ప్రపంచ శాంతికోసమే తాము తాపత్రయ పడుతున్నట్లు చెప్పిన వారందరూ చరిత్రలో అశాంతికి మూలకారకులుగా రుజువైంది. ఇప్పటికీ ఆదే జరుగుతోందా? పాలస్తీనా ప్రాంతాలను కబళించిన ఇజ్రాయిల్ ఇప్పుడు మొత్తం అరబ్బులనే అంతం చేసేందుకు, వారి ప్రాంతాల నుంచి వెళ్లగొట్టేందుకు జరుపుతున్న మారణకాండ మంగళవారం నాటికి 165వ రోజులో ప్రవేశించింది. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 32వేలకు చేరుకుంది. గాయపడిన వారు, నిలువనీడ, సర్వస్వం కోల్పోయిన వారు, ధ్వంసమైన గృహాల సంఖ్య సరేసరి. మానవహక్కులు, మానవాదానికి అసలు సిసలు ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు పడక కుర్చీలకే పరిమితమయ్యారు. గతేడాది అక్టోబరు ఏడు నుంచి జరుపుతున్న ఇజ్రాయిల్ దాడులతో పాటు మధ్య ప్రాచ్యంలో అమెరికా మిలిటరీ, ఆధునిక ఆయుధాల మోహరింపు కూడా పెరిగింది. ఆసియాలో పరిస్థితి ఇదైతే ఐరోపా దేశాలకు ముప్పు పేరుతో గత ఎనిమిది దశాబ్దాలుగా తిష్టవేసిన అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభం ముసుగులో ఆ దేశాలకు ముప్పును మరింత పెంచేవిధంగా ప్రయత్నించటం శాంతిని కోరుకొనే వారికి ఆందోళన కలిగిస్తోంది. నాటి జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకురాలిగా ఉంటే ఇప్పుడు అమెరికా చర్యలు మూడవ ప్రపంచపోరుకు దారితీసేవిగా ఉన్నట్లు అనేకమంది చెబుతున్నారు.
ఆసియా ఖండంలోని సహజ సంపదలు, రాజకీయ ఆధిపత్యం మీద కన్నేసిన అమెరికా ఒక్కోదశలో ఒక్కోకారణాన్ని సాకుగా చూపి తిష్టవేస్తోంది. మధ్య ప్రాచ్యంలో పరిణామాలు దేనికి దారితీసేదీ ఎవరూ ఊహించలేని స్థితి. బాధితులకు ఆహార సరఫరా చేస్తున్నట్లు చెబుతూనే అంతకంటే ఎక్కువగా అమెరికన్లు మిలిటరీ కేంద్రీకరణకు పూనుకున్నారు. గాజా మీద దాడులకు నిరసన లేదా ప్రతీకారంగా ప్రపంచంలో ఎంతో కీలకమైన నౌకా మార్గం ఉన్న ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్ వైపు ప్రయాణించే నౌకల మీద ఇరాన్ మద్దతు ఉన్న ఎమెన్‌లోని హౌతీ దళాలు దాడులకు దిగటం, వాటి మీద అమెరికా జరుపుతున్న దాడుల గురించి తెలిసిందే. కొద్ది గంటల్లోనే గాజాలోని హమాస్ సాయుధులను అదుపుచేస్తామని ప్రగల్భాలు పలికిన ఇజ్రాయిల్ ఇప్పటివరకు సామాన్య పౌరులు, వారిలో కూడా 70శాతం మంది పిల్లలూ, మహిళలు, వృద్ధులు, ఆసుపత్రులలో రోగులనే చంపుతున్నది. ఎంతకాలం అవసరమైతే అంతకాలం తాము మధ్య ప్రాచ్యంలోనే తిష్టవేస్తామని అమెరికా మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవటం అంత తేలికకాదని అమెరికా మిలిటరీ కమాండర్ మిగుయెజ్ చెప్పాడు. ఆహార సరఫరా పేరుతో ఆయుధాలను పెద్ద ఎత్తున ఎర్ర సముద్ర ప్రాంతానికి చేరవేస్తున్నారు. లెబనాన్‌లోని హిజబుల్లా, హౌతీ సాయుధులను ఎదుర్కొనేందుకు మధ్య ప్రాచ్యంలోని జలాల్లోకి ఐషెన్‌హోవర్, యుఎస్‌ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ అనే రెండు విమానవాహక యుద్ధనౌకలను అమెరికా మోహ రించింది. వాటికి అనుబంధంగా అనేక ఇతర మిలిటరీ నౌకలు ఉన్నాయి. నీటిలో, నేల మీద ఎలా అవసరమైతే అలా ప్రయా ణించే యుద్ధ వాహనాలు, ఎఫ్-16 యుద్ధ విమానాలను పెద్ద ఎత్తున తరలించారు. గతంలో ఇరాక్‌లో మోహరించిన లక్షా 60వేలు, ఆఫ్ఘ్‌నిస్తాన్‌కు తరలించిన లక్ష మంది మిలిటరీతో పోలిస్తే ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో ఉన్న తమ సేనలు తక్కువే అని అమెరికా సమర్ధించుకుంటున్నది. దీర్ఘకాలంగా మిలిటరీ స్థావరాలున్న కతార్, బహ్రెయిున్, యుఏయిలతో పాటు జోర్డాన్, ఇరాక్, సిరియాలలో కూడా వేలాది మంది సైనికులు ఉన్నారు.
తమ మిలిటరీ, పరికరాలను సిద్ధంగా ఉంచినప్పటికీ యుద్ధం కోసం కాదని అమెరికా రక్షణశాఖ పెంటగన్ ప్రపంచాన్ని నమ్మించేం దుకు చూస్తున్నది. అక్టోబర్ ఏడవ తేదీ తరువాత ఇప్పటివరకు హౌతీ దళాలు 170 దాడులను జరిపాయి. వాటిని నిలు వరించటంలో అమెరికా ఎలాంటి పురోగతినీ సాధించలేదు. దీంతో రవాణా నౌకలు ఆఫ్రికా గుడ్‌హోప్ ఆగ్రం చుట్టి తిరిగి రావాల్సి వస్తోంది. దీనివలన సరకు రవాణా ఆలస్యం కావటమే గాక ఖర్చు కూడా పెరుగుతున్నది. దీనికి పూర్తి బాధ్యత అమెరికా, ఇజ్రాయిల్‌దే అన్నది స్పష్టం. మధ్య ప్రాచ్యంలో ఎన్నో ఏండ్లుగా 30వేలకు పైగా అమెరికా దళాలు ఉన్నాయి. ఇవిగాక తాత్కాలికం, అదనపు దళాల పేరుతో మరికొన్ని వేల మందిని, ముందే చెప్పుకున్నట్లు పెద్ద సంఖ్యలో యుద్ధనౌకలనుదించారు. ఒక్క సిరియాలో తప్ప మధ్య ప్రాచ్య, పశ్చిమాసియాలోని దేశాలన్నింటా ఏదో ఒక పేరుతో అనుమతి తీసుకొనే అమెరికా తిష్టవేసింది. కొన్ని చోట్ల ఆయా దేశాల దళాలకు శిక్షణ, ఇస్లామిక్ తీవ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఇదంతా జరిగింది. నిజానికి ఇరాన్ మద్దతున్న సాయుధ బృందాలను అరికట్టేందుకే ఇదంతా అన్నది బహిరంగ రహస్యం. జోర్డాన్‌లో ఉన్న మిలిటరీ స్థావరం సరిహద్దుల్లో ఉన్న ఇరాక్, సిరి యాలపై దాడులు చేసేందుకే ఉంది. తూర్పు సిరియాలో ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ దళాలున్నాయి. మధ్య ప్రాచ్యంలో తిష్టవేసిన అమెరికా దళాల గురించి చూద్దాం.
ఎర్ర సముద్రంలోకి ఫిబ్రవరిలో దించిన ఐషెన్‌హోవర్ విమానవాహక యుద్ధ నౌకతో పాటు నియంత్రిత క్షిపణిదాడుల నౌక, ప్రత్యర్ధుల క్షిపణులను అడ్డుకొనే రెండు నౌకలు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, ఐదువేల మంది నౌకాదళ సిబ్బంది ఉన్నారు. ఇది ఇరాన్‌కు హెచ్చరికగానే జరిగింది. అణుశక్తితో నడిచే ఓహియో తరగతి జలాంతర్గాములను కూడా సూయజ్ కాలువ ద్వారా సమీకరించారు. ఇవి ఎక్కడా ఎలాంటి హడావుడి చేయవు. ఒక్కొక్క జలాంతర్గామి 154 తోమహాక్ క్రూయిజ్ క్షిపణులను మోసుకు పోగలదు. మధ్యధరా సముద్రంలో ఉన్న ఫోర్డ్ కారియర్ అనే యుద్ధ నౌకను కూడా తరలించారు.దీనిలో ఒక విమానవాహక యుద్ధ నౌకతో పాటు మూడు ఖండాంతర క్షిఫణి రక్షణ నౌకలు కూడా ఉన్నాయి.ఎమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణులను కూల్చివేసిన నౌకతో పాటు ఇతర అనేక యుద్ధనౌకలను మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రంవైపు తరలించారు. ఇవన్నీ ఇజ్రాయిల్‌కు మద్దతుగా, దాన్ని వ్యతిరేకించే దేశాలను బెదిరించటం, అవసరమైతే దాడులకు దిగేందుకే అన్నది స్పష్టం. నౌకా దళాలు కాకుండా 45వేల మంది వివిధ దేశాల స్థావరాల్లో ఉన్నారు.వీటన్నింటిని చూసుకొనే ప్రపంచం, ఐరాస సాధారణ అసెంబ్లీ ఖండించినా, భద్రతా మండలిలో తీర్మానాలు ప్రవేశపెట్టినా, అంతర్జాతీయ కోర్టులలో కేసులు దాఖలు చేసినా ఇజ్రాయెల్ ఏమాత్రం ఖాతరు చేయ కుండా గాజాలో మారణకాండ, పశ్చిమగట్టు ప్రాంతంలో నిరంతరం దాడులు జరుపుతున్నది. అమెరికా తీరు వివాదం విస్తరించటానికే దోహదం చేస్తున్నది.
ఆసియాలో ఇలా ఉంటే ఐరోపాలో ఉక్రెయిన్ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం గావించేందుకు అమెరికా పూనుకుంది.ఉక్రెయిన్‌కు 61బిలియన్ డాలర్ల ఆయుధ సరఫరాను అంగీకరించకపోతే ఆ దేశాన్ని, ఐరోపా, మొత్తం స్వేచ్చా ప్రపంచాన్ని ముప్పులో ఉంచినట్లేనని అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా పార్లమెంట్‌ను బెదిరించాడు.2014కు ముందు ఉన్న ఉక్రెయిన్ సరిహద్దులను పునరుద్దరిం చేందుకు రష్యాను ఓడించాలన్న జోబైడెన్ కలను చూస్తుంటే గతంలో వియత్నాం, ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, ఎమెన్ తదితర దేశాలలో మాదిరి ఓటములు గుర్తుకు వస్తున్నట్లు అనేకమంది చెబుతున్నారు. అమెరికా గనుక 2022 ఏప్రిల్‌లోనే టర్కీ ముందుకు తెచ్చిన శాంతి ప్రతిపాదనలను అంగీకరించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని, శాంతికి బదులు అమెరికా, నాటో కూటమి పోరును మరింతగా ఎగదోసేందుకే ఒక సాధనంగా చేసుకుంటున్నారన్నది స్పష్టం. ఉక్రెయిన్ వ్యవహరం లో అమెరికా వినాశకర విధానాన్ని అనుసరించటానికి కారకులైన వారిలో ఒకరిగా ఆరోపిస్తూ విక్టోరియా న్యూలాండ్ అనే విదేశాంగశాఖ ఉప మంత్రిని పదవీ కాలం ఉండగా ముందుగానే తొలగించారు. అంతకు రెండువారాల ముందు ఆమె ఒక సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్‌పోరు మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన ఘర్షణ స్థాయికి దిగజారిందని, ఉక్రెయిన్‌కు ప్రతిపాదించిన 61 బిలియన్ డాలర్ల ఆయుధ సాయానికి ఒకవేళ పార్లమెంటు ఆమోదం తెలపకపోతే బైడెన్ దగ్గర మరొక ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. ఈ కారణంగానే ఆమెను తొలగించారని, లేదూ బైడెన్ విధానాలకు నిరసనగా ఆమే రాజీనామా చేసినట్లు కూడా కొందరు చెబుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 2022 ఫిబ్రవరి చివరివారంలో ప్రారంభమైతే నెల రోజుల తరువాత అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ తమ లక్ష్యం శాంతి, సాధ్యమైనంత త్వరలో సాధారణ జీవన పునరుద్దరణ అని చెప్పాడు. కానీ అమెరికా,బ్రిటన్,ఫ్రెంచి నేతలు రంగం లోకి దిగి శాంతి చర్చలు కొనసాగకుండా చేశారు. అంతే కాదు పెద్ద సంఖ్యలో నాటో దళాలను ఉక్రెయిన్‌కు పంపు తున్నట్లు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ ప్రకటించాడు.దాన్ని నమ్మిన జెలెన్‌స్కీ వారి మాయలో పడి శాంతి ప్రక్రియ నుంచి వైదొలిగాడు. ఇప్పటివరకు ఆయుధాలు తప్ప దళాలను నాటో పంపలేదు. సంక్షోభం ప్రారంభమై పుడు ఉక్రెయిన్ జనాలకు హెల్మెట్లు, రాత్రుళ్లు పడుకొనేందుకు బ్యాగులు పంపితే సరిపోతుందని జర్మనీ చెప్పిందని, ఇప్పుడు వారే మరిన్ని క్షిపణులు, యుద్ధ టాంకులు అవసరమం టున్నారని మక్రాన్ చెబుతున్నాడు.
ప్రతి దశలోనూ ఆరు నుంచి ఎనిమిది నెలలు వెనుబడి ఉన్నామని కూడా అన్నాడు. ఒక వేళ గనుక ఇప్పుడు నాటో దళాలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అది రష్యా-నాటో యుద్ధంగా మారుతుందని రష్యా హెచ్చరించింది. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని పుతిన్ చెబుతున్నాడు. అయితే ఇప్పటికే కొన్ని ప్రత్యేక నాటో దళాలు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు పెంటగన్ పత్రాలు వెల్లడిం చాయి. ఉక్రెయిన్ చేరిన వేలటన్నుల ఆయుధాలు ఎక్కడకు వెళుతున్నదీ తెలుసుకొనేందుకు కొందరు తమ మిలిటరీ అధికారులు అక్కడ ఉన్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అంగీకరించాడు.
ఎం కోటేశ్వరరావు
8331013288