కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో ఆర్‌జి కర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) కీలక నిర్ణయం తీసుకొంది. సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. జూనియర్ వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించడంలో విఫలం కావడంతో పాటు అతని అవినీతి చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అనాథ శవాలను కూడా సందీప్ ఘోష్ విక్రయించేవాడని.. బంగ్లాదేశ్‌కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడని విమర్శలు వెల్లువెత్తున్న తరుణంలో.. ఐఎంఏ ఈ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా కమిటీ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించడంతో ఈ చర్యకు ఉపక్రమించినట్లు ఐఎంఎ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే అతడిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల అతడి ఇంట్లో 11 గంటల పాటు సోదాలు నిర్వహించింది. ఘోష్‌ను ప్రశ్నించింది.