అతడు అనితరుడే

అతడు అనితరుడే”శ్రీ శ్రీ కవితారాధనలో మాగి, మార్క్సిస్టు భావావేశంతో సాగి, అలుపెరుగని అధ్యయనం, అద్వితీయమైన అవగాహన, అమోఘమైన లోకానుభవ సారాన్ని అక్షరాలుగా ఆవిష్కరించిన కవి మువ్వా శ్రీనివాసరావు. ప్రగతిశీల భావావేశం మానవీయతకు మకుటాయమానంగా ఓ తాత్త్విక దృక్పథంతో కాలం కదిపిన కవి క్రాంతి శ్రీనివాసరావు” అని తేల్చి చెప్పారు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. వ్యక్తిగతంగా మువ్వా గారితో పరిచయం ఉన్న వారెవరూ కాదనలేని వాస్తవం ఇది. అదే విషయాన్ని చెబుతూ
డా|| రాధేయ ”మార్క్సిజం వెలుగులో సమాజాన్ని చూడటం నేర్చుకున్న కవిగా, వర్తమాన కవిత్వ లాంతరు”గా పేర్కొన్నారు.

”రెండు విసుర్రాళ్ళ మధ్య
పెసర గింజల్లా పగిలిపోతుంటాం
విధిలేక కిందరాయి పక్కనే వొరిగిపోతుంటాం
కాదంటే పిండి పిండిగా రాలిపోతుంటాం” అని మధ్యతరగతి జీవితాల గురించి రాయగలగాలంటే అది మార్క్సిస్టు దక్కోణంతో చూసి అర్థం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. కనుకనే పై పంక్తులను ఈ గ్రంథంలో ఎక్కువ మంది ఉటంకించారు.
మువ్వా శ్రీనివాసరావు నిజంగా అనితరుడు. తెలుగు సాహిత్య చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆధునిక వచన కవి కవిత్వంపై ఇన్ని వ్యాసాలు రాయలేదు. మువ్వా శ్రీనివాసరావు కవిత్వాన్ని 366 మంది 366 కోణాల్లో విశ్లేషించారు. అసాధ్యమైన బహద్‌వ్యాస సంకలనాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా క్రాంతి శ్రీనివాసరావు అనితరుడే.

వజ్రాయుధం కవి డా.ఆవంత్స సోమసుందర్‌కు అంకితం ఇచ్చిన ఈ గ్రంథంలో జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత సినారె, తన గురువు పూర్ణచంద్రరావుల అక్షరాశ్వీరదాలతో ప్రారంభమై ఎందరో ప్రముఖ సాహితీవేత్తలు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, నవయువకులు తమ విశ్లేషణలతో మువ్వా శ్రీనివాసరావు అంతరంగాన్ని పట్టి చూపారు.
ఈ గ్రంథాన్ని ఒక కవితాంతరంగ విశ్లేషణలుగా చూడటం ఒక అంశం. దాదాపు తెలుగు నేలంతా ఒక మూడు, నాలుగు నెలలపాటు మువ్వా సాహిత్యాన్ని చదివి అవపోసన పట్టింది. ఆ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ఒక పరంపరగా వ్యాసాలు వెలుగులోకి వచ్చాయి. ఇంత వరకు చూస్తే ఇది కేవలం మువ్వా శ్రీనివాసరావు వ్యక్తిగత ఇమేజ్‌ పెంచేదిగానే కనబడుతుంది.
అంతర్లీనంగా ఉన్న మరో అంశాన్ని గురించి ఆలోచిస్తే ఈ గ్రంథం ఆయనకు ఎంత ఉపయోగపడిందో కొత్త విమర్శకులు తయారు కావడానికి అంతే ఉపయోగపడింది. అధ్యయనానుభవం … సజనానుభవం.. పరిశీలనానుభవం… పరిశోధనానుభవం గల సాహితీవేత్తల మొదలు కొత్తగా రాస్తున్న వారు సైతం చక్కని విశ్లేషణ చేశారు. అలా 366 మంది సాహిత్య విమర్శా వ్యాసాలతో తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించింది. కాబట్టి ఇది ‘unorganized critic’s workshop’. ఎందుకంటే అనితరుడులో విశ్లేషణలు రాసిన 366 మందిలోనూ వీరికి ప్రత్యక్ష పరిచయం ఉన్న వారు కొద్దిమందే ఉండి ఉంటారు. కానీ, ”కవిత్వం ద్వారా ఆ కవిని దర్శించ గలగాలి” అన్నట్టు వారంతా సమాంతర ఛాయల్లో, సిక్స్త్‌ ఎలిమెంట్‌ లోనో, వాక్యాంతంలోనో, వైరాయణంలోనో ఈ కవి కవితాత్మను దర్శించారు. అందుకే మువ్వా కవిత్వాన్ని వందకు మిక్కిలి కోణాల్లో విశ్లేషించారు. ప్రతి విమర్శకుడి దగ్గరా, ప్రతి గ్రంథాలయంలోనూ ఉండాల్సిన గ్రంథం అనితరుడు.
మహాకవి శ్రీశ్రీ కవిత్వాన్ని అమితంగా ఆరాధించే శ్రీనివాసరావు ఆయన శతజయంతి సందర్భంగా మార్క్సిజం అజేయమని గొంతు విప్పాడు. శ్రీశ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించటంతోపాటుగా తనను తాను సాహిత్య రంగంలో ప్రతిష్ఠించుకున్నాడు. అన్ని వాదాలను, ధోరణులను, దృక్పథాలను సమన్వయ పరచడం అవసరమని భావించాడు. కనుకనే శ్రీశ్రీ విగ్రహ స్థాపనకు ముందు ఖమ్మం జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాలలో శ్రీశ్రీ సాహిత్య సభలను విద్యార్థులతో నిర్వహించాడు. వేలాదిమంది విద్యార్ధులు సభలో భాగమయ్యేట్లు చేశాడు. సభల నిర్వహణకు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన సాహితీమూర్తులను ఆహ్వానించి, వాటిని దిగ్విజయంగా జరిపాడు. అనేకమందిని కలిశాడు, అనేకమందితో తానూ కలిసిపోయాడు. నిత్యం చలనంలో ఉండాలన్న గతితార్కిక సూత్రాన్ని తనకే కాదు.. తన కవిత్వానికి అన్వయించాడు. కాబట్టే తాను పుస్తకాలు వేసి ఊరుకోకుండా వాటిని పాఠకుల దగ్గరకు చేర్చేందుకు విభిన్నంగా ప్రయత్నించాడు. అంతే కాదు తల్లిదండ్రులైన మువ్వా పద్మావతి రంగయ్యల పేరిట ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి సాహితీ మూర్తులకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తున్నాడు. అంతే కాదు గతేడాది నుంచి తాను అమితంగా ఇష్టపడే ఆవంత్స సోమసుందర్‌ పేర కూడా పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు.
సాక్షాత్తూ అభ్యుదయ సాహిత్య ఉద్యమ రథసారధుల్లో ఒకరైన డాక్టర్‌ ఆవంత్స సోమసుందర్‌ సమాంతర ఛాయలు, సిక్స్త్‌ ఎలిమెంట్‌ చదివి ముగ్ధుడై ‘కవితా విపంచి – క్రాంతి గీతాలు’ శీర్షికతో ఒక విమర్శా గ్రంథాన్ని అందించారంటే సామాన్యమైన విషయం కాదు. ‘భ్రమల్లేని భావుకుడు’ శీర్షికలతో సౌభాగ్య, ‘దశ్యం ఏ 576 మెగా పిక్సల్‌’ శీర్షికతో కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ‘అదృశ్య రూపగ్రాహి’ శీర్షికతో పులికొండ సుబ్బాచారి విమర్శా గ్రంథాలు రాశారంటే వారికేదో ఊబుసుపోక చేసిన పని కాదు. మంచి కవిత్వం వచ్చినప్పుడు అది విమర్శకులకు పని పెడుతుంది.
మువ్వా సమాంతర ఛాయలు కవితలను కొడవటిగంటి కుటుంబరావుగారి కుమార్తె, ప్రముఖ అనువాదకురాలు ఆర్‌. శాంతసుందరి ‘సమాంతర్‌ ఛాయే’ శీర్షికతో హిందీలోకి అనువదించారు. రామతీర్థ ఆంగ్లంలోకి, ప్రొఫెసర్‌ సత్యవాణి తమిళంలోకి అనువదించారు. లక్కూర్‌ ఆనంద సమాంతర ఛాయలు, సిక్స్త్‌ ఎలిమెంట్లను కన్నడంలోకి తర్జుమా చేశారు.
కవిగా, ఒక బాధ్యత ఎరిగిన బుద్దిజీవిగా సమకాలీన ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా సాంస్కృతిక రంగంలో పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ఈ కవిలో ‘చిమ్నీలేని దీపపు వెలుగులు కనిపిస్తాయి. పేదరికాన్ని, దారిధ్రాన్ని చూపబోతాయి. ఈ కవి నేల పడవ మీద నడిచే బతుకులను చూపడం కోసం ప్రయత్నిస్తాడు. ఈ కవి ఎదురుచూపు తూర్పు వెలుతురు కోసం, అదొక ఎడతెగని నిరీక్షణ. కాల యవనిక నిండా ఇతనికి కన్నీటి మరకలు కనిపించాయి. ఆ మరకలను కడిగేందుకు ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతాడు.
ఇతని కవిత్వంలో గాలి కుంచె అవుతుంది. రవి రంగులేసే కుర్రాడవుతాడు. వెలుగు చీకట్లను కలిపి కుట్టే సంధ్యలు వీరి కవితలు అంటారు కవి, విమర్శలు ఆర్‌. సీతారాం.
నిజమే కదా కర్ఫ్యూ నీడలో రాజ్యహింసకు బలైన ఎందరో మహాయోధులను నిర్మించుకుంటూనే, తన నాయనమ్మ, అమ్మమ్మల జ్ఞాపకాల నేమరివేతలను, భార్యాభర్తల మధ్య పోటీలో ఎప్పుడూ ఓడిపోయిన వారే గెలుపు ఆనందాన్ని పొందుతారని తీర్మానం చేస్తూనే సమాజంలోని అనేక రుగ్మతలను తన కవిత్వంతో ఎత్తి చూపుతారు. అందుకే ఆయన కవిత్వం చేయని అంశం లేదంటే అతిశయోక్తి కాదు.
ఒక సమస్యను లేదా అంశాన్ని మార్క్సిస్టు దృక్కోణంతో ఎలా చూడవచ్చో అర్థం చేసుకోవాలంటే మువ్వా శ్రీనివాసరావు కవిత్వం కచ్చితంగా చదవాల్సిందే. అదే విషయాన్ని విశ్వవిద్యాలయ ఆచార్యులు తెలిపారు. వారి మార్గనిర్దేశనంలో పరిశోధనలు చేస్తున్న పరిశోధనలు అదే నిర్దారించారు. అందుకే ”మువ్వా కవిత్వం – సమకాలీన సాహిత్య మేనిఫెస్టో” అన్న డా||మాటూరి శ్రీనివాస్‌ చెప్పిన విషయం అక్షరసత్యం.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417 

Spread the love