ప్రత్యేక పాలనలో నలిగిపోతున్న పంచాయతీ కార్యదర్శులు

– సర్పంచులు లేక కుంటుబడిన అభివృద్ధి
– నిధులు లేక నిర్వహణ అస్తవ్యస్తం
– అప్పులు తెచ్చి పంచాయతీ నిర్వహణ
– సంతకాలకే పరిమితమై పంచాయతీల వైపు కన్నెత్తి చూడని ప్రత్యేక అధికారులు
నవతెలంగాణ-కొత్తూరు
ప్రత్యేక పాలనలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నలిగిపోతున్నారు. జనవరిలో సర్పంచుల పదవీకాలం పూర్తి అవ్వడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులతో పాలన నిర్వహిస్తుంది. పంచాయతీ కార్యదర్శుల రోజు వారి పనులు ఒకవైపు పంచాయతీ నిర్వహణ మరొకవైపు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేక గ్రామపంచాయతీల్లో అభివృద్ధి కుంట్టుబడింది. ప్రత్యేక అధికారులు వారి కార్యాలయాలలోనే ఉంటూ సంతకాలకే పరిమితమయ్యారు. ప్రత్యేక అధికారులకు తమ రోజు వారి బాధ్యతలతో పాటు అదనంగా పంచాయతీ నిర్వ హణ బాధ్యతలు అప్పగించడంతో వారు అటువైపు చూసే సమయం లేకుండా పోయింది. దీంతో పంచాయతీ కార్య దర్శులపై అధిక భారం పడుతుండడంతో వారు సతమత మవుతున్నారు. గ్రామపంచాయతీలలో సర్పంచులు లేకపోవడం చేత నిర్వాహణ భారం పంచాయతీ కార్య దర్శిలపై పడుతుండడంతో వారు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.
ప్రత్యేక పాలనలో అధిక పని భారం…
గ్రామపంచాయతీ సాధారణ పరిపాలనలో శాని టేషన్‌, పారిశుభ్రత, వీధిలైట్లు, తాగునీటి సరఫరా తోపాటు అడ్మినిస్ట్రేషన్‌ స్థాయిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్లు, బిల్డింగ్‌ పర్మిషన్‌, పల్లె ప్రగతి నందు ఏర్పాటు చేసిన ఆస్తుల పరిరక్షణ, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, నర్సరీ, మిషన్‌ భగీరథ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు, డంపింగ్‌ యార్డ్‌, పల్లె ప్రకృతి వనానికి సంబంధించిన ఫొటోలు ఉదయం సాయంత్రంలో ప్రతిరోజూ యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం వంటి పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దీనికి తోడు ప్రత్యేక పాలనలో అధిక భారం పడింది. గ్రామస్థాయిలో వీఆర్‌ వోలు లేక రెవెన్యూ వ్యవస్థలకు సంబంధించిన పనులు, అంగన్‌వాడీ, హెల్త్‌, విద్యుత్‌ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, మిషన్‌ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్‌ పనులను పంచాయతీ కార్యదర్శులకు పురమాయిస్తున్నారు. మిషన్‌ భగీరథ నిర్వహణ గ్రామపంచాయతీపై భారం పడింది. మిషన్‌ భగీరథ నిర్వహణ పనులు డిజిల్‌ బిల్లులు సాయంత్రం లోగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకు పంచాయతీ కార్యదర్శులు నానా అవస్థలు పడి అప్పులు తెచ్చి మరి బిల్లులు చెల్లిస్తున్నారు. గతేడాది జూన్‌ మాసం నుంచి చెక్కులు పాసు కాకపోవడం లేదు. ఇక్కడ చెక్కులు పిచ్చి ఎస్‌టీవోలో పాస్‌ చేయించిన ఆర్బీఐలో ఆగిపోతున్నాయి. దీంతో పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతుంది.
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి
గ్రామాల్లో సర్పంచ్‌ పదవి కాలం పూర్తి కావడంతో అభివృద్ధి కుంటుబడింది. ప్రత్యేక కాలంలో ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీల వైపు కన్నెత్తి చూడడం లేదు. వారి కార్యాలయాలకే పరిమితమై భారం మొత్తం పంచాయతీ కార్యదర్శులపై వదిలేశారు. అంతేకాకుండా శాసనసభ పార్లమెంట్‌ ఎన్నికలు ప్రభావం గ్రామాభివృద్ధి పై పడింది. ఇప్పటికైనా వెంటనే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి.
– కడల శ్రీశైలం, మాజీ వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్‌ యువజన విభాగం, కొత్తూరు మండల అధ్యక్షులు

పంచాయతీ కార్యదర్శులను ఆదుకోవాలి
ప్రత్యేక పాలనలో పంచాయతీ కార్యదర్శులపై పని భారంతో పాటు ఆర్థిక భారం పడింది. దీనికి తోడు కార్యదర్శులు సాధారణ పనులతో పాటు అదనపు పనులను ఉన్నతా ధికారులు పురమాయి స్తున్నారు. మిషన్‌ భగీరథ ఆర్డబ్ల్యూఎస్‌ ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ విద్యుత్తు హెల్త్‌ లాంటి వివిధ శాఖలకు సంబంధించిన అత్యవసర పనులను డైరెక్ట్‌గా కార్యదర్శిలపై మోపుతున్నారు. పంచాయతీ నిర్వహణ పనులకు బిల్లులు చెల్లించలేక అప్పులు చేసి గ్రామాల్లో మరమ్మతులు చేపడుతున్నాం. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే తమపై పని భారం తగ్గుతుంది. చేసిన పనులకు నిధులు మంజూరు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయిన పంచాయతీ కార్యదర్శులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.
– శ్రీనివాస్‌, తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

Spread the love