దీపశిఖరాగ్రహం

దీపశిఖరాగ్రహంతప్పుడు ఆధ్యాత్మికత బూడిదవుతున్నపుడు
కాలిపోయినవన్నీ
వెచ్చని కన్నీళ్ళలా ఉప్పగానే ఉంటాయి
వసంత వాత్సల్యంలో రుతువు అద్దిన
సౌందర్యమే పూల కలాపి చిమ్ముతుంది
కలమీది ప్రేమతో నిదుర తీసిన దొంగ కునుకే
పలవరింతకు పాఠం చెపుతుంది
కరిగిన భక్తి గుండె రోదన
ఆర్ఘ్యం వదిలిన మంత్రంలానే
నీటి కొలిమై సలుపుతుంది
కరకు ధ్యానపు మాట స్పర్శకు
శాపమై మండినపుడు కూడా
దీపశిఖమాటు చీకటిని
తెలుసుకోలేం కదా
ధూమ విలాసం
హోమ సలాపం
మమ సమర్పణే కదా
గాయమయేంతదాకా లావా ద్రవం
మేఘ పర్వతమేనని గ్రహించలేం కదా
ఎంత గరుకుగా ఉన్నా
సహజీవనం తప్పని జీవితం
ఎంత మెతకగా ఉన్నా
ఎడబాటు తప్పని సాంగత్యం
గంధకంతో ఘర్శించే జలతర్పణ
వత్తినై ధ్యానించే దైవం విగ్రహం
విదిల్చిన శిలాశకలాలు
భయమై బాధై మూఢమై విశ్వాసమై
దీవించే బూది విభూది చిటికెడు చిటికెలో!
– ప్రసేన్‌

Spread the love