“Behind every smiling face,
there is an untold story of Sabr”
”ప్రతి చిరునవ్వు వెనుక సహనం గురించిన ఒక కథ కచ్చితంగా ఉంటుంది” అని చెప్తుంది ఇస్లాం.
శాంతి, సహనం, గౌరవం, క్రమశిక్షణ, వినయం… ఇవన్నీ ఇస్లాం దేహంలోని అంగాలు. ప్రతి ముసల్మాన్ ఇంటిలో తల్లిదండ్రులు శిక్షణ ఇచ్చేది ఇటువంటి అంశాలపైనే.
కాలప్రవాహంలో వయసు తెచ్చే మార్పులు ఎన్నో. కొన్నిసార్లు పండగ వస్తుందంటే వంటింటికే అతుక్కుపోయే ఆడవాళ్ళకు ఎక్కడలేని భయం పట్టుకుంటుంది. అదేమిటో చిత్రంగా రంజాన్ మాసం ప్రారంభం అవుతుందంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం పొంగుకొస్తుంది. అర్ధరాత్రి లేచి మరీ తమ ఇంటిల్లిపాదికి వొక్కపొద్దుల కోసం వంటలు చేయడం ప్రారంభిస్తారు. రంజాన్ మాసంలోనే మిగతా అన్ని రోజులకన్నా పని అధికంగా ఉంటుంది. అంతటి అలసటలోనే వొక్కపొద్దులనూ కొనసాగిస్తారు. అయినా ముఖాలపై చిరునవ్వు చెదరనీయరు ఆడవాళ్ళు. ఇఫ్తార్ వేళల్లోనూ అంతే.
ముప్ఫై రోజులపాటు సహరీ, ఇఫ్తార్‌లు ఒకరికొకరు పంపుకుంటూ, పంచుకుంటూ తినడంలో పొందే తాదాత్మ్యత మాటలకు అందనిది. పైగా ఏ పని చేస్తున్నా నిత్యం దైవ నామస్మరణలోనే గడుపుతుంటే మరే విషయాలూ వారికి పట్టవు. రంజాన్ మాసం ప్రారంభ నెలవంకతోనే హడావుడి ప్రారంభమవుతుంది.
నాకూ బాల్యం నుంచి రంజాన్ అంటే సంతోషాల నిధి. ప్రేమలు పంచే పెన్నిధి. చాంద్ ముబారక్ చెబుతున్నప్పుడే ఓ ఆధ్యాత్మిక పరవశం మనసులో చొరబడుతుంది.
ఇటువంటి మాసంలో ఇల్లూ, ఉద్యోగం చూసుకుంటూ వేళ తప్పకుండా అయిదు పూటలా ప్రార్థనలు చేసుకుంటూనే ప్రతిరోజూ ఒక కవిత రాశారు అఫ్సర్. ఒక్కపొద్దు పద్యాలు వారి వాల్‌లో చూడగానే ప్రతిరోజూ ఒక పద్యం వస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ ఇన్ని బాధ్యతల మధ్య పద్యంకోసం సమయం వెచ్చించగలరా అనే ప్రశ్న కూడా ఉదయించింది. గలరు అని నిరూపిస్తూ ముప్ఫై పద్యాల గుచ్ఛం ఇప్పుడు సిద్ధమైపోయింది. ఏ ఒక్క రోజూ నిరాశ పరచకుండా ప్రతిరోజూ ఒక పద్యం పాఠకులకు బహుమానంగా లభించిందనిపించింది. పైగా అంతే వేగంగా శ్రీనివాస్ గౌడ్ తెలుగులోకి అనువదించి పుస్తకాన్ని రూపొందించడం మరింత సంతోషాన్ని కలిగించింది.
కవితల విషయానికి వస్తే…
ఒక్కపొద్దుల రోజుల్లో దయ, ప్రేమ, కరుణలతో హదయాన్ని నింపుకుని తోటివారితోనూ అలాగే మెలగాలని అంటారు. దుఃఖ ఛాయలు కానీ, అల్లరితో కూడిన ఆటపట్టింపులు ఉపవాసం ఉన్న వ్యక్తితో చేయకూడదు. వారు దైవధ్యానంలోనే గడపాలి. కొన్నేళ్ళుగా మనసులు భారమై బతుకీడుస్తున్న వర్గంలో ఉపవాసం అయితే సాధ్యమవుతుంది కానీ, గుండెల్లోని దిగులు ఎక్కడకు తుడుచుకుపోగలదు. నిర్మల హదయంతో అబద్ధాలు మాట్లాడకుండా పద్యాలు రాస్తున్నప్పుడు ఇలానే వస్తాయి. ఇలాగే రావాలి కూడా.
”ప్రతి రొట్టె ముక్కలోనూ/ గాజా కనిపిస్తున్న”ప్పుడు ఛిద్రపదచిత్రాలు తప్ప మరే పూలూ, పళ్ళపై కవితలు రావు. వీటిని రాజకీయ కవితలు అనడం కన్నా సమకాలీన దశ్య సమాహారం అనడమే సబబు. ఏ దేశాన్ని గమనించినా అనిశ్చితి. ఎక్కడ చూసినా మత్యు క్రీడలు. పునాదులతో సహా నేలమట్టమైన భవంతుల శిథిలాల్లో ఎన్నెన్ని శవాల గుట్టలు. ఇటువంటి సందర్భంలో ఆధ్యాత్మికంలోనూ ఆవేదన తొంగిచూస్తూనే ఉంటుంది. అందుకే ”చావు నుండి దాక్కుంటున్న పిల్లలు/ శిథిలాలలో ఒకరినొకరు వెతుక్కుంటారు” అని రాయగలిగారు. ప్రతి కవితా దుఃఖ పూరితమే. భూమండలంపై ఎన్ని దేశాలలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయో, ఎక్కడెక్కడైతే నిలవనీడ లేని ఆర్తనాదాలు వినిపిస్తున్నాయో… వాటన్నింటినీ ఈ ముప్ఫై పద్యాలు ప్రతిధ్వనిస్తున్నాయి.
అఫ్సర్ కవితలు చదువుతుంటే అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాం. వారి కవితల్లో ఒక సున్నితత్వం ఉంటుంది. సూఫీతత్వం దగద్ధాయమానంగా వెలుగులీనుతుంటుంది. అలాగని అవి ఏమీ నెమలీకల విసనకర్రలా సుతారంగా తాకి వెళ్ళేవి కాదు. పదాల కత్తులు గుండె లోపలి పొరలను ఒక్కటొక్కటిగా చీల్చుతాయి. ఛాతీపై కత్తుల వంతెన పేర్చుతాయి. చందమామలోని కాంతివంతమైన చల్లదనం, దానికి మరిన్ని సొబగులు అద్దేలా ప్రతీకలు. అంటే చందమామకు కిరీటాన్ని అలంకరించినట్లు. ఉర్దూలో చెప్పాలంటే చాంద్ కో తాజ్. అందుకే ఈ మాటలనే టైటిల్ గా ఎంచుకున్నాను.
పేరు చెప్పుకోవడానికే భయపడే పరిస్థితులు దాపురించిన వేళ. ఆహార్యం, భాష, తిండి ఎగతాళికి గురవుతున్న సందర్భాన్ని చూడండి ఒక్కపొద్దు పద్యంలోకి ఎలా ఒంపారో! ”నా ఆహార్యం, శరీరం, తిండి, భాషలను/ గురిపెడుతున్న ఎగతాళిని/ మరిచిపోయేంత చిన్నది కాదు” అంటూ తన జ్ఞాపకశక్తిని గురించి చెప్పుకున్నారు. అయితే దీనిని కేవలం జ్ఞాపకంగా మాత్రమే చూడగలమా? ఒక వర్గం ఎదుర్కొన్న చేదు అనుభవాలు, ఆ వర్గం గుండెకు జరిగిన గాయాలు, అవమానాలు తనతో ఈ మాటలు చెప్పించాయి. ప్రతీ పదం వెనుక మరిచిపోలేని ఓ చేదు సంఘటన.
ప్రతీ కవితను వారు ఎంత నిబద్ధతతో రాశారో, శ్రీనివాస్ గౌడ్ అంతే తదేకతతో ప్రతీ పద్యాన్ని అనువదించారు. ఇంగ్లీష్ కవితకు తెలుగు అనువాదం పూవుకు తావి అబ్బినంత చక్కగా అమరింది. వారిరువురికీ హదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ఒక్కపొద్దు పద్యాలు ప్రతిరోజూ ఒకటి దర్శనమిస్తూ బాల్యంలోని రంజాన్ సందడిని గుర్తు చేశాయి. ఈ పద్యాల గురించి మరెంతో రాయవచ్చు. చర్చించవచ్చు. కానీ, చిన్న పద్యాలను ఉటంకించుకుంటూ పోలేను. ఎందుకంటే పాఠకులుగా మీరు ఒక్కొక్క పద్యాన్ని చదివి పూర్తిగా ఆ భావుకతలో మునిగి తేలాలని కోరుకుంటున్నాను.
– నస్రీన్ ఖాన్
[email protected]