ద్వేషపు నోళ్లు!

Mouths of hate!సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ముస్లింలపైకి హిందువులను ఉసిగొలిపే పూర్తి మతత్వంతో కూడిన వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్నాయి. మోడీ పరివార ప్రచారమంతా విద్వేషం చిందిస్తూనే సాగుతోంది. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో తమని కాపాడే మంత్ర దండం అదేనని మన విశ్వగురువు నమ్ముతున్నాడు. అందుకే మొదటి నుంచి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల ప్రచారం లో భాగంగా తెలంగాణకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పిస్తాం’ అన్న మాటలే దీనికి తాజా ఉదహరణ. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశ సంపద మొత్తం ముస్లింలకు దోచిపెడతారు’ అన్న మాటలు రెండు వారాల కిందట స్వయానా మోడీ నోటి నుంచే విన్నాం. అప్పుడు ఆయన అబద్దాల అక్రమ ప్రచారం అలా… ఇప్పుడు ఈయన ఇలా… విడతల వారీగా సాగుతున్న ఎన్ని కల పోలింగ్‌ కమలం గుండెల్లో గుబులు రేపుతున్నది. అందుకే తమ విద్వేష ప్రసంగాలను మరింత తీవ్రతరం చేస్తున్నారు.
అసలు రిజర్వేషన్లకే వ్యతిరేకమైన బీజేపీ, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల గురించి తెగ మాట్లాడుతుంటే నవ్వు తెప్పిస్తోంది. వినేటోళ్లు ఉంటే హరికథను ఇంగ్లీష్‌లో చెప్తారనే ఓ నానుడి ఉంది. ఇప్పుడు బీజేపీ నాయకుల మాటలు కూడా అలాగే ఉన్నాయి. ‘మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం’ అని కూడా నడ్డా వారు సెలవిచ్చారు. అయితే రాజ్యాంగం, దాని విలువ, దానిని గౌరవించాలనే విషయం బీజేపీకి ఇప్పుడే గుర్తొచ్చింద నుకుంటే మనం తప్పులో కాలేసినట్టే. మతాలను, రాజ్యాంగాన్ని, రాముడిని, సనాతన ధర్మాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో కమల నాధులకు తెలిసినంత బాగా బహుశా మరెవ్వరికీ తెలియదనుకుంటా!
ఆనాడు రాజ్యాంగ రచనను, అమలును తీవ్రంగా వ్యతిరేకించిన ఆరెస్సెస్‌ తానులోని గుడ్డే కదా ఈ బీజేపీ. అందుకే దేశంలో మతాలతో సంబంధం లేకుండా అట్టడుగు, వెనకబడిన వారి అభ్యున్నతిని కోరుతూ అంబేద్కర్‌ నాయకత్వాన లిఖించిన రాజ్యాంగాన్ని ‘తిరగ రాస్తాం, సమూలంగా మార్చేస్తాం’ అంటూ రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేస్తున్న వాళ్లు ఇప్పుడు రాజ్యాంగం, దాని విలువల గురించి మాట్లాడడం విడ్డూరం! దేశంలో వెనకబడిన, అట్టడుగు జనాభాలో ముస్లింలు కూడా ఉన్నారనే విషయం బీజేపీకి తెలియనిది కాదు. ఇవన్నీ వారి ఓటు రాజకీయాల్లో భాగంగా చేస్తున్నదని దేశంలోని హిందువులు తెలుసుకోవాల్సిన కీలకమైన సమయమిది.
మిగిలిన పార్టీలన్నీ ముస్లింలకు అనుకూలమైన వనీ, తామొక్కరమే హిందువులను ఉద్దరించేందుకు పుట్టినట్టు ప్రతి సభలో ఢంకా బజాయించి మరీ చెప్పుకుం టున్నారు బీజేపీ నాయకులు. మైనార్టీలైన ముస్లింలకు కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్ల వల్లనే దేశంలోని మోజార్టీ హిందువులకు తీవ్రమైన నష్టం కలిగినట్టు ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. ముస్లింల పట్ల తీవ్ర వ్యతిరేకతను సృష్టిస్తున్నారు. దేశ ప్రజల్లో మతోన్మాదాన్ని రెచ్చగొడుతు న్నారు. ఇలా బహిరంగ సభల్లో రాజ్యాంగానికి, ప్రజాస్వా మ్యానికి తూట్లు పొడిచే విధంగా మాట్లాడుతున్నా ఎలక్షన్‌ కమిషన్‌ చూసీ చూడనట్టు వ్యవహరించడం అత్యంత దారుణం.
ఇక దేశంలో హిందూరాజ్యమే మా ధ్యేయమని చెప్పుకుంటున్న బీజేపీ వల్ల హిందూ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అంటే అదీ లేదు. మోడీ పదేండ్ల పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపో యాయి, ప్రజలు ఉన్న ఉపాధిని కోల్పోయారు, కొత్త ఉద్యో గాలు రాలేదు, జీఎస్టీ పేరుతో పన్నుల భారం పెంచారు. దళితులపై, మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ఇలా బీజేపీ పాలనలో బాధపడుతున్న వారిలో హిందువులే అధికంగా ఉన్నారనే నిజాన్ని గుర్తించాలి.
దేశంలోని ఆదివాసీలు, గిరిజనుల కంటే కూడా ముస్లింలు అత్యంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. సచార్‌ కమిటి ఈ విషయాన్ని స్పష్టంగా వివరించింది. ఎన్నో పోరాటాల ఫలితంగా చివరకు ముస్లిం లకు ఆ మాత్రమైనా రిజర్వేషన్‌లు అమల్లోకి వచ్చాయి. కనీసం వీటిపై కూడా అవగాహనలేని ముస్లిం జనాభా మన దేశంలో నేటికీ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలం తమ అధికార పీఠాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలను తమ ఓటు బ్యాంకుగా వాడుకుంటు న్నారు కమల నాధులు. కార్పొరేట్ల భజన తప్ప సామాన్యుల సమస్యల గురించి పట్టించుకోని కాషాయ దళం ఇంతకు మించి గొప్పగా ఆలోచిస్తారను కుంటే అత్యాశే అవుతుంది.
కొన్ని రోజులు కష్టపడితే చాలు, మరో ఐదేండ్లు దేశాన్ని దర్జాగా దోచుకోవచ్చని కమల దళం ఉవ్విళ్లూరుతోంది. దేశం ఏమైనా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. మళ్లీ అందలమె క్కాలని తహతహలాడుతోంది. దేశంలో ప్రమాద ఘంటికలు మారు మోగుతున్న నేపథ్యంలో బీజేపీ అబద్ధాల, మత విద్వేష ప్రచారం పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. కాలే కడుపులు, ఆకలి మంటలు మరిచి తమ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పాలకులను ప్రజలు ఎన్నటికీ సహించరని నిరూపించాల్సిన సమయమిదే.

Spread the love