నవతెలంగాణ-వేమనపల్లి
మండలంలోని దస్నాపూర్ గ్రామ శివారు సర్వే నెంబర్ 40లో ఉన్న పెద్ద చెరువు శిఖం భూమిని, గిరిజన ఆశ్రమ పాఠశాల భూమి కబ్జాకు గురైందని రైతులు సోమవారం తహసీల్దార్ రమేష్‌కు ఫిర్యాదు చేశారు. దస్నాపూర్ గ్రామ శివారులో పెద్ద చెరువు విస్తీర్ణం 30.18 ఎకరాలు ఉండాలని, కేవలం 15 ఎకరాలు మాత్రమే ఉందని మిగతా భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. అదేవిధంగా దస్నాపూర్ గ్రామ శివారులో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలను మొదట 5 ఎకరాల విశ్తీర్ణంలో ఏర్పాటు చేశారు. తర్వాత పాఠశాలకు క్రీడా స్థలం లేని కారణంగా పక్కనే ఉన్న పదిరే పోచయ్యకు చెందిన సర్వే నంబర్ 80/2లో 5 ఎకరాలు తీసుకుని అతనికి భూమికి బదులు వేరే భూమి ఇచ్చారు. ఇప్పుడు పాఠశాలకు మొత్తం 10 ఎకరాలు భూమి ఉండాలి. కానీ పాఠశాల పడమర దిశ హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో అదే గ్రామానికి చెందిన వేపూరి శంకర్ గౌడ్ అనే వ్యక్తి సుమారు 2ఎకరాల భూమిని కబ్జా చేసారని రైతులు ఆరోపించారు. ఈ విషయంపైన గతంలో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అన్నారు. ఈ విషయంలో సమగ్ర విచారణ చేపట్టి కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాలని రైతులు కోరారదు. ఈ కార్యక్రమంలో మడె శ్రీనివాస్, కుమురం రమేష్, మడె శ్రీకాంత్, దుర్గం నగేష్ పాల్గొన్నారు.