గానుగ యంత్రం

గానుగ యంత్రంగానుగ యంత్రం గార గరలాడుతూ పని చేస్తుంది
ఎద్దు దాని వెనకాలే క్రమం తప్పకుండా స్థిరంగా నడుస్తుంది
గుండ్రంగా నెలలూ ఏడాదులూ లెక్కించకుండా
జీవితకాల ప్రయాణాన్ని కొనసాగిస్తుంది
మెడలో గంటలు గణగణ మంటాయి
కంభాన్ని లాగుతూ విత్తనాల్ని నలగ్గొట్టుతూ నూనె తీస్తుంది
కొరడా ని గట్టిగా ఝలిపించినప్పుడు
దేహం గాయాల పాలవుతుంది, కాంతి రెప్పలు మూతబడతాయి
మెదడు మొద్దుబారిపోతుంది
అయినా అది అన్ని కాలాల్లోనూ నడుస్తుంది
వేగాన్ని పెంచమంటూ చిన్నాపెద్దా
తిట్టే తిట్లను భరించడం తప్ప
నిస్సహాయ చట్రానికి బంధీ అయిన దానికి వేరే దారి లేదు
వెలకొద్ది మైళ్ళు నడుస్తుంది అయినా వున్నచోటే వుంటుంది
వ్యాపారి నూనెను అంగట్లో అమ్ముకుంటాడు
ఎద్దుకు ఆ వ్యవహారంలో ఎలాంటి పాత్రా లేదు
ఒకరు రాత్రీ పగలూ కష్టపడితే మరొకరు ఆనందం పొందుతాడు
ఒకరు చెమటోడిస్తే మరొకడు లబ్ది పొందుతాడు
అంతే కదా, ఒకరిది దు:ఖమయితే నూనె మరొకరిది
ఈ ప్రపంచమే ఒక గానుగ యంత్రం
అది అట్లాగే నడుస్తుంది
మనిషిని ఎద్దులా మార్చేసి మట్టి పొరల్లో కొర్చేశారు
ఆంగ్లానువాదం: కేహ్రీ సింగ్‌ మధుకర్‌ (డోగ్రీ కవిత)
తెలుగు: వారాల ఆనంద్‌

Spread the love