుగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలి.
– పీ గంగాప్రసాద్, బిల్ కలెక్టర్, నిర్మల్ ఈఆర్‌ఓ
జీవితాలు కోల్పోయాం
బిల్ కలెక్టర్లుగా పీస్ రేట్ జీతాలతో విద్యుత్ సంస్థల్లో మూడు దశాబ్దాలుగా పనిచేస్తూ జీవితాలు కోల్పోయాం. ఏదో ఒకరోజు మా సేవల్ని గుర్తించి, పర్మినెంట్ చేస్తారనే ఆశతో ఉన్నాం. గృహజ్యోతితో ఇప్పుడున్న ఉపాధే కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి.
– కే రమేష్, బిల్ కలెక్టర్, భద్రాచలం ఈఆర్‌ఓ