– మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
– నామినేషన్ దాఖలు
– బీజేపీలోకి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇది ప్రత్యేక ఎన్నిక.. దొంగ సర్వేలు, పెయిడ్ ఆర్టికల్స్‌తో ప్రజల అభిప్రాయాన్ని మార్చలేరు.. అని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం మేడ్చల్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు మిగతా అభ్యర్థులకు అసలు పోలికే లేదని ప్రజలే అంటున్నారని చెప్పారు. డబ్బు సంచులతో రేవంత్ సర్కార్ వస్తుందని, ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చైతన్యానికి మారుపేరు మినీ ఇండియా మల్కాజిగిరి అని, మోడీ తొలి శంఖారావం ఇక్కడే చేశారని చెప్పారు. గెెలిచొస్తే ఏది అవసరమైతే అది ఇస్తా అని మోడీ మీకు చెప్పమని చెప్పినట్టు చెప్పారు. మల్కాజిగిరి పట్ల తనకో విజన్ ఉందని, సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్థి వంశీ తిలక్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పా రెడ్డి పాల్గొన్నారు.
ఈటల అనుభవం ఢిల్లీలో అవసరం: కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్ పూరి
ఈటల రాజేందర్ అనుభవం, సేవలు ఢిల్లీలో కూడా అవసరమని కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్ పూరి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామిర్‌పేటలోని ఈటల రాజేందర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిదీప్‌సింగ్ పూరి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ జనప్రియ నేత, అనుభవజ్ఞుడు అని అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు.
బీజేపీలోకి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ నివాసం వద్ద జరిగిన సభలో కేంద్రమంత్రుల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు ఆయన భార్య స్వప్న, బార్ కౌన్సిల్ వైస్ చైర్మెన్ సునీల్ గౌడ్ తదితరులు బీజేపీలో చేరారు.