పట్టణంలో అన్ని వార్డుల అభివృద్ధికి కృషి

– సమస్య ను  మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ దృష్టికి తీసుకురావాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండ పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని 25వ వార్డు అసత్ నగర్ లో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నివాసంలో జరిగిన ఫంక్షన్ కు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ కాలనీకి చెందిన ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన వెంటనే నల్గొండ పట్టణంలో మిగిలిపోయిన కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి అన్ని కాలనీలకు సిసి రోడ్లు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా స్థలం ఉండి ఇల్లు లేని వారందరికీ రూ 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.నల్గొండ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ప్రజలు ఏ సమస్యలు ఉన్న మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.మంత్రి వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Spread the love