కవిత్వం, సినిమాలు ఆయనకు రెండు కళ్లు

కవిత్వం, సినిమాలు
ఆయనకు రెండు కళ్లు”మొర గోరా రంగ్‌ లైలే..” అంటూ మొట్టమొదటిసారిగా బిమల్‌ రారు సినిమాకు రాసినా.. ”మైనే తెరెలియే హి సాత్‌ రంగ్‌ కె సప్నే చునే” అంటూ ‘ఆనంద్‌’లో ప్రేమకి జ్ఞాపకానికీ లంకె వేసినా..
”ముసాఫిర్‌ హో…యారో .. నా ఘర్‌ హై నా టిఖానా …” అంటూ ‘పరిచరు’లో మనమంతా యాత్రికులమే పయనించే దారిని యాత్రని ఆనందించాల్సిందే అన్నాడు గుల్జార్‌.
”దిల్‌ హోం హోం కరే ఘబ్‌ రాయే” అని ‘రుడాలి’లో వేదన పడ్డా, ”మేర కుచ్‌ సామాన్‌ తుమ్హారే పాస్‌ పడా హై..” అంటూ ‘ఇజాజత్‌’లో ప్రేమ విఫలమైన ప్రేమికురాలి దు:ఖం వేదన ఒంటరితనం అన్నింటిని కలగలిపి ఇజాజత్‌లో రాసినా, వాటిల్లో వాడిన ఆ భాష ఆ భావసాంద్రత గుల్జార్‌ కే చెల్లింది. ఇట్లా సినిమా పాటల గురించి రాస్తూ పోతే ఎన్నో ఎన్నెన్నో పాటలు ఆయన కలం నుండి వెలువడ్డాయి. అవన్నీ పాఠకుడి మనసుని కట్టిపడేస్తాయి.
ఇక సంభాషణల విషయానికి వస్తే ”బాబూమొషై జిందగీ బడీ హౌనీ చాహీయే, లంబీ నహి”, ”జబ్‌ తక్‌ జిందా హూ తబ్‌ తక్‌ మరా నహీ, జబ్‌ మర్‌ గయా సాలా మై హీ నహీ”, ”మౌత్‌ తో ఏక్‌ పల్‌ హరు, (జీవతం ఉన్నత మైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు, బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను, మరణం ఒక క్షణమే)… ఇలాంటి తాత్విక సజీవమయిన సంభాషణలు ‘ఆనంద్‌’ సినిమాలో గుల్జార్‌ రాశారు. అట్లా ఆయన పాటలు, సంభాషణలే కాదు గుల్జార్‌ గొప్ప కవి, సినీ గేయ రచయిత, రచయిత, సినీ దర్శకుడు. గుల్జార్‌ రచనలు, సినిమాలు, గజల్స్‌ అన్నీ సృజనాత్మకంగానూ తాత్వికంగానూ వుండి ఆయనలోని సున్నితత్వాన్ని, సరళత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన కవిత చదివే పద్ధతి కూడా శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇట్లా పలు రంగాల్లో తన ముద్రను చాటుకున్న గుల్జార్‌ అనువాదంలో కూడా ఉన్నతమయిన కృషి చేసాడు, చేస్తున్నాడు. ఇంగ్లీష్‌, ఉర్దూ, హిందీ, పంజాబీ, బెంగాలి భాషల్లో ప్రావీణ్యమున్న గుల్జార్‌ దేశంలోని ఇతర భాషల రచనల్ని చదవడానికీ ఇష్టపడతాడు. ‘మన మెదడు ఆంటెన్నా (aఅ్‌వఅఅవ) ను తెరిచి వుంచాలి, అప్పుడే ఇతర ప్రాంతాల్లో ఇతర భాషల్లో ఏమి జరుగుతుందో తెలిసి వస్తుంది’ అంటాడు గుల్జార్‌. అట్లా భాషల్లో, సాంస్కృతిక ప్రక్రియల్లో నిరంతర కృషి కొనసాగిస్తున్న గుల్జార్‌ ఒక లివింగ్‌ లెజెండ్‌. దర్శకుడిగా హిందీ చలన చిత్ర సీమలో తన ముద్రను చాటుకున్నవాడు గుల్జార్‌. సినిమా రంగంలో విశేషమయిన్‌ కృషి చేసిన ఆయనకు ఆ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు, సత్కారాలు లభిచాయి. ఆస్కార్‌, గ్రామీ, దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం, అనేక జాతీయ పురస్కారాలు వచ్చాయి.
‘ఎక్కువ మంది నేను సినిమాల్లోనూ సినిమాల కోసమూ రాసిన వాటిని ఇష్టపడతారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు. కానీ నేను మనిషి పడే బాధ, సంఘర్షణ, దేశాన్ని ప్రేమించడం లాంటి అనేక విషయాల్నీ అభిమానిస్తాను. అంతేకాదు అందరూ జీవితంతో అనుబంధం పెట్టుకోవాలని అందరికీ చెబుతాను అప్పుడే ఆనందంగా వుంటారనీ చెబుతాను’ అంటాడు గుల్జార్‌.
కవిత నిడివి గురించి అడిగితే ‘నువ్వు అధికంగా మాట్లాడ్డం ప్రారంభించగానే జనం నిన్ను వినడం మానేస్తారు. అధికంగా చెప్పిన ఏదయినా దాని ప్రభావాన్ని కోల్పోతుంది. క్లుప్తంగా రాసిన కొన్నిమాటలే ఎక్కువ శక్తివంతమయినవి, ఎంతో ప్రభావ వంతమయినవి. నేనయితే నా కవిత్వంలో ముఖ్యమయిన విషయాల్ని అతి తక్కువ మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అంటాడు గుల్జార్‌.
గుల్జార్‌ గా అందరికీ పరిచయమున్న ఆయన అసలు పేరు సంపూరన్‌ సింగ్‌ కల్రా. ఆగస్ట్‌ 18,1936 రోజున ప్రస్తుతం పాకిస్తాన్‌ లో వున్న దీన పట్టణంలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటినుంచీ అంతాక్షరీ ఆడడంలో ఆసక్తిగా వుండే ఆయన అప్పటినుండే భాష పట్ల పదాల పట్ల మక్కువను పెంచుకున్నాడు. చిన్నప్పటినుండే హిందుస్తానీ సంగీతం పట్ల మక్కువ కలిగిన గుల్జార్‌ రవిశంకర్‌, అలీ అక్బర్‌ ఖాన్‌ ల కచేరీలకు వెళ్ళేవాడు. గుల్జార్‌ కుటుంబం దేశ విభజనలో తీవ్రంగా ప్రభావితమయింది. సొంతవూరు విడిచి అమృత్‌సర్‌ కి వలస వచ్చింది. అప్పుడు ఆయన చూసిన హింస, దౌర్జన్యాలు, పడ్డ వేదన దు:ఖం ఆయన కవిత్వంలో అంతర్లయగా ధ్వనిస్తూనే వుంటుంది.
ఇక తమ కుటుంబ వ్యాపారమయిన మెకానిక్‌ షాప్‌లో పనిచేయడంతో గుల్జార్‌ జీవితం ఆరంభమయింది. ప్రమాదంలో సొట్టలు పడ్డ కార్లకు కలర్‌ మాచ్‌ చేసే పని చేసేవాడు. తన పదమూడేళ్ళ వయస్సులోనే చదవడం పైన ఆసక్తి కలిగిన గుల్జార్‌ తమకి దగ్గరలో ఓ కాందిశీకుడు నిర్వహించే పుస్తకాలు కిరాయికిచ్చే షాప్‌ నుండి అపరాధ పరిశోదక నవలలు, మాజిక్‌ ఫాంటసీ రచనల్ని లాంతరు ముందు చదవడం ఆరంభించాడు. వారానికి పావలా రుసుము చెల్లిస్తే ఎన్ని పుస్తకలయినా చదివే వీలుండేది అక్కడ. దాంతో తమ షాప్‌ పని అయిపోగానే రోజుకు ఒకటి అని కాకుండా రెండు మూడు పుస్తకాలు చదవడం చేసేవాడు గుల్జార్‌. ఒక నాటికి షాప్‌ లోని దాదాపు పుస్తకాలు అయిపోవడంతో షాపతను ఇట్లా ఒక్క పావలాకు ఎన్ని చదువుతావు అంటూ సజ్జ మీదవున్న పుస్తకమొకటి తీసి ఇచ్చాడు. ఆది టాగోర్‌ రాసిన ‘గార్డనర్‌’. అది చదివింతర్వాత గుల్జార్‌లో చదివే దృక్పథమే మారిపోయింది. ఆ తర్వాత ప్రేంచంద్‌ నుంచి మొదలు అనేక మంది గొప్ప రచయితల రచనలు చదవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు ప్రగతిశీల రచయితలు, కళాకారులతో పరిచయం కలగడం పిడబ్ల్యూఎ కార్యక్రమాలల్లో పాల్గొనడం మొదలయింది. అప్పుడే శైలేంద్ర పరిచయం అయ్యాడు. అదే సమయంలో బిమల్‌ రారు ‘బందిని’ సినిమా తీయడం మొదలు పెట్టాడు. శైలందర్‌ పరిచయంతో గుల్జార్‌, బిమల్‌దాను కలుసుకున్నాడు. మొట్ట మొదటి సినిమా పాట ‘మేర గోరా అంగ లయిలే..” తో ఆరంభమయింది. అయితే బిమల్‌ దా గుల్జార్‌ తో మాటాడుతూ సినిమాలకు పనిచేయడం నీకిష్టం లేదని తెలుసు కానీ నువ్వు నా దగ్గర ఆసిస్టంట్‌ గా చేరు. అంతే కానీ ఇక ముందు తన మెకానిక్‌ షాప్‌ కు వెళ్ళకు. రచనల పైన దృష్టి పెట్టాలని సూచించాడు. దాంతో గుల్జార్‌ పూర్తి స్థాయిలో సృజన మీదే దృష్టి కేంద్రీకరించాడు. బిమల్‌దాకి పూర్తి స్థాయి సహాయకుడిగా ఉండిపోయాడు. తర్వాత హ్రిషికేశ్‌ ముఖర్జీ, అసిత్‌ సేన్‌ లాంటి దర్శకుల సినిమాలకు రచనలు చేయడం ఆరంభించాడు.
ఇక తర్వాత 1971 లో ‘మేరె అప్నే’ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు గుల్జార్‌. జితేంద్ర ప్రధాన పాత్రధారిగా 1972లో ‘పరిచై’ తీసాడు. 1972లో అయన రచించి దర్శకత్వం వహించిన ‘కోషిష్‌’ అత్యంత సున్నితమయిన మానవీయ దృక్పథంతో తీసిన సినిమాగా మిగిలి పోయింది. సంజీవ్‌ కుమార్‌, జయాభాధురి ప్రధాన భూమికల్ని పోషించిన ‘కోషిష్‌’లో ఇద్దరు మూగ చెవిటి వాళ్ళ జీవితం దాంట్లో వారు ఎదుర్కొన్న అవస్థలు హృద్యంగా చూపిస్తాడు గుల్జార్‌. ఇంకా దర్శకుడిగా గుల్జార్‌ ‘కితాబ్‌, పల్కొంకీ చావ మే, శాహీరా, చత్రన్‌, సునేయే, ఆల్కా, ఇజాజత్‌, లిబాస్‌, మాచిస్‌, హు టు టు’ లాంటి సినిమాలు రూపొందించాడు.
టెలివిజన్‌ రంగంలో ఆయన రూపొందించిన సీరియల్స్‌ గొప్పగా విజయవంతమయి కల్ట్‌ గా మిగిలిపోయాయి. రచయితగా, దర్శకుడిగా ఆయనలోని సున్నితత్వం ప్రతిభ విశేషంగా పేరు గడించింది. ఆయన రూపొందించిన ‘మిర్జా గాలిబ్‌’ సీరియల్‌ ఆ మహాకవి కవిత్వాన్ని జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అందులో గాలిబ్‌ గా నసీరుద్దిన్‌ షా, గాయకుడిగా జగ్‌ జీత్‌ సింగ్‌ తమ అద్భుత ప్రదర్శనను అందించారు. వారి ప్రతిభను ఆవిష్కరించడంలో గుల్జార్‌ భావుకత, నిబద్దత ప్రధాన భూమికను పోషించాయి.
ఇక గేయ రచయితగా గుల్జార్‌ 100 పైగా సినిమాలకు పాటలు రాసాడు. అలనాటి బందినితో మొదలయిన ఆయన ప్రస్తానం సలిల్‌ చౌదరి, ఎస్‌. డి.బర్మన్‌, ఆర్‌.డి.బర్మన్‌, మదన్మోహన్‌, విశాల్‌ భరద్వాజ్‌, ఎ.ఆర్‌. రెహమాన్‌ లాంటి ప్రాచీన ఆధునిక సంగీతకారులతో అవిశ్రాంతంగా సాగింది. అలనాటి మెలోడీ పాటలు గొప్పగా రాసిన గుల్జార్‌ ‘కజరారే..’ (బంటీ ఆర్‌ బబ్లూ), ”చయ్య చయ్య చయ్యా” (దిల్‌ సే ) లాంటి ఆధునిక పాటల్ని కూడా రాసాడు. ఇవ్వాళ మెలొడీకి స్థానం లేదని బీట్‌కే ప్రధాన పాత్ర అని ఆయన అంటారు. కాలానుగుణంగా సినిమాలు రచనలు వస్తాయని ఆయన అభిప్రాయ పడతారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ తో కలిసి ”జై హో..” పాటకు గుల్జార్‌ ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు.
గుల్జార్‌ కవిత్వం, వచనం మనసుకు హత్తుకునేలా రాశారు. ఆయన రాసిన ‘గ్రీన్‌ పోయెమ్స్‌’ని నేను ఆకుపచ్చ కవితలు పేర తెలుగులోకి అనువదించాను, వర వర రావు గారు ‘సస్పెక్టెడ్‌ పోయెమ్స్‌’ని అనుమానిత కవితలు గా అనువదించారు.
గుల్జార్‌ కూడా అనేక అనువాదాలు చేశారు. ‘ఏ పోయేమ్‌ ఏ డే’ పేర భారీ సంకలనాన్ని తెచ్చారు. అందులో 34 భారతీయ భాషల్లోని 279 కవుల 365 కవితల్ని అనువదించి ప్రచురించారు.
అయన 1973 లో ప్రముఖ నటి రాఖీ ని వివాహం చేసుకున్నారు. తర్వాత కొంత కాలానికి వేరై వేరుగా వుంటున్నారు. వారి కూతురు మేఘన గుల్జార్‌ దర్శకురాలిగా ‘ఫిల్‌ హాల్‌, జస్ట్‌ మారీడ్‌, దస్‌ కహానియా, తల్వార్‌, రాజీ, చాపాక్‌, సామ్‌ బహదూర్‌’ సినిమాలు రూపొందించారు. అంతేకాదు తన తండ్రి పైన ‘బికాస్‌ హి ఈస్‌’ పుస్తకం రాసారు.
గుల్జ్జార్‌ బహుముఖీన ప్రతిభలో ఆయన రాసిన రచనలు భారతీయ హిందీ, ఉర్దూ సాహిత్య రంగాల్లో విలక్షణతను విశేష ఖ్యాతిని పొందాయి. ఆయన రవీంద్రనాథ్‌ రచనల్ని అనేకం అనువాదం చేసారు. గ్రీన్‌ పోయెమ్స్‌, సస్పెక్టెడ్‌ పోయెమ్స్‌, జిందగీ నామా, హాఫ్‌ ఎ రూపీ, సేలేక్తేడ్‌ పోయెమ్స్‌, 100 లిరిక్స్‌, మేరా కుచ్‌ సమ్మాన్‌, సైలేన్సేస్‌, టూ లాంటి ఎన్నో రచనలు విశేష ప్రశంసల్ని అందుకున్నాయి.
గుల్జార్‌ ఇప్పటికే పద్మభూషణ్‌, సాహిత్య అకాడమి అవార్డు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు జ్ఞానపీఠ పురస్కారం అందుకోవడంతో ఆయన కవిత్వం మరింతగా పాఠకులకు చేరుతుంది. ఆయనకు హృదయపూర్వక అభినందనలు.
-వారాల ఆనంద్‌,
9440501281
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత

Spread the love