– తెలంగాణలోదోచుకున్నది చాలదన్నట్టు ఢిల్లీలో దోపిడీ : కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మద్యం కుంభకోణం విషయంలో కవిత నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు రాలేదని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రశ్నించారు. తెలంగాణలో దోచుకున్నది చాలదన్నట్టుగా ఢిల్లీలో దోపిడీకి కవిత తెగబడ్డారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ వయనాడ్‌లో ఓడిపోబోతున్నారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో తమ పార్టీ మహిళా నేత చేతిలో రాహుల్‌గాంధీ ఓడారనీ, ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అసదుద్దీన్ ఓవైసీ తమ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోవటం ఖాయమని చెప్పారు. ఓవైసీ బ్రదర్స్ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అంబేద్కర్‌కు కాంగ్రెస్ భారత రత్న ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రిజర్వేషన్లపై బిల్లు ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సహా నిందితులంతా జైలుకెళ్లారని చెప్పారు. రాహుల్ గాంధీ, ఓవైసి ఇద్దరూ ఔరంగజేబు స్కూల్ కు చెందిన వారేనని విమర్శించారు. కర్నాటకలో సొంత పార్టీ కార్పొరేటర్ అయిన ఓ ఆడబిడ్డకు న్యాయం చేయలేని రాహుల్ గాంధీ సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే పార్టీలతో కాంగ్రెస్ జత కట్టిందని ఆరోపించారు. అవినీతికరమైన ఆ పార్టీ చేతిలో దేశాన్ని పెడితే భద్రంగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ నాశనం చేయాలని చూస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అది విఫలమైందని విమర్శించారు.