కవిత్వ విమర్శకు ఊహల వేదిక

Imagination is a platform for poetic criticismప్రస్తుతం సాహిత్యం మూడు రచనలు, ఆరు ఆవిష్కరణలతో దినదిన ప్రవర్ధమానమవుతూ రాశుల కొద్దీ సృష్టించబడుతున్నది. అందువలన నాణ్యమైన సాహిత్యాన్ని సమాజానికి అందించవలసిన అవసరం వున్నది. కవిత్వాన్ని లేదా మరో ప్రక్రియను విమర్శించే, సమీక్షించే వ్యక్తి సహృదయుడై, నిష్పక్షపాతిగా, రాగద్వేషాలకు అతీతుడయి వుండాలి. అలాంటి సహృదయ సమీక్షకులలో విమర్శకులలో డా|| ఏనుగు నరసింహారెడ్డి అగ్రాసనాధి పత్యం స్వీకరించగలిగిన వ్యక్తి.
కవిత్వాన్ని కథను కాకపోతే మరో ప్రక్రియను సమీక్షించే విమర్శించే వ్యక్తి తాము ఒక్కొక్కరు ఒక్కో దృక్పథం కలిగి వుంటారు. వారు ఒక్క రకంగా వస్తువు, శిల్పం, ప్రయోగం మొదలైన వాటికి అనుగుణమైన దృక్కోణంతో ఆవిష్కరిస్తారు.
డా|| ఏనుగు నరసింహారెడ్డి స్వతహాగా కవులు, విమర్శకులు, రచయిత కూడా కావడం వల్ల వారి విమర్శ/ కవిత్వం సమాజానికి ఒక దిశానిర్దేశం చేయగలదు.
ఎవరయినా ఒక విషయాన్ని చెప్పడానికి ఒక వేదిక కావాలి. ఏనుగు నరసింహారెడ్డి తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ‘ఊహలనే’ వేదికగా చేసుకున్నారు. అది ఊహల వేదిక పుస్తకంగా వెలువడింది.
ఊహల వేదికలో గత రెండు దశాబ్దాలలో వచ్చిన వివిధ వ్యాస సంకలనాలలోని కవి దృక్కోణంలో నుంచి చూసి అరవై రెండు మంది కవుల కవిత్వ బాగోగులను తనదైన శైలిలో పాఠకుల ముందుంచారు. వానిలో వివిధ ప్రక్రియలకు సంబంధించిన వ్యాసాలున్నాయి.
మయూఖ అంతర్జాల ద్వైమాసిక, కెనడా వేదిక సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ కవితల పోటీలలో ఎంపిక చేయబడిన కవితా సంకలనాన్ని సమీక్షిస్తూ నరసింహారెడ్డి ఒక మాట చెప్పారు… ”కవిత్వమంటే దేన్నీ ధిక్కరించడం కాదు, దేన్నీ ఆలింగనం చేసుకోవడం కాదు. బాధ్యతాయుతమైన జీవనం. హేతువు ఆధారమైన జీవనం. సత్యాన్వేషణం కూడా. ఈ సమాజపు గమనానికి ఇరుసేమిటని కవి ఆలోచిస్తాడు. దాని గమనంలోని అసంబద్ధతకు మూలం ఏమిటని శోధిస్తాడు. దాని ఫలితాలను తనదైన పద్ధతిలో ప్రకటిస్తాడు”.
ఆయన చెప్పిన ఈ మాటలను గమనిస్తే కవిత్వం అంటే ఏమిటి? కవిత్వం ఎందుకు రాయాలి? కవిత్వం ప్రయోజనం ఏమిటి? కవి రాసిన కవిత్వాన్ని పాఠకుడు ఎలా అర్ధం చేసుకోవాలి? అనే దృక్కోణంతో ఆ కవితా సంకలనంలోని కవితలను చదివారు.
”గొప్ప ప్రయోజనమున్న కవిత గొప్ప శిల్పంతో అలరారితే బంగారమునకు తావి అబ్బినట్లే” అన్న పింగళి లక్ష్మీకాంతం గారి అభిప్రాయానికి కూడా ఈ కవితలను ఉదాహరించారు. ఒక దగ్దజీవితాన్ని ”సిగరెట్‌ కాల్చి రెండు వేళ్లమధ్యలో బతుకును ఇరికించి నోట్లో పెట్టి నిప్పంటించుకునే వాడు/ కాలిన బ్రతుకును కాలి కిందేసి నలిపి కాలరెగరేసి/ కదిలిపోతుండేవాడు” ఈ మాటలలో ఒక జీవితాన్ని అపరూపంగా చిత్రీకరించారు అన్న వ్యాఖ్యానం చాలా బావుంది.
ఈ పుస్తకంలో శతక కవుల సాహిత్యాన్ని కూడా పరిశీలించారు. ఈ నాటి కవులలో శతకాలు రాస్తున్న కవులు తక్కువమందే వుంటారు. సమాజ గమనాన్ని నిరసిస్తూ, వ్యాఖ్యానిస్తూ చాలామంది శతకాలు రాశారు. కానీ రెడ్డి గారు వ్యాఖ్యానించిన శతకం కుంతీపుత్రుడైన కర్ణుని జీవిత చరిత్రను. శతకంగా రాయడం గొప్ప విషయం. శతక రచయిత ఎండెల నరసింహులు. అందులోని ఒక పద్యం కర్ణుని గురించి కృష్ణుడు చెప్పిన విషయం చాలా అందమైనదని రెడ్డిగారు అన్నారు కానీ అది వాస్తవ జీవిత చిత్రణ అని నేనంటాను. కర్ణుడి జీవితం మొత్తం ఈ కంద పద్యపాదాలలో నిక్షిప్తం చేశారు శతకకర్త నరసింహులు.
సురపతిచే విప్రునిచే/ ధరచే పృధచేత మద్రధరణీపతిచే/ నరుచేతను, హరుచేతను/ గరుచేతను, వంచితడవు కుంతీపుత్రా!
దీనికి మూలమైన పద్యంలో కర్ణుని చావుకు కారణాలుగా కృష్ణుడు, అర్జునుడు, కుంతి, పరశురాముడు, భూమి, శల్యుడు, ఇంద్రడు… ఈ ఆరుగురు చెప్పబడ్డారు. కాని ఈ పద్యంలో ‘హరుచేతను’ అని ఇంకో వ్యక్తిని కూడా చేర్చారు. పైగా వారిచేత వంచించబడ్డారు అన్నారు. కాని భారతంలో ఈ ఆరుగురూ స్పష్టంగా నీవు మరణిస్తావు అన్నారు. కాని ఏ విధంగానూ మోసం చేయలేదనుకుంటా. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం.
ప్రస్తుతం వస్తున్న లఘు ప్రక్రియలలో నూతన ప్రక్రియ ‘మక్తకం’ను సమగ్ర స్వతంత్ర భావ వ్యక్తీకరణకు లోటు లేకుండా సృష్టించిన కవి నూతక్కి రాఘవేంద్రరావు. ఈ ముక్తకం పదహారక్షరాల పద్యం. మొదటి రెండు పాదాలలో పదహారక్షరాలుంటే చివరన ఒక మకుటం లాంటిది మక్తాయింపు చేస్తారు. ”ప్లాస్టిక్‌ చైర్ల కూర్చుండ బోతి/ కుర్చీ వెనక్కి జరిగె/ గంతనే మూడు చక్రాల బండి/” ఒకటి రెండు లైన్లలో తను కుర్చీలో కూర్చోవడానికి ఉద్యుక్తుడైతే రెండవ వాటిలో కుర్చీ వెనక్కు జరుగుతుంటుంది. ఫలితమేమిటి? తను కిందపడిపోయి మూడు చక్రాల బండి పాలుకావడం. ఇంత చిన్న కవిత్వంలో ఒక సంఘటన పూర్తిగా వ్యక్తీకరించబడింది. అదే దీని ప్రత్యేకత.
నక్క హరికృష్ణ కవిత్వం ‘అవిరామం’ అందులోని ఒక కవిత చాలా హృద్యంగా వుంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులలో హరికృష్ణగారొకరు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆనందంతో రాసిన ఒక కవితలో కింది పంక్తులు…
ఇది పాల్కురికి పాదపీఠిక/ పోతన సేద్య భూమిక/ విశ్వంభరుడి నాట్యవేదిక/ ఇది తెలివాహ సొబగుల/ వైతాళికుల భూమి
ఈ పద్యం చదివిన తర్వాత హరికృష్ణ కవిత్వం మరీమరీ చదవాలనిపిస్తుంది.
సాధారణంగా ఒక రచయిత ఒక కథ రాస్తే తక్కువలో తక్కువ నిడివి ఒక పేజీ. ఒక కార్డు పట్టేంత వుంటుంది. వీటిని మినీ కథలు అంటున్నారు. ఒకప్పుడు కుందుర్తి వచనంలో కావ్యం, నాటకం మొదలైన అన్నిటనీ రాసి ఖ్యాతి గడించినవారు. ఆయన ప్రేరణతో ఒక అవార్డు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం కె.ప్రభాకర్‌ కూడా అలాంటి ఒరవడి సాగిస్తూ కేవలం పదహారు లైన్లలో కథ చెప్పారు. వీటిని కథాకవితలు అనవచ్చు అంటారు నరసింహారెడ్డి.
ఒక కథ ‘అతడిపేరు ధర్మయ్య’. ధర్మయ్య బిచ్చగాడు. శోషవచ్చి ఒక చెట్టు పక్కన పడిపోవడంతో అతని చేతిలోని డొక్కు డబ్బాలోని గుక్కెడు నీళ్లు అతడు మరణించాక దొర్లి చెట్టుపై పడతాయి. ఎండి చనిపోయిన చెట్టు ఆ నీళ్లతో జీవం పోసుకుంటుంది. మరసటి రోజు ఆ మొక్క కొసన వికసించిన పువ్వు చిరునవ్వుతో అందంట ‘అతని పేరు ధర్మయ్య’ అని. ఎంత చక్కగా భావ వ్యక్తీకరించేడు ప్రభాకర్‌.
శ్రీశ్రీలోని లయాత్మక శబ్దాన్ని అందుకున్న కవి. ఆ బాటలో రాసిన కవిత. శ్రీశ్రీ కన్నా చక్కగా రాశాడనిపిస్తుంది.
”కష్టాల కడలిని/ ఇష్టాల కూడలిని/ కన్నీటి కడవను/ పన్నీటి పడవను/ చెరగని నవ్వును/ చెదరని మువ్వను/ తలపులమైనాను/ వలపులసోనాను/ పచ్చని చానను/ వెచ్చని దానను” – సంసార నౌక.
ఇంకా ఈ వ్యాస పరంపరలో రెబ్బ మల్లికార్జున్‌, మువ్వా శ్రీనివాసరావు మొదలైన వారి కవిత్వాన్ని గురించి విస్తృతమైన విశ్లేషణ వున్నది. వీరే కాక లబ్ద ప్రతిష్టులయిన సినారె, జాషువా, ఆత్రేయ మొదలైన వారి కవితలపైనా వ్యాఖ్యానం కూడా వున్నది. ప్రస్తుతం నూతనంగా కవిత్వ వ్యవసాయం చేస్తున్న వారి రచనల మీద కూడా సాధికారికమయిన విశ్లేషణలు వున్నాయి. అవన్నీ చదివి అవగాహన చేసుకోవాలి, ఈ షణ్మాత్రంగా చెప్పడం కుదరదు.
కవి విమర్శకుడు, వ్యాఖ్యాత, సమర్వయకర్త ఈ అన్ని భూమికలు నిర్వహిస్తున్న నరసింహారెడ్డిగారు మరిన్ని విమర్శనా గ్రంథాలు వెలువరించాలని ఆశిద్దాం.
తాటికొండాల నర్సింహారావు
9885787250

Spread the love