పోస్ట్‌మార్టం రిపోర్ట్‌? !!

పోస్ట్‌మార్టం రిపోర్ట్‌? !!ఆకాశంలో వచ్చిపోయే
మబ్బుల్లా పాలకులు
ఐదేండ్లకోసారి చెల్లని పైసోలే ప్రజలు
ఓటిప్పుడు వేలంపాటలో
అమ్ముడుపోయే ఆస్తి
ప్రజల మీద పాలకులకు ప్రేమలేదు
పాలకుల మీద ప్రజలకూ నమ్మకం లేదు
కలవని పట్టాల్లా ఎవరి దారి వారిదే
రాజకీయం వ్యాపార జూదమని
అతడు తన డైరీలో రాసుకునే ఉంటాడు
ఓట్ల వేట కోసం అతడు
మహానటుడై బయల్దేరుతాడు
ఇప్పుడు ఓటరు కూడా తక్కువేం తినలేదు
అన్ని పార్టీల కరపత్రాలు
నవ్వుతూనే స్వీకరిస్తాడు
వేలంపాటలో తన ఓటుకు
ఎక్కువరేటు పలికిన ఆసామికే అమ్ముకొని
గుట్టు చప్పుడు చేయకుండా
ఇంటి దారి పడతాడు
సిగ్గుతో దేశచిత్రపటం కుంచించుకుపోతుంటది
వివస్త్రగా మారిన ప్రజాస్వామ్య ద్రౌపదిని
ఏ కృష్ణుడు కాపాడలేడు
ఎప్పటిలాగే ఎవరికీ కనిపించకుండా పొలిటీషియన్‌ దుశ్శాసన
వికటాట్టహాసం చేస్తుంటడు
ధృతరాష్ట్రుని పాత్రలో ఎలక్షన్‌ కమీషన్‌
అమలుకాని నీతులను వల్లిస్తుంటది
గోడకున్న క్యాలెండర్‌లో డేట్లు మారుతుంటాయి
పీఠాల మీద రాజవంశాలు ఎక్కిదిగుతుంటాయి
స్పాన్సర్డ్‌ మీడియా ఇల్లెక్కి కూస్తుంటది
అరచేతి యూనివర్సిటీలో లెక్కలు తారుమారవుతుంటాయి
ఎటొచ్చి ప్రజల బతుకే మరింత
బర్బాద్‌ అవుతుంటది
నువ్వు కుర్చీమీదుంటే
నన్ను జైలుకు పంపించు
నేను అధికార పీఠాన్ని అందిపుచ్చుకుంటే
నిన్ను ఊచలు లెక్కపెట్టిస్తా
ఇది ఐదేండ్లకోసారి విజేతలను మార్చే ఆట
నిత్యం ప్రజలను పరాజితులను చేసే కుట్ర!
అందరూ దొంగలుగా మారాక
ఫలితం ఏదొస్తే ఏముంది….?
ఇప్పుడు అందరికీ ఆట తెలిసిపోయింది
తిడుతున్నోడి తిట్లు నిజం కావు
ఎత్తుకున్నోడి జెండా శాశ్వతం కాదు
పాడుతున్న పాట పర్మినెంటు కాదు
అంతా ఒక రోటీన్‌ మెలో డ్రామా!
రాజకీయ కప్పగంతులాటలో
ఎవడు ఎటైనా దూకొచ్చు
ఎవడు ఏ రాగమైనా ఎత్తుకోవచ్చు
పూటకోసారి ఏ లీడరు ఏ పార్టీలో ఉన్నాడో
గుర్తించాల్సిన బాధ్యత ప్రజలదే
ప్లాస్టిక్‌ కత్తులు విచ్చుకోవు
పొలిటికల్‌ కౌగిళ్లు గుచ్చుకోవు
అంతా నటన…నటన…!!
– డా.పసునూరి రవీందర్‌, 77026 48825

Spread the love