వ్య‌ర్థాల్లో అర్థాలను వెతుకుతూ

Finding meaning in wasteపాత సీడీలు ఆమె చేతిలో వాల్‌ హ్యాంగింగ్‌లుగా మారిపోతాయి. టీ-షర్టులు బ్యాగులుగా రూపొందించబడతాయి. పాత సీసాలు పూల కుండీల కోసం తయారు చేయబడతాయి. ఉద్యోగ విరమణ తర్వాత చాలా మంది జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. కొందరు మాత్రమే తమ మిగతా జీవితం సమాజానికి ఉపయోగపడాలని భావిస్తారు. అలాంటి వారిలో రషీదా ఆదిల్‌ ఒకరు. ఈ రిటైర్డ్‌ టీచర్‌ వ్యర్థాలను పరిశీలనాత్మక కళాఖండాలుగా మారుస్తుంది. అంతేకాదు 20 ఏండ్లుగా కళ ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేస్తుంది. భావి పరిరక్షకులు, కళాకారుల తరాన్ని నిర్మించడానికి అప్‌సైక్లింగ్‌ను మార్గంగా ఎంచుకున్న ఆమె పరిచయం…
రషీదా అందరూ పనికి రావని పడేసే వస్తువులకు కొత్త జీవితాన్ని ఇవ్వగలమని బలంగా నమ్ముతుంది. 2021లో తన స్వస్థలమైన నాసిక్‌కు తిరిగి వెళ్లడానికి ముందు UAEలోని షార్జా ఇండియన్‌ స్కూల్‌లో ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ విభాగానికి నేతృత్వం వహించారు. ప్రస్తుతం దావూదీ బోహ్రా కమ్యూనిటీకి చెందిన దాతృత్వ విభాగం ప్రాజెక్ట్‌ రైజ్‌లో పాల్గొంటున్నారు.
Finding meaning in wasteప్రాజెక్ట్‌ రైజ్‌
విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, నీరు, పారిశుధ్యం, అలాగే పర్యావరణ పరిరక్షణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బలహీన జనాభాకు మద్దతు ఇవ్వడానికి ప్రాజెక్ట్‌ రైజ్‌ అంకిత భావంతో పని చేస్తుంది. దావూదీ బోహ్రాలు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలో నివసిస్తున్న సుమారు పదిలక్షల మంది సభ్యులతో కూడిన ముస్లిం సంఘం. ప్రాజెక్ట్‌ రైజ్‌లో భాగంగా రషీదా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుండి ప్రత్యేక అవసరాలు గల దాదాపు 150 మంది విద్యార్థులతో చేతులు కలిపి, ఉపయోగించిన 1,000 సీడీలను సేకరించారు. వాటి నుండి కోస్టర్‌లు, క్యాండిల్‌ హోల్డర్‌లను రూపొందించారు. ఇటీవల జరుపుకున్న రంజాన్‌ పండుగలో దావూదీ బోహ్రా కమ్యూనిటీ సభ్యులకు వీటిని బహుమతిగా ఇచ్చారు.
పర్యావరణ సుస్థిరతకై…
‘మేము నాసిక్‌లో మా ‘ప్రాజెక్ట్‌ రైజ్‌’ బ్యానర్‌లో ‘ప్రాజెక్ట్‌ రైజ్‌’ పేరుతో మా ‘బెస్ట్‌ అవుట్‌ ఆఫ్‌ వేస్ట్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించాము. పేద ప్రజలకు సేవ చేస్తూ పర్యావరణ సుస్థిరతను పెంపొందించగలుగుతున్నాం. ఈ ప్రాజెక్ట్‌ చిన్న అడుగులు ఎలా గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయనే విషయాన్ని ఈ ప్రాజెక్ట్‌ నిరూపిస్తుంది. నాసిక్‌లోని ప్రాజెక్ట్‌ రైజ్‌ 30 ఏండ్లకు పైగా ఉన్న పర్యావరణ సంస్థ బుర్హానీ ఫౌండేషన్‌లో భాగంగా, రీసైక్లింగ్‌, అప్‌సైక్లింగ్‌, జీరో-వేస్ట్‌, స్థిరమైన జీవనశైలిని నడిపించడంలో సభ్యులకు శిక్షణ ఇవ్వడానికి అనేక విద్యా కార్యక్రమాలు, సెమినార్‌లు నిర్వహిస్తుంది. రషీదా బెన్‌(రషీదా చెల్లె) ఈ విజన్‌లో ముఖ్యమైన నాయకురాలు’ అని ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ అమ్మర్‌ మియాజీ చెప్పారు.
విభిన్న కార్యక్రమాలు…
పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులతో పాటు, ప్రాజెక్ట్‌ రైజ్‌ యావత్మాల్‌లో ఐదు గ్రామాలకు మద్దతుగా నిలబడింది. వారికి అవసరమైన స్థిరమైన నీటి భద్రత ప్రాజెక్టును కూడా చేపట్టింది. నందుర్‌బార్‌, గోవండి, రోహా, స్థానిక కమ్యూనిటీలతో కూడా కలిసి పని చేస్తుంది. వారి కనీస అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తుంది. మహారాష్ట్రలోని కర్జాత్‌, పన్వెల్‌, పిల్లలకు అలాగే కుటుంబాలకు పోషణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, తాగునీటిలో నిరంతర సహాయాన్ని అందిస్తోంది. ఇలా విభిన్నమైన కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. పేద ముస్లింలకు అండగా నిలబడుతుంది.
వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు…
ఎన్నో ఏండ్లుగా తాను చేస్తున్న ఈ అస్‌సైక్లింగ్‌ను 2009 నుండి తన విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాలలో ఆవిష్కరణ, కళను కనుగొనడంలో శిక్షణ ఇవ్వాలని రషీదా నిర్ణయించుకున్నారు. ‘మా తొలి ప్రాజెక్ట్‌లలో UAE జెండా ఉంది. విద్యార్థులు, నేనూ కలిసి 65,000 బటన్‌లను రూపొందించాము. పాఠశాల పాఠ్యాంశాల్లో భాగంగా వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అంశాలను పొందుపరచడానికి మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఒప్పించగలిగాం’ అని రషీదా చెప్పారు. ఖాళీ సోడా సీసాలు, వాటి క్యాప్‌లు, సీడీలు, పేపర్‌ ప్లేట్లు, స్పాంజ్‌లు, డిస్పోజబుల్‌ స్పూన్లు, బయోడిగ్రేడబుల్‌ కాని ఉత్పత్తులను క్రాఫ్ట్‌ ముక్కలుగా ఎలా తయారు చేయాలో ఆమె తన విద్యార్థులకు నేర్పారు.
సృష్టించే ఉత్సాహం
శిక్షణలో భాగంగా విద్యార్థులు వారి ఇళ్లు, పరిసరాల నుండి 5,000 గాజు సీసాలను సేకరించారు. వాటితో ప్లాంటర్లగా తయారు చేసి పెయింట్‌ చేసి ప్రజలకు, పోలీసు అధికారులకు మొక్కలతో పంపిణీ చేశారు. ‘ఈ ప్రాజెక్ట్‌లకు తరచుగా నెలల సమయం పడుతుంది. వ్యర్థ పదార్థాలను సేకరించడం నుండి ఆలోచించి కొత్త వస్తులను సృష్టించేందుకు సమయం కావాలి. విద్యార్థులను ముందుకు నడిపించేది ఏమిటంటే ఇప్పటివరకు వారి క్రియాత్మక విలువ కోసం మాత్రమే వీక్షించిన వాటి నుండి కొత్త, ఊహించలేని వాటిని సృష్టించే ఉత్సాహం. ఈ ఉత్సాహం వారిలోని సృజనాత్మ ప్రయోగాలకు దారి తీస్తుంది’ అని రషీదా చెప్పారు.
ప్రముఖులకు బహుమతిగా…
ఆమె ఇతర ప్రాజెక్ట్‌లలో కూడా పని చేస్తున్నారు. దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 5,000 రీసైకిల్‌ బటన్‌లను ఉపయోగించి మహాత్మా గాంధీ చిత్రపటాన్ని రూపొందించారు. దీనిని అప్పటి భారత కాన్సుల్‌ జనరల్‌ అమన్‌ పూరికి బహుమతిగా అందించారు. పోర్ట్రెయిట్‌లో ఉపయోగించిన బటన్‌లను ఆమె విద్యార్థులు అందించారు. 10,000 బాటిళ్లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వ్యవస్థాపకుడు షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ చిత్రంగా ఆమె రూపొందించారు.
విశేషమైన స్పందన
విస్మరించిన వస్తువులలో నేను ఎప్పుడూ కొత్త జీవితాన్ని చూశాను. నాకు ఊహతెలిసినప్పటి నుండి ఐస్‌క్రీమ్‌ స్పూన్ల మొదలు గాజుసామాను వరకు అన్నిం టినీ సృజనాత్మకంగా లేదా ప్రయోజనం కోసం ఉపయోగిస్తు న్నాను. నేను ఈ ప్రాజెక్ట్‌లలో విద్యార్థులను చేర్చడం ప్రారం భించినప్పుడు వారి శక్తి, ఉత్సాహం, వారు ఈ ఉత్పత్తులతో వెళ్లిన ప్రతిచోటా విశేషమైన స్పందన రావడాన్ని నేను చూశాను. వృద్ధాశ్రమాలతో పాటు కమ్యూనిటీ సభ్యుల్లో కూడా వీటిని ఎంతో ఇష్టపడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఓ అంటువ్యాధిలా ఈ కళ అందరినీ తాకుతుంది. పర్యావరణానికి మేలు చేసే నా వ్యాధి ఎంతో మంది వద్దకు విస్తరించడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ రషీదా బిగ్గరగా నవ్వేశారు.

Spread the love