అనల్పశిల్ప సౌరభం ‘అనల్పం’

అనల్పశిల్ప సౌరభం 'అనల్పం'మంచి కవి పాఠకుల కోసం వెంపర్లాడడు. పాఠకులే మంచి కవిత్వాన్ని వెతుక్కొంటూ వెళతారు. రాయడం ఒక అలవాటుగా ఉన్న కవికి తన గురించి తనకొక అంచనా ఉండటమే కాదు తన పాఠకులు ఎవరో కూడా బాగా తెలిసిన వాడై ఉంటాడు. రఘు శేషభట్టార్‌ మనకాలపు మంచి కవి. ”పలుచటి నీటి అలల కింద ఈదుతున్న చేపల్ని చూసినట్లు లోకాన్ని” చూస్తాడు
ఈపాటికే తన మాట చేత, మన్నన చేత, ప్రతిభావంతమైన కవిత్వరీతి చేత, అనల్పశిల్పకల్పనారీతి చేత తనదైన స్వీయముద్ర వేసుకొన్న శుద్ధకవి రఘు శేషభట్టార్‌. సప్త కవితాసంకలనాల తరువాత అష్టమకతిగా ‘అనల్పం’ తీసుకొని వచ్చాడు.
కవి తన గురించి తాను చెప్పుకోవడం ప్రాచీన కాలం నుండి చూస్తున్నాం. సంప్రదాయ కవిత్వ వాతావరణం నుండి వచ్చిన పాఠకులు కావ్యావతారికలలో, ఆశ్వాసాంత పద్యగద్యాలలో కవి హృదయావిష్కరణ జరిగిన తీరుతెన్నులు గమనించిన వారే. రఘు ”వస్తువొక నెపం మాత్రమే” అంటూ అవతారికలాంటి మనోగతం తొలిపుటల్లోనే అనూదితం చేశాడు. నెపం వెనుక దాగిన కవి శిల్పాభిరుచి అర్థం చేసుకోలేకపోయిన కొంతమంది తొందరపడి రఘుది వస్తురహిత కవిత్వంగా తాము భ్రమసి, అనవసరంగా పాఠకుల్ని కూడా భ్రమింపజేయడం ఒక వైచిత్రి. నిస్సందేహంగా రఘుశేషభట్టార్‌ శిల్పవ్యామోహి. టెక్నిక్‌ లేని కవిత్వాన్ని తాను ఊహించలేను అన్నాడు ఆరుద్ర. జీవితాంతం శిల్పరహస్య అన్వేషణలో సాగిన శేషేంద్ర రఘు సిరల్లో అలలెత్తే జీవాత్మ. ఆ తోవలోని వాడే కాదు ఆ కోవలోని వాడు కవి రఘు. కవిత్వం వస్తుసంవిధానాల సమ్మిశ్రభావాభివ్యక్తి. రఘు సహజంగా సంవిధానం వైపు ఎక్కువ మొగ్గు చూపుతాడు. అంటే దానర్థం వస్తువును త్రోసిరాజని కవిత్వం రాస్తాడని కాదు. ‘అనల్పం’తో సహా రఘు ప్రతి సంపుటిలో వస్తువు అనేక వన్నెలుపోయింది.
”అనుకొంటాం-/ లోకంలో చిలుకలకు లేదా పావురాళ్లకు మాత్రమే/ పెంపుడు పక్షులయ్యే యోగ్యత ఉందని/ వాటికి మాత్రమే/ మనిషి భుజం మీద హక్కపత్రాలేవో ఉన్నాయని/ ఒక పండుముక్కో/ మక్కిన బియ్యం దొప్పో దర్పంగా విసరి/ తతిమ్మా పక్షుల్ని వాకిలి నుండి తరిమేస్తాం”
‘అనల్పం’ సంకలనంలోని తొలి కవిత ఇది. ”ఒక కోకిలను పెంచాలని ఉంది” అనే ఆత్మీయ శీర్శికతో కవి మనుషులు పక్షుల పట్ల చూపే వివక్ష గురించి రాసాడని వాచ్యంగా అనిపిస్తుంది. కాని పక్షలు మీద నెపం మోపి తరతరాలుగా సమాజంలో జాతిపేరిట, మతం పేరిట సాగుతున్న దుర్మార్గవివక్షతను రఘు సూచ్యంగా ఇందులో అభివర్ణించాడు.
”గోడెక్కి ఆశగా తొంగిచూసే కాకులు, పిట్టలు/ ఒట్టి బడుగు పక్షులు/ ఎవరో ఒకరు కనికరించక పోరని ఎదురుచూస్తారు” అంటూ బడుగుజీవన నేపథ్యాన్ని గుర్తుకుతెచ్చాడు. పహరి గోడ సరిహద్దు దాటి లోనికి ప్రవేశం నిషిద్దం. అక్కడే నిల్చొని తొంగిచూసే కాకులు, పిట్టల సాకుతో సామాజిక వివక్షను కవిత్వవంతంగా చెప్పడం రఘు ప్రత్యేకత.
”నా బారసాలకు యాబై ఏళ్ళొచ్చాయని/ మా పండుముసలి మేనత్త నవ్వులా మెరుస్తున్న/ ఆ వెండిగ్లాసు చెప్పింది”
తామరకొలను వంటి వంటింటిలో అనుకోకుండా కంటబడిన వెండిగ్లాసు మెరుపులో అర్ధశాతాబ్దం నాటి తన బారసాల ఆత్మీయదృశ్యాన్ని ఊహించాడు రఘు. ఇక్కడ వెండిగ్లాసు ఒక నెపం మాత్రం ఆ మెరుపుల్లోని ప్రతిఫలనం తన మేనత్త నవ్వు. వస్తువు నెపం కావడం అంటే దాని చుట్టు అగోచరంగా తిరిగే ప్రతిఫలనాలను వైపు దృష్టి సారించడమే గానీ వస్తువుని అర్థాంతరపు అడవిలో వదిలివేయడం కాదు. మానవసంబంధాల పట్ల రఘుకు మమకారం ఎక్కువ. చివరికి పిల్లనిచ్చిన ఊరును సైతం ఈ బంధగంధంగానే తన ఆలోచనలకు అలుముకొంటాడు రఘు శేషభట్టార్‌.
వస్తువుతో కవికి ఆత్మీయభావం లేకపోతే అతని కవిత్వం పఠితహృదయస్పందనగా రూపొందదు. కవిత్వరచనలో వస్తువు శిల్పం వేరు వేరు కావు. ఒకే నాణానికి బొమ్మాబొరుసు. కవిత్వంలో వస్తువు ఒక నెపంగా కవి దాని ప్రతిఫలనాలను కవితలో ఎలా మలిచాడో మచ్చుకు పై కవితలు ఒక అచ్చుతునకలు.
సమాజాన్ని చూసే దృక్కోణం ఒక్కొక్క కవికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన కళ్ళతోనే ప్రపంచాన్ని చూడాలనుకోవడం కవి స్వేచ్ఛను హరించడమే. ఏ విమర్శకుడైనా కవి రచనోద్దేశ్యాన్ని తెలుసుకోవాలంటే మునుముందు ఆ కవి దృక్పథాన్ని పరిశీలించక తప్పదు. అన్ని రచనలకు ఒకే తూనిక పనికి రాదు, విమర్శకునికి కొంత పూనిక కూడా అవసరం. ప్రయాణంలో ఉబుసుపోక చదివే వ్యాపారాత్మక ఊకరచనల్లా కాదు రఘు కవిత్వం. రఘును కాస్తా తీరిగ్గా, నింపాదిగా సమయం తీసుకొని చదవాల్సి అవసరం ఉంటుంది.
”రవిబింబంబుపమింప బాత్తమగుఛత్రంబై…” పద్యంలో సూర్యుడు వివిధ దశల్లో ఎలా కనిపించాడో వర్ణించాడు పోతన. వస్తువు ఒకటే అయినా చూసే చూపును బట్టి భిన్నంగా కనిపిస్తుంది. ‘అనల్పం’లోని వస్తువైవిధ్యం కూడా భిన్నంగా కనిపించడానికి రఘు వస్తువును చూసే దర్శనంలోని దృక్కోణమే కారణం. రఘుని మిగతా కవుల నుంచే వేరుగ చూపించేది కూడా ఇదే. అనల్పంలో మిగతా కవితల కంటే విడిగా కనిపించేది ‘యుద్ధనౌక’ అనే కవిత. ఇది కవి ఇజ్రాయిల్‌ సమర్థిస్తూ రాసిన రాజకీయ కవిత. లోకమంతా పాలస్తీనా వైపు నుండి నినదిస్తుంటే ఈ కవి మాత్రం
”మీరు బోస్నియాలు, చెచన్యాలు/ గాజాల గురించి మాట్లాడతారు/ నేను ఐసెస్సైలు, అల్‌ ఖైదాలు/ పందుల గురించి మాట్లాడతాను…” అని నిర్మొహమాటంగా ప్రకటించాడు. ఇజ్రాయేల్‌ విషయంలో పత్రికలలో వచ్చిన ప్రధాని ప్రకటనకు స్పందనగా రఘు ఈ కవిత రాసినట్లుంది. ప్రధాని అంతర్జాతీయ విషయాలలో ఆచితూచి మాట్లాడటం విన్నాం. రఘుది లిఖితాభిప్రాయం మాటలాగా మార్చుకోవడం కుదరని పని. రఘు రాజకీయాల జోలికి సహజంగా పోడు అలాగని రఘు రాజకీయాతీడు కాడు. అతనికి తనవైనా రాజకీయాలు ఉన్నాయని కొన్ని కవితలు చెప్పకనే చెబుతాయి. అందులో ఈ కవిత ఒకటి. దశాబ్దాల పాలస్తీనా సమస్యను చరిత్ర లోతులలోకి వెళ్ళి చూస్తే గానీ అసలు వాస్తవాలు తెలియవు. ఈ విషయంలో దోషి ‘శ్వేతభవనం’ దాని ఆయుధవ్యాపారంలో భాగంగా అనేక యుద్దోన్మాద నాటకాలకు అది తెర లేపిన విషయం ప్రపంచానికి తెలుసు. ఇజ్రాయిల్‌ దాని కీలుబొమ్మ అంతే. ఏమైనా పానంకంలో పుడకలాంటి ఈ కవితను కాలానికి వదిలేయడమే మంచిది. ఎప్పటికైనా నిజాలు నిగ్గుదేలక మానవు కదా. రసామృతసముద్రం లాంటి రఘు కవిత్వంలో ఓలలాడుతూ ఒడ్డుకు కొటుకువచ్చిన మతశేషాల వైపు దృష్టి సారించడం అనవసరం. ఇది సహృదయ లక్షణం కూడా కాదు.
మంచి కవిత్వం కోసం ఎదురుతెన్నులు కాచే సహృదయపాఠకులు ఎప్పుడూ ఉన్నారు. ‘అనల్పం’ అలాంటి చాతక హృదయాల దాహార్తి తీర్చే వెన్నెల జలపాతం.
– షుకూర్‌
9491088529

Spread the love