– పార్లమెంట్ ఎన్నికల కోడ్ తో అందుబాటులోకి తెచ్చిన ఈసీ
– ఈ యాప్ తో ఫోటో, ఆడియో, వీడియో ఆధారంగా ఫిర్యాదు
-15 నిమిషాల్లో ఘటనా స్థలానికి..100 నిమిషాల్లో చర్యలు
నవతెలంగాణ – బెజ్జంకి
లోకసభ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.వారికి తాయిలాలు పంచి ప్రలోభాలకు గురిచేయడంతో పాటు భయబ్రాంతులకు లేదా బలవంతంగా ప్రభావితం చేసే అవకాశముంటుంది. సదరు అభ్యర్ధుల చట్టవ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు ఓటర్లు ఫిర్యాదు చేసేందుకుగాను ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ యాప్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకమైన ఓటర్లకు డబ్బు పంపకాలు, ఇతరత్రా వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. ఫోటోలు, ఆడియో, వీడియోల ఆధారంగా వాటి పై ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యాప్ మంచి ఫలితాలు ఇచ్చిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
15 నిమిషాల్లో ఘటనా స్థలానికి..
త్వరలో లోకసభకు జరగనున్న ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు,మద్యం,డబ్బు పంపిణీపై నిఘా పెట్టేందుకుగాను ఎన్నికల కమిషన్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది.రాష్ట్రంలో 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈసీ మొదటిసారి ఈ యాప్ ను ఉపయోగించింది. అప్పట్లో ఈ యాప్ కు ప్రజల్లో మంచి స్పందన వచ్చింది.మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీ-విజిల్ యాప్ వినియోగించగా పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందగా చర్యలు తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.ఇదిలావుంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారెవరైనా ప్లే స్టోర్ నుంచి సీ-విజిల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఆ తర్వాత ఫోన్ నంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది.మీ పేరు,జిల్లా,పిన్ కోడ్ వంటి వివరాలు నమోదు చేయమంటుంది.అనంతరం ఫొటో, ఆడియో, వీడియో మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.లైవ్ లొకేషన్ ఆన్ చేసి అక్కడి పరిస్థితుల ఆధారంగా ఆప్షన్ ఎంపిక చేసుకుని ప్రోసీడ్ కొడితే నేరుగా సంబంధిత అధికారులకు విషయం చేరిపోతుంది.ఇంగ్లీష్, తెలుగు భాషలో సమస్యను పంపించవచ్చు.నమోదు చేసిన 5 నిమిషాల్లో సమాచారాన్ని ఫీల్డ్ యూనిట్ కు పంపిస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిస్టిక్ సర్వైలెన్స్, రిజర్వ్ బృందాల సభ్యులు 16 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. 30 నిమిషాల్లో వివరాలు సేకరించి రిటర్నింగ్ అధికారికి నివేదిస్తారు.50 నిమిషాల్లో బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తారు. ఇలా ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. సీ-విజిల్ ద్వారా చేసే ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతారు.సీ-విజిల్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారి పేర్లు, ఫోన్ నెంబర్లను ఈసీ రహస్యంగా ఉంచుతుంది.అంతేగాక బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారనే అంశాన్ని కూడా ఫిర్యాదుదారులకు చేరవేస్తారు.కాబట్టి ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరగాలంటే ప్రజలు తమ కండ్ల ముందు కనిపిస్తున్న అన్యాయాన్ని వెంటనే సీ- విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి. సీ-విజిల్ యాప్ ను ఎక్కువ మంది వినియోగించేల,ప్రలోభాలపై ఫిర్యాదు చేసేలా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని అధికారులు వివరిస్తున్నారు.ఈ యాప్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల భౌగోళిక సరిహద్దుల్లో మాత్రమే పని చేస్తుంది.ముందుగా తీసిన చిత్రాలు,వీడియోలను అనుమతించదు.నేరుగా యాప్ ద్వారా తీసిన వాటినే అప్లోడ్ చేయడానికి వీలవుతుంది.ఒక వ్యక్తి ఎన్ని ఫిర్యాదులైనా చేయవచ్చు.
ప్రలోభాలకు అధికారుల వత్తాసు..
గత శాసనసభ ఎన్నికల్లో మానకొండూర్ నియోజకవర్గంలో విధులు నిర్వర్తించిన ఎన్నికల అధికారులు ప్రలోభాలకు వత్తాసు పలికారు.సీ విజిల్ యాప్ ద్వార పిర్యాదు చేసిన వారి వివరాల్లో గోప్యత పాటించకుండా అధికారులు బహిర్గతం చేశారు. ఎన్నికల సంఘం పటిష్టంగా అమలు చేస్తున్న సీ విజిల్ యాప్ నియమావళి నియోజకవర్గంలో ఉల్లంఘనకు గురవుతోంది.అధికారులు ఎన్నికల సమయంలో చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించేల రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలి.
– మానాల రవి, కాంగ్రెస్ నాయకులు, బెజ్జంకి
అభియోగాలకు తావులేకుండా చర్యలు..
సీ విజిల్ యాప్ ద్వార నమోదైన పిర్యాదులపై ఎలాంటి అభియోగాలకు తావులేకుండా ఎన్నికల అధికారులు సత్వర చర్యలు చేపడుతారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రాముఖ్యమైనవి.ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు గురవ్వకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.ప్రలోభాలకు గురిచేసే వారిపై ఎన్నికల అధికారులకు స్వేచ్ఛగా పిర్యాదు చేయాలి.
– శ్రీనివాస్, సిద్దిపేట రూరల్ సీఐ