నేను మళ్ళీ రాయాలి

అవును, నేను మళ్ళీ రాయాలి
భ్రమయుగాలు బద్దలయ్యేలా రాయాలి
అవినీతిమయమైన వ్యవస్థపై ఉమ్మేస్తూ రాయాలి
నాలోని మనిషిని కాపాడుకోవడం కోసం రాయాలి
ఆశల అలలలో కొట్టుకుపోతున్న వాడిని
అక్షరాల తీరం చేర్చడానికైనా రాయాలి
మనుషుల్లో మనుషులను వెతుక్కోవడం కోసం రాయాలి
దేశభక్తి, దైవ భక్తుల వికట్ట ప్రదర్శనలపై రాయాలి
విశ్వవిఖ్యాత రాజకీయ నటసార్వభౌముల ప్రతిభాపాటవాలను
నలుగురికి తెలపడం కోసమైనా రాయాలి.
పనులెన్ని ఉన్నా రాత్రికి కొంచెం మెలకువ ఇచ్చి తీరాలి
యుగాల చీకటిని తరిమేసేందుకైనా మళ్ళీ రాయాలి.
నేర్చుకుంటూ రాయాలి
రాస్తూనే నేర్చుకోవాలి నేను మళ్ళీ రాయాలి
చెమట చుక్కల కోసం రాయాలి
రక్తమోడుతున్న అన్నం మెతుకుల కోసం రాయాలి
దిక్కులేకుండా పోతున్న హక్కుల కోసం రాయాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో జలగల గురించి రాయాలి
ప్రజాస్వామ్య గుర్రాన్ని గడీల్లో కట్టేసుకుంటున్న దొరల చరిత్ర రాయాలి.
ఇంకా మిగిలి ఉన్న మానవత్వం గురించి రాయాలి
నిస్వార్ధంగా నినదిస్తున్న గొంతుల గురించి రాయాలి!
ముగింపు లేని వాక్యాన్ని కొనసాగించాలి
గడ్డ కట్టిన నదిని పెకిలించాలి
ఇక ఒకటే కల రాస్తూనే బతకాలి రాస్తూనే చావాలి!
– కాసుల రవికుమార్‌, 9908311580

Spread the love