అమ్మపల్లి19 సర్వే నెంబర్‌ భూ అక్రమాలపై ప్రభుత్వం స్పందించాలి

– ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహ
– సర్వేనెంబర్‌ 19 లో సుమారు 100 ఎకరాల సర్‌ ప్లస్‌ సీలింగ్‌ భూమి అన్యక్రాంతమైనట్టు వార్త కథనాలు
– 19/16 , 19/18 19/21, 22, 23, 24 , 25 నుంచి 47 వరకు పెద్ద ఎత్తున అక్రమాలు
– ప్రజలు వినతి పత్రాలు ఇస్తుంటే వాటిపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
– అక్రమ మార్గాల ద్వారా కబ్జా చేస్తుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్టు..?
– కబ్జాలపై అధికారులు మౌనం వీడాలని డిమాండ్‌
నవతెలంగాణ-శంషాబాద్‌
ప్రభుత్వ భూములను కొంతమంది బడా బాబులు దర్జాగా కబ్జా చేసి పెద్ద ఎత్తున భారీ అక్రమ నిర్మాణాలు నిర్మిస్తుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యులు చింతమరి నర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. శంషాబాద్‌ మండల పరిధిలోని అమ్మపల్లి రెవెన్యూ సర్వేనెంబర్‌ 19 లో సుమారు 100 ఎకరాల సర్‌ ప్లస్‌ సీలింగ్‌ భూమి అన్యాక్రాంతమైందన్న వార్త కథనాలు వస్తున్నాయని తెలిపారు. 19 సర్వే నెంబర్‌ లో సీలింగ్‌ భూమిని కొంతమంది అక్రమ మార్గాల ద్వారా కబ్జా చేస్తున్నారని తెలిపారు. 19/16 , 19/18 19/21, 22 23, 24 , 25 నుంచి 47 వరకు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. 1955 నుంచి 58 వరకు భూస్వామి రాధా లక్ష్మీబాయి పేరు మీద ఉన్న భూమి 1993లో మిగులు భూమి కింద అప్పటి భూస్వాదీన చట్టం ప్రకారం ఆ భూమిని సర్‌ ప్లస్‌ సీలింగ్‌ భూమిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అన్నారు . అప్పటినుంచి ఆ భూమి ప్రభుత్వ రికార్డుల్లో సీలింగ్‌ భూమిగా నమోదయి ఉంటే అక్రమ మార్గాల ద్వారా కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తున్నారని అన్నారు. ఇటీవల అక్రమ నిర్మాణాలు చేసి కాలనీ అసోసియేషన్‌ పేరుతో కాలనీ ముఖద్వారం ఏర్పాటు చేస్తే మీడియాలో వచ్చిన కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించి కూల్చివేశారని అన్నారు.
అయితే మిగిలిన భూముల జోలికి ఎందుకు వెళ్లడం లేదని అందులో ఉన్న మతలబు ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమ్మపల్లి రెవెన్యూ లోని భూములలో పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్‌ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయన్నారు. రెవెన్యూ అధికారులకు ప్రభుత్వ భూములను కబ్జా చెర నుంచి కాపాడాలని పరిష్కరించాలని ప్రజలు వినతి పత్రాలు ఇస్తుంటే వాటిపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారా లేక నిజంగానే వాళ్ళు పట్టాదారు పాస్‌ పుస్తకాలు చట్ట ప్రకారము పొందారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. అది ప్రభుత్వ భూమి అయితే ఎలాంటి బేషజాలకు పోకుండా వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా అక్రమ మార్గాల ద్వారా కబ్జా చేస్తుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love