కొబ్బరి నీళ్ళు ఎప్పుడెప్పుడు తాగొచ్చో తెలుసా?

 కాలంలోనైనా కొబ్బరి నీళ్ళు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అని వైద్యులు సూచిస్తుంటారు. వేసవి వచ్చిందంటే కచ్చితంగా తీసుకోవాల్సిన పానీయాల్లో కొబ్బరి నీళ్లు ఒకటి. కొబ్బరి నీటిని అద్భుత పానీయంగా చెబుతారు పోషకాహార నిపుణులు. ఎన్నో వ్యాధులకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకొనే శక్తిని అందిస్తుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎంత తాగినా బరువు పెరగరు. అలాగే శరీరానికి అవసరమైన సహజ ఎంజైములు వీటిలో పుష్కలంగా ఉంటాయి. పొటాషియం వంటి ఖనిజాలు కలిగి ఉంటాయి. కాబట్టి కొబ్బరి నీళ్లను తాగడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే మాంగనీస్‌, విటమిన్‌ సి, క్యాల్షియం, ఫైబర్‌ వంటి అవసరమైన పోషకాలు కొబ్బరి నీళ్లలో అధికంగా ఉంటాయి. అందుకే వేసవి వచ్చిందంటే ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. అయితే రోజులో ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగితే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందామా…!

వ్యాయామానికి ముందు…
వ్యాయామం చేయడానికి ముందు కొబ్బరి నీళ్లు తాగి వెళితే మంచిది. ఇది డీహైడ్రేషన్‌ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే శక్తిని అందిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత కూడా ప్రోటీన్‌ షేక్‌ వంటివి తాగే బదులు ఎలక్ట్రోలైట్స్‌ నిండిన కొబ్బరినీళ్ళను తాగడం చాలా మంచిది. ఇది అలసటను దూరం చేస్తుంది. సత్వర శక్తిని అందిస్తుంది.
భోజనానికి ముందు..
భోజనానికి ముందు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లను తాగితే, ఆహారం అధికంగా తినలేరు. కాబట్టి బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. త్వరగా బరువు తగ్గాలి అనుకునేవారు ఈ చిట్కాలు పాటించడం అలవాటు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్‌ బ్యాలెన్స్‌ చేయడంలోనూ కొబ్బరినీళ్లు ముందుంటాయి. రక్తపోటు పెరగకుండా ఇవి అడ్డుకుంటాయి.
నిద్రపోయే ముందు..
మానసిక సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మానసిక ఒత్తిడి రాకుండా కాపాడుతుంది. ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుంది. హార్ట్‌ రేటు పెరగకుండా అడ్డుకుంటుంది. ఒత్తిడితో పోరాడటానికి కొబ్బరి నీళ్లు దోహదం చేస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచి నిద్ర సరిగా పట్టేలా చేస్తాయి. కొబ్బరినీరు తాగడం వల్ల మూత్ర నాళాలు శుభ్రపడతాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.
కొంతమందికి రాత్రిపూట ఆల్కహాల్‌ అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల శరీరం ఎక్కువగా డీ హైడ్రేట్‌ అవుతుంటుంది. తలనొప్పి, వికారం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటివి ఏర్పడకుండా ఉండాలంటే ఉదయం సమయంలో కొబ్బరినీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే సరి.
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందడంతో పాటు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు కూడానూ.

Spread the love