ఓఆర్‌ఆర్‌పై డివైడర్‌ను ఢీ కొట్టిన కారు

– ఇద్దరు యువకులు మృతి
– ముగ్గురికి తీవ్ర గాయాలు
– అతివేగమే ప్రమాదానికి కారణం
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
హిమాయత్‌ సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై అతి వేగంగా వచ్చిన కారును డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటప రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న కారు హిమాయత్‌ సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై డివైడర్‌ను ఢ కొట్టి నాలుగు పల్టీలు కొట్టింది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని సమీపంలోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మృతి చెందిన గౌతం(26), ఆనంద్‌(28) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని, అలాగే, కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love