కాట ఆమ్రపాలి.. ఐఏఎస్‌ 2010 బ్యాచ్‌

– అతి చిన్నవయస్సులో ఐఏఎస్‌కు ఎంపికైన వారిలో ఆమ్రపాలీ ఒకరు
– ఆల్‌ ఇండియా 39వ ర్యాంక్‌
– కేంద్ర, రాష్ట్ర సర్విస్‌లల్లో కీలక పదవుల్లో ప్రశంసలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం బదిలీలు చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం జీవో విడుదల చేశారు. ఈ బదిలీల్లో ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించారు. ఇప్పటికే ఆమ్రపాలి జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, మూసీ రివర్‌ ఫ్రంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌,’హెచ్‌జీసీఎల్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌, హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ కమిషనర్‌గా కూడా ఉన్నారు. ఐఏఎస్‌ ఆఫీసర్‌ కాట ఆమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు నగర చివర్లోని ఎన్‌.అగ్రహారం. ప్రొఫెసర్‌ కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు మొదటి సంతానం. విశాఖలో ఉన్నత చదువులు చదివారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నోలజీ మద్రాస్‌ నుంచి ఇంజినీరింగ్‌లో పట్టాను అందుకున్నారు. బెంగుళూర్‌ నుంచి మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ పూర్తిచేసిన ఆమె, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో ఆల్‌ ఇండియా 39వ ర్యాంక్‌ను సాధించారు. ఐఏఎస్‌కు ఎంపికైన అతి చిన్నవయస్సులో అమ్రపాలీ ఒకరు. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్ర విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఉన్నప్పటికీ అమ్రపాలికి కీలక పోస్టులను ప్రభుత్వం అప్పగించింది. 2013లో వికారాబాద్‌ సబ్‌కలెక్టర్‌గా పనిచేసి, ఆ తరువాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్‌లో పనిచేశారు. 2015 జనవరి నుంచి ఆమె రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2016లో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆమెకు పదోన్నతి కల్పిస్తూ వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఆమ్రపాలి, కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యూటీషన్‌పై వెళ్లారు. కేంద్ర సర్వీసులో మొదట కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డికి ప్రయివేటు సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధాని డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందారు. 2020 సెప్టెంబర్‌లో ప్రధాని కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. అప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర సర్విస్‌లో కీలక పదవుల్లో పనిచేసిన అమ్రపాలీ ప్రశంసలు పొందారు.
ఎన్నో సవాళ్లు….
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అమ్రపాలి ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా మహానగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతున్నాయి. నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా అభివద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి..
– వాటర్‌బోర్డు ఎండీగా అశోక్‌ రెడ్డి
– భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం బదిలీలు చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం జీవో విడుదలచేశారు. హెచ్‌ఏండీఏ జాయింట్‌ కమిషనర్‌, జీహెచ్‌ ఏంసీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా పనిచేసిన ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రోనాల్డ్‌ రోస్‌ను విద్యుత్‌ శాఖ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆయనకు జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహా శబరి నియమించారు. మల్టీ జోన్‌1 ఐజీగా పనిచేస్తున్న ఏ.వీ.రంగనాథ్‌ను జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌గా నియమించారు. జీహెచ్‌ఏంసీ ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా హేమంత కేశవ్‌ పాటిల్‌, జీహెచ్‌ఏంసీ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా అపూర్వ చౌహాన్‌, జీహెచ్‌ఎంసీ శేర్‌ లింగం పల్లి జోనల్‌ కమిషనర్‌గా (నాన్‌ క్యాడర్‌) పీ. ఉపేందర్‌ రెడ్డిని, మూసీ నదీ అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పీ.గౌతమిని నియమించారు. ఇదిలావుండగా జలమం డలి ఎండీగా కే.అశోక్‌ రెడ్డిని నియమించారు. జలమండలి ఏండీగా పనిచేసిన సుదర్శన్‌ రెడ్డిని జీఏడీ ముఖ్యకార్యదర్శిగా నియమించారు.

Spread the love