ఆలీబాబా అనేక దొంగలు – దేశరాజు కథలు

ఆలీబాబా అనేక దొంగలు - దేశరాజు కథలుకథలు ఊహాజనీకం అంటారు కానీ ఈ కథలు ఊహ కాదు నిజం. సమాజాన్ని ప్రశ్నిస్తున్నట్టు, సమాజంలో ఉంటూనే ఎటు పోతున్నావ్‌? ఒక్కసారి చూసుకో అని చెబుతూనే పక్కదారి పట్టకుండా, వేలు పట్టుకుని నడిపే కథలు. మనకు పాఠాలు నేర్పిన గురువులను ఎంత మంది గుర్తు పెట్టుకున్నాం? ఎంత మంది వారిని గౌరవించుకున్నాం? ఎన్ని మంచి మాటలు చెప్పి ఉంటారు? వాటిని ఎంత మంది పాటించాం? ఇలా ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో? దేశరాజు గారు రాసిన కథల గురించి ఇప్పుడు చూద్దాం.
ఇందులోని పదమూడు కథల పెద్దల మాట కూడా పదమూడు భావోద్వేగాలంటే భలే ఉంటుందేమో! చిన్న పిల్లలకు మంచి మార్గనిర్దేశం. కానీ ఈ కాలం పిల్లలది దుందుడుకు వైఖరి, ఒక్క పట్టాన ఏదీ ఒప్పుకోరు?
‘కుదుపు’ కథలో అందరూ అందరి పిల్లలకు అన్ని ఇస్తున్నారు కానీ మనమే మన పిల్లలకు ఏదీ ఇవ్వడం లేదు? అని బాధపడే తల్లిదండ్రుల కథ. పిల్లలకు సెల్‌ ఫోన్స్‌ ఇస్తే ఏం జరుగుతుందో? కళ్ళకి కట్టినట్టు చూపిన కథ. జీవితం సెట్‌ కావాలంటే ఏదో ఒక ”కుదుపు” రావాలని చెప్పిన కథ. కళ్ళ ద్వారా అక్షరాలను చదివి, మెదడు ద్వారా ఆలోచన రేకెత్తి, ఇది నిజమే కదా ఎంతలా మనం ఒక పనిలో కూరుకుపోయామో మనల్ని మనకే గుర్తు చేసిన కథ.
‘ఎయిర్‌ జామ్‌’ కథలో దేశానికి ఎప్పుడైనా కష్టం వస్తే ముందుండేది కమాండోలు. అలాంటి కమాండోలకు సవాలుగా మారిన ఒక హైజాక్‌ కథ ఇది. కానీ నాకనిపించింది ఏంటంటే? సమస్య వస్తే సిద్ధంగా ఎవరైనా ఉంటారు. కానీ ఆ సమస్య రాకముందే అప్రమత్తంగా ఎందుకు ఉండరో? అర్థం కాదు. కొంత మంది బిగ్‌ ఆఫీసర్స్‌ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ఆలోచించి కానీ తీసుకోరు. అలాంటి వారికి ఇక్కడ వచ్చిన సమస్యని ఎలా తిప్పికొట్టారు? అనేది చూస్తే ప్రతీ ఒక్కరు ఇంతటి ధైర్య సాహసాలతో ఉండాలని చెప్పిన కథ.
‘అంతా మీ కోసం’ లో బాగా చదువుకుని, మంచి జాబ్‌ చేస్తూ ఉన్న సమయంలో వచ్చిన ఆలోచన అతని జీవితాన్ని మార్చేసింది. దానికి తోడు తల్లిదండ్రుల అండ ఉండేసరికి ఇంకా రెచ్చిపోయాడు కానీ పెళ్లంటే మాత్రం చిన్న మెలిక పెట్టాడు. ఎన్ని సంబంధాలు చూపించినా వంకలు పెట్టాడు. చివరకు చేసేది లేక అతని కోరిక తల్లిదండ్రులు ఎలా తీర్చారు అనేది అస్సలు కథ. అదేంటి అనేది మీరు చదివే తెలుసుకోవాలి.
‘కాసేపు మనిషి’లో ఎత్తుకు ఎదగడానికి మనం ఎన్నో చేస్తుంటాం. మొదట్లో నీతి, నిజాయితీ అన్న మనమే, ఆ నీతి, నిజాయితీ ఎక్కడా కనపడకపోయేసరికి, మనం వెళ్లే దారి మార్చుకుని చేరాల్సిన చోటికి చేరుకుంటాం. అలా ఎన్నో అడ్డదారులు తొక్కి ఎదిగిన ఒక్కడి కథే ఈ కాసేపు మనిషి. మనం చేసిన తప్పుల నుండి ప్రాయశ్చిత్తము పొందే వాడి కథే ఇది. మన లోంచి మనం మళ్లీ మనిషిగా పుట్టిన క్షణం కొత్తగా ఉండే ఆలోచనలే ఈ కథ.
‘అవాంచితం’ : ఈ పరుగు లాంటి జీవితంలో పడి మనలోని భావోద్వేగాలను ఎప్పుడో మరచిపోయాం? అలా మర్చిపోయిన భర్తకి భార్య చెప్పే సమాధానమే ఈ కథ. అస్సలు భార్య చెప్పిన సమాధానం ఏంటి? దాని తర్వాత వచ్చిన ఆ పర్యవసానం ఏంటి? అనేది మిగిలిన కథ.
‘కవి దుర్భేద్య’లో ఎన్నో ఏళ్ల సుదీర్ఘ కాలం పని చేసి రిటైర్‌ అయిన తర్వాత, మన ఇంట్లో మన నాన్నకో, అమ్మకో దిక్కు తోచదు ఎందుకంటే? వారు అప్పటి దాకా గడిపిన జీవితం ఒకటి. రిటైర్‌ అయ్యాక గడిపే జీవితం మరొకటి. వారి జీవితం ఒక రొటీన్‌ కి ఫిక్స్‌ అయిపోయి ఉంటుంది. అన్నేళ్ల తర్వాత అంతా తీరిక దొరికేసరికి పక్కా వారిలో లోపాలు కనిపిస్తాయి. ఆ కనిపించిన లోపాలకి వీళ్ళు ప్రతిస్పందింస్తారు. ఇంకా ఎంత సేపు? లేచి టీ ఇవ్వు, లేచి టిఫిన్‌ చెయ్యి అయ్యి అని అక్కడ ఉన్న వాళ్ళను ఊపిరి సలపకుండా చేస్తారు. అలా మన ఇళ్లలో పెద్ద వారి కథే ఈ కవి దుర్భేద్య.
‘సహజాసహజం’లో మూడు తరాలు కలిసి జీవించే కథ. అమ్మమ్మ, అమ్మ, కూతురు. మనం సాగించే జీవితంలో మనుషులు తప్ప ఎవ్వరూ ఉండరు. ఒక పక్షి కానీ, జంతువు కానీ, వాటి జీవనం కానీ ఎలా ఉంటాయో? వాటితో సంబంధం లేని వారికి ఏమీ తెలియదు. అలా గడుస్తున్న జీవితాలలోకి అనుకోకుండా వచ్చిన ఒక సంఘటన వారి మనసులను దోచుకుంటుంది. కానీ అక్కడ వారికి వచ్చిన ఒక సమస్యకి వారి మనసులు ఎంత భావోద్వేగానికి ఎలా లోనయ్యాయి? అస్సలు ఆ కథేంటి తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.
‘ఆలీబాబా అనేక దొంగలు’ కథలో అస్సలు పుస్తకం కవర్‌ పేజీపై ఈ శీర్షిక ఎందుకు పెట్టారో? అప్పుడు అర్థం కాలేదు. కానీ కథ చదివిన తరువాత ఈ పుస్తకానికి ఈ పేరే సరైనది అని అర్థం అయ్యింది. ఎన్నో ఒడిదుడుకులు దాటి వచ్చిన తర్వాత సుఖవంతమైన జీవితం గడపాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. పక్క పక్కన ఉండే ఇరుగుపొరుగు వాళ్ళు కూడా అలానే కలిసిపోయారు. కానీ, కులం పెట్టిన చిచ్చు అప్పటిదాకా ఉన్న సంబంధాలను, వారి మధ్య ఉన్న ఆ సాన్నిహిత్యాన్ని అక్కడ జరిగిన ఒక్క సంఘటన వేరు చేసింది. ఏంటా సంఘటన? అని తెలుసుకోవాలంటే ఈ కథ తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
‘కథ తల్లి, కూతురు, మధ్యలో ఆమె’లో ప్రతీ ఇంట్లో ఆడపిల్ల కథ, ప్రతీ ఇంట్లో ఉండే అమ్మ కథ, ప్రతీ ఇంట్లో ఉండే అమ్మమ్మ కథ. కాస్త ఓపెన్‌ గా ఉన్నా కూడా ఇదే నిజం అని మనతో అనిపించే కథ. ఎంత సేపు ఉన్నా ఆడపిల్లలనే అనుకువగా ఉండమని చెప్తారు కానీ వారి కొడుకులు బయట చేసే చిల్లర పనులు వారి కంటికి అస్సలు కనిపించవు. అలా వారి ఇళ్లల్లో, బయట సమాజంలో వారు పోరాడి, పోరాడి విసిగి వేసారిన ప్రతీ అమ్మాయి కథే ఈ కథ.
‘బహురూపి’లో ప్రతీ ఒక్కరిలో వారికి తెలియకుండానే ఇంకో మనిషి దాగి ఉంటారు. ఎందుకంటే? వారికి ఉన్న సిగ్గు వల్ల కావచ్చు, వారిలో ఉన్న ఇంసెక్యూరిటీ వల్ల కావచ్చు, వారి కుటుంబం బాగోగుల వల్ల కావచ్చు, లోపలున్న మనిషిని ఎప్పటికి బయటకు రానీకుండా ఉన్న జీవితం అలా గడిపేస్తూ ఉంటారు. అలా తనలోని మనిషిని తనకు పరిచయం చేసే కథే ఈ బహురూపి.
చివరి కథ ‘రిక్షావోడు’ : రోడ్డు ఎలా ఉన్నా కూడా పిక్కలు అరిగేలా తిరగాల్సింది రిక్షావోడు మాత్రమే. వెళ్లే దారి రాళ్ళదారి అయినా, ఏటవాలుగా ఉన్నా బండిని రథం లాగినట్టు ఒక్కడే లాగాలి కానీ బండిలో ఉన్న వారు కిందకి దిగి సహాయం చేయరు. అలా కష్టపడే కడుపుకి మనం సహాయం చేయకపోతే వచ్చే కోపమే ఈ రిక్షావోడు.
ఇంకా ఇందులో చిలుక, అబద్దం కథలు ఉన్నాయి. ఈ కథలన్ని ఊహ నుండి పుట్టినవి కాదు మన పక్కింట్లో, మన ఇంట్లో, మన ఇల్లు ఉన్న సమాజం నుండి పుట్టి, మనల్ని ఆలోచింపజేసే కథలే కదిలి మన దగ్గరకు చేర్చారు దేశరాజు. తప్పకుండా చదవండి మనలో ఉన్న ఆలోచనలు కచ్చితంగా మనల్ని ప్రశ్నించి మళ్లీ మనల్ని మనమే కలుసుకోవడం గ్యారంటీ.

– ఆరుద్ర ఈశ్వర్‌

Spread the love