చివరి దశలో పంటలెండుతున్నారు..

చివరి దశలో పంటలెండుతున్నారు..– ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి ఆదుకోవాలి : రైతుల రాస్తారోకో
నవతెలంగాణ – చొప్పదండి
చివరి దశలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.. వెంటనే ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రధాన కాలువ నుంచి డీ-86, డీ-87 కాలువకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండల కేంద్రం సమీపంలోని డీ-87 కాలువ వద్ద ప్రధాన రహదారిపై కొలిమికుంట, చాకుంటా, వెదురుగట్ట, చొప్పదండి గ్రామాల రైతులు సోమవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న పంటలు చివరి దశలో నీళ్లులేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరం ఏప్రిల్‌ 20వ తేదీ వరకు ఎస్సారెస్పీ నీళ్లు వచ్చాయన్నారు. ఈ ఏడాది అధికారులు నీళ్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న పంట పొలాలను కాపాడేందుకు ఉన్నతాధికారులు స్పందించి.. చివరి మడి వరకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ మెయిన్‌ కెనాల్‌ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎస్‌ఐ ఉపేంద్రచారి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే, కలెక్టర్‌ రావాలని నినాదాలు చేశారు. ఎస్‌ఐ రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

Spread the love