నవతెలంగాణ – హయత్ నగర్
మహిళల రక్షణే షీ టీం లక్ష్యం అని రాచకొండ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అన్నారు. రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు మంగళవారం రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్ జోషి మాట్లాడుతూ 15 రోజుల్లో 122 మంది ఆకతాయిలను రాచకొండ షీ టీమ్స్ పట్టుకుందన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తున్న 122 (మేజర్స్-79, మైనర్స్-43) మందిని షీ టీమ్స్ పట్టుకున్నారని వెల్లడించారు. వారికి ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు)లో కౌన్సిలర్స్‌తో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. గత నెల 16 నుండి 31 వరకు షీ టీమ్స్ రాచకొండ మొత్తం 37 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 5875 మందికి మహిళా చట్టాలు, వారి యొక్క హక్కులు, నేరాల గురించి వివరించి అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన, సామాజిక మాద్యమాల ద్వారా జరిగే దాడులు, లైంగిక వేధింపులు, ప్రయాణ సమయాల్లో వేధింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు, సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. మహిళలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే షీ టీమ్స్ ,రాచకొండ వాట్సాప్ నెంబర్ 8712662111 ద్వారా , లేదా ప్రాంత షీ టీమ్ అధికారుల నంబర్లు -భువనగిరి ఏరియా 8712662598, చోటుప్పల్ ఏరియా – 8712662599, ఇబ్రాహీంపట్నం ఏరియా -8712662600, కుషాయిగూడ ఏరియా -8712662601, ఎల్బీనగర్ ఏరియా -8712662602, మల్కాజిగిరి ఏరియా -8712662603, వనస్థలిపురం ఏరియా -8712662604లకు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషా విశ్వనాథ్, ఏసీపీ వెంకటేశం, అడ్మిన్ ఎస్‌ఐ రాజు, షీ టీమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.