వాళ్లు ఏమి అడిగారు

వాళ్లు ఏమి అడిగారువాళ్లు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వాగ్దానాలను
నిలబెట్టుకోవాలని అడిగారు
వాళ్లు ఏమి కోరారు
పంటకు మద్దతు ధర చట్టబద్ధంగా కల్పించమన్నారు
వాళ్లు ఎందుకు ఏమని
మేమంతా ఒక్కటేనని పిడికిలెత్తి నినాదం ఇచ్చారు
వాళ్లు దేన్ని కొడవలిలా
గొంతెత్తి ప్రశ్నించారు నిరసనలు ప్రదర్శించారు
వాళ్లు కూరగాయలను రోడ్డుమీద పారబోసుకుంటున్నప్పుడు
వాళ్లు పంటలకు పొలాల్లో మంటపెట్టుకుంటున్నప్పుడు
గిట్టుబాటు ధర రాక రైతు అప్పుతో
ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు
చంపి చావు ఖర్చులు ఇచ్చినట్టు మొసలి కన్నీటి ఓదార్పు
ఇదంతా రాజ్యం నిర్వాకం కదా
చెవులు పిండి చేతిలో పెట్టినట్టు
ప్రభుత్వాల రైతు సహాయ పథకాలు
గ్రామ గల్లీలలో నివసించే వారు
వాళ్లు ఢిల్లీని ముట్టడిస్తానన్నారు
లోహ కంచెలు సిమెంటు గోడలు
రోడ్డుపై ఇనుప మేకులు నాటారు
ఇప్పుడు ఖాకీ పహరాలో కోరికల జెండాను నిలువరించబోయి
మహా గొప్ప దేశ రాజధాని తనకు తాను కట్టడి వేసుకున్నది
టియర్‌ గ్లాసు సెల్స్‌
సరిహద్దులు కాపాడాల్సిన తుపాకులు
రైతులపై పెలెట్ల బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది
చతురత చర్చల ముగింపు కాదు
వ్యవసాయదారిని ఆశ ఓ కొలిక్కి రాదు
వెలిగిపోతూ వికసిస్తున్న భారతం
పరిశ్రమలకు ఇసుమంత శ్రమ లేకుండా
అడ్డగోలుగా లక్షల కోట్లు రుణాలు
దారుణంగా మాఫీ అయిపోతాయి
ఈ దేశం కంట్లో నలుసు
రైతు అంటేనే ప్రతొక్కడికి అలుసు
కనులు పోగొట్టుకొని ప్రాణాలు ఎదురెడ్డి
వాళ్లు రోడ్లమీద రక్త సంతకాలు చేస్తుంటారు
మన కడుపుకింత తిండి పెడుతున్నోళ్లు
రౌద్రంతో కళ్ళు ఎర్ర మందార సముద్రాలయ్యారు
అడగంది అమ్మయినా అన్నం పెట్టదు
చచ్చిన తర్వాత సమాధిమీద ఆవు కట్టేసినట్టు
అశాంతిని రేపి శాంతి మంచం జప తపం
పంట పొలాన్ని నివాస స్థలాన్ని విడిచి వచ్చి ఏమి అడిగారు
దళారుల నుంచి కాపాడమన్నారు
పంటకు మద్దతు ధర చట్టబద్ధం చేయమన్నారు
వాళ్లు బతుకును బతకులా
వికసించనీయమన్నారు బతకనీయమన్నారు
– జూకంటి జగన్నాథం, 9441078095

Spread the love