– ఐరాస భవనంపైనా బాంబులు
గాజాసిటీ: అమెరికా అండ చూసుకుని ఇష్టానుసారంగా చెలరేగిపోతున్న నెతన్యాహు ప్రభుత్వం తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో 20 మంది ప్రాణాలు తీసింది. ఐరాస భవనంపైనా బాంబులు కురిపించింది.సెంట్రల్ గాజాలోని సుసీరత్‌లో ఓ పాఠశాల భవనంలో నడుపుతున్న ఐరాస సహాయక శిబిరంపైన, దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్‌లోని మవాసి ప్రాంతంపైన ఇజ్రాయిల్ సైన్యం జరిపిన ఫాసిస్టు దాడుల్లో ఫ్రాణ నష్టంతో బాటు ఆస్తి నష్టం కూడా చోటు చేసుకుందని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇజ్రాయిల్ తన చర్యను సమర్థించుకోవడానికి అక్కడ హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని ఎప్పటిలాగే చెప్పింది.ఐరాస సహాయక శిబిరంపై దాడిలో చనిపోయినవారిలో అయిదుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. మరో డజను మంది దాకా పాలస్తీనా పౌరులు గాయపడ్డారు. ఇజ్రాయిల్ దాడుల వల్ల సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ నిర్వాసితుల కోసం సుసిరత్‌లో ఐక్యరాజ్యసమితి ఈ సహాయక శిబిరం నడుపుతోంది. ఇజ్రాయిల్ దాడి పదవ నెలలోకి ప్రవేశించింది. ఇంతవరకు 38 వేల మందికిపైగా పాలస్తీనీయుల ప్రాణాలను ఇజ్రాయిల్ హరించిందని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.