బన్న అయిలయ్య చైతన్య శక్తి

Banna Ailaiah Chaitanya Shaktiబన్న అయిలయ్యతో నాది మూడు దశాబ్దాలకు పైబడ్డ అనుబంధం. కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్‌ Ê సైన్స్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పదేళ్లు పాఠాలు చెప్పి బదిలీ మీద 1987లో తెలుగు విభాగంలోకి వచ్చేటప్పటికి అయిలయ్య ఎమ్‌.ఏ. రెండవ సంవత్సరం విద్యార్ధి. ఆ రకంగా చూస్తే మా అధ్యాపక విద్యార్థి సంబంధ కాలం ఏడాది కూడా లేదేమో…! అయితేనేమి? సహ ‘అధ్యాపకుడై జీవితకాలపు ఆత్మీయుడయ్యాడు. అతనితో పాటు సీతారాం, పంతంగి వెంకటేశ్వర్లు కూడా నాకు విద్యార్ధి అధ్యాపక మిత్రులే. వాళ్ళ ముగ్గురి స్నేహం ముచ్చట గొలిపేది.
అంతర్జాతీయంగా మహిళా దశాబ్ది చైతన్యం, దేశీయంగా మరీ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కారంచేడు దళితుల మీద జరిగిన దాడి, అత్యాచారం ఘటనలపట్ల ఆగ్రహ ప్రకటనగా వ్యక్తమైన ఆత్మగౌరవ చైతన్యం కారణంగా 1985 తరువాత తెలుగుసాహిత్యం కొత్తవస్తువును, అభివ్యక్తి రీతులను, పదజాలాన్నీ సమకూర్చుకొని కొత్తశక్తితో, హెచ్చరికలతో తెలుగు సమాజాన్ని గొప్ప కుదుపుకు లోను చేసింది. ఆ కాలం కొలిమిలో కాలి ‘నిప్పుకణిక’ అయినవాడు అయిలయ్య. ఈ కాలానికి ప్రాతినిధ్యం వహించే రెండు కవితా సంకలనాలు చిక్కనవుతున్న పాట (1995), పదునెక్కినపాట (1996). ఆ రెండింటిలో అయిలయ్య కవితలు ఉన్నాయి.
”నడుస్తున్న కాలం మీద మణి కిరీటాన్ని నేను
మట్టి చరిత్ర వినా
మలిన చరిత్ర లేనివాణ్ణి” (అమలిన చరిత్ర, 1994) అంటూ ఆత్మగౌరవ ప్రకటనతో తన కవితా యాత్ర ప్రారంభించాడు.
”క్షతగాత్రమైన దేహాన్ని మోస్తూ/ కారంచేడు తిమ్మ సముద్రం చుండూరు” అనుభవాల నుండి ”ఏ వ్యూహాలు లేకుండానే తెరచాపల్నెత్తి/ బతుకు సముద్రంలోకి దిగిన దళితులను ఇక ఏ తుఫానులూ అడ్డుకోలేవని నమ్మకాన్ని ప్రకటించటం ఈ కవితకు ముగింపు. అయిలయ్య రాసిన దీర్ఘ కవిత ‘నిప్పుకణిక’ 1998 లో ప్రచురించబడింది. దీనికి ముందుమాట రాసిన మద్దూరి నగేష్‌ బాబు ”ఎన్ని హరితవనాలు మావి కాకుండాపోయాయి/ ఎన్ని అడవులమీది గాలులు మమ్మల్ని తాకకుండా వీదాయి” అన్న పంక్తులను ఉదహరిస్తూ ఒక ఉద్యమ నిర్లక్ష్య సూచన వాటిలోని విశేషమని, సమకాలీన దళితుల వాదనలోని అతి ప్రధానమైన అంశాన్ని సులభ సూత్రంగా కవిత్వం చేయగలిగాడని చెప్పటం అందుకు నిదర్శనం.
అదే సమయంలో దళిత కోణం నుండి సాహిత్య అధ్యయన విమర్శలు ప్రారంభించాడు అయిలయ్య. 1999 మార్చ్‌ లో తెలుగు విభాగం ‘మహాభారతం నేటి ఆవశ్యకత’ అనే అంశం మీద సెమినార్‌ పెడితే అందులో పత్రసమర్పణకు అతను ఎంచుకొన్న అంశం ”మహాభారతం వర్ణవ్యవస్థ”. దళిత కోణం నుండి చరిత్రను, జీవితాన్ని చూస్తూ వ్యాఖ్యానించటం తిరగ రాయటం, తిరిగి నిర్వచించటం దళిత ఉద్యమ లక్ష్యం అయినప్పుడు సాహిత్యం కూడా అందుకు మూలవనరు అవుతుంది. అప్పటికి స్త్రీవాద ఉద్యమ సందర్భం నుండి మహిళా జనజీవన కోణంతో ప్రాచీన ఆధునిక సాహిత్య అధ్యయన విమర్శ కొనసాగిస్తున్న నాకు డిపార్ట్‌మెంట్‌లో అయిలయ్య అలా దళితవాద కోణం నుండి ప్రాచీన సాహిత్య అధ్యయనానికి పూనుకొనటం సంతోషాన్ని కలిగించింది.
తరువాత అతను ప్రబంధ సాహిత్యాన్ని కూడా వర్ణ వ్యవస్థ కోణం నుండి అధ్యయనం చేస్తూ ఒక వ్యాసం రాసాడు. కానీ ఎందుచేతనో దానిని తరువాతి కాలంలో పెద్దగా కొనసాగించలేదు. అలాగని అతను దళితవాద అధ్యయనం వదిలేశాడని కాదు, ఆధునిక సాహిత్యం పట్ల ఉన్న అభినివేశంతో వచన కవిత్వానికి, వచన సాహిత్య ప్రక్రియలైన కథ, నవలలకు పరిమితం చేసుకొన్నాడు అంతే! దళిత సామాజిక వర్గం నుండి వచ్చిన కవులు, కథకులపై విస్తతంగా పరిశోధనలు చేయించటమైనా, దళిత రచయితల రచనలపై తాను స్వయంగా విమర్శలు రాయటమైనా అందులో భాగమే. తెలుగుసాహిత్యంపై మహాత్మగాంధీ, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ప్రభావం అనే అంశం మీద 2009-2011 లో మేజర్‌ రీసర్చ్‌ ప్రాజెక్ట్‌ కు పని చేయటం దానికి కొనసాగింపే.
అయిలయ్య దళిత అస్తిత్వ చైతన్యం నుండే కాదు, అదే స్థాయిలో ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం నుండి కూడా పనిచేశాడు. 1997 లో వరంగల్‌ లో జరిగిన జన సభ ప్రజాస్వామిక ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ అని ప్రకటిస్తూ విడుదల చేసిన వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రేరణగా తెలంగాణా సాహిత్యం పై తెలుగు విభాగం 1998 మార్చ్‌ లో నిర్వహించిన సెమినార్‌ తెలంగాణ సాహిత్యం ఒక ప్రత్యేకమైన పేపర్‌గా ఎమ్మే విద్యార్థుల అధ్యయనానికి రూపొందించాలని, పరిశోధనలు, విమర్శ తెలంగాణా సాహిత్యం కేంద్రంగా విస్తరింప చేయాలనీ తీర్మానాలు చేయబడ్డాయి. ఆ నేపథ్యంలో అయిలయ్య తెలంగాణ కవులు, రచయితలకు సంబంధించిన రచనలపైన పరిశోధనకు విద్యార్థులను ప్రోత్సహించాడు.
ఇక తెలుగువిభాగంలో వివిధ హోదాలలో ఇద్దరం కలిసి పనిచేసిన కాలపు అనుభవాలు అనేకం. తెలంగాణా సాహిత్యం, దళిత సాహిత్యం పేపర్లు రూపొందించటం, తెలంగాణ సాహిత్యం కాప్‌ స్పెషల్‌ అసిస్టెన్స్‌ రెండవ దశ ప్రాజెక్ట్‌ కోసం ఇద్దరం కలిసి ప్రతిపాదనలు తయారుచేయటం, కలిసి డిల్లీ వెళ్లి యూజీసీ టీమ్‌ ముందు చర్చకు పెట్టి గ్రాంట్స్‌ సాధించుకొని రావటం, ప్రాజెక్ట్‌ పనులను ప్రణాళికా బద్దంగా నిర్వహించటం, అరుదైన పుస్తకాల సేకరణలో ఆనందం పొందటం, తెలంగాణ సాహిత్య గ్రంథాలయాన్ని అభివద్ధిపరచటం, సెమినార్లు నిర్వహించటం అన్నీ తలచుకొంటే ఎంతో తప్తిగా అనిపిస్తుంది. సాహిత్య విమర్శకు, తెలుగు విభాగం వికాసానికి సంబంధించిన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకొనటం మా స్నేహాన్ని సాంద్రతరం చేశాయని చెప్పగలను. నేను రిటైర్‌ అయి ఎనిమిదేళ్ళయినా మీరు డిపార్ట్‌మెంట్‌ మనిషి అంటూ సెమినార్లు మొదలైన సందర్భాలలో సంప్రదిస్తూ, నన్నూ భాగస్వామిని చేస్తూనే వచ్చాడు అయిలయ్య. అయిలయ్య కూడా రిటైర్‌ అవుతున్నాడంటే నమ్మలేకపోతున్నాను. మనకు ఇష్టమున్నా లేకపోయినా కాలం తెచ్చే అనివార్యమైన సందర్భాలు మనలను నడిపిస్తాయి. ఉద్యోగ విరమణ తరువాత కూడా చేతినిండా పని ఉండాలని, అయిలయ్య శక్తులు వినియోగంలోనే ఉండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
– ప్రొ||కాత్యాయనీ విద్మహే, 9440550379

Spread the love