గ్రామాల అభివృద్ధే లక్ష్యం

 The objective is the development of villages– కడెం ప్రాజెక్ట్‌కు మరమ్మత్తులు చేయించాం
– ప్రతి రైతుకి రుణమాఫీ చేస్తాం
– ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
నవతెలంగాణ జన్నారం
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి, అద్భుతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తోందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. మంగళవారం మండలంలోని రాంపూర్‌, తిమ్మాపూర్‌, తపాలాపూర్‌, సింగరాయిపేట, రొటీగూడ, చింతగూడా తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇటీవల మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించి-ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కడెం ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదని ప్రాజెక్టు డేంజర్‌ జోన్‌లోకి వెళ్ళిందని దీని మూలంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి తీవ్ర నష్టం జరిగితే ముంపు ప్రాంతాల గ్రామాలను పట్టించుకోవకుండా గాలికి వదిలేశారని పేర్కొన్నారు. కడెం ప్రాజెక్ట్‌ మరమ్మత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్ల 46 లక్షలు కేటాయించి బాగు చేసిందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఇప్పటికి సురక్షితంగా ఉందని పేర్కొన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను, కల్వర్టలు బాగు చేయిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులు దిగులు చెందోద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు. గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. త్వరలో అర్హులైన వారికి కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పెన్షన్లు అందజేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్త బండారి స్వామి, బొజ్జు పటేల్‌ ఎమ్మెల్యేగా గెలిస్తే వినాయకుని వద్ద 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకోగా, నా ముక్కు తీర్చుకునే సందర్భంలో ఎమ్మెల్యే వినాయకుని వద్దకు వెళ్లి వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి 108 కొబ్బరికాయలు కొట్టారు. తిమ్మాపూర్‌ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త గుండా సురేష్‌ కుటుంబాన్ని పరామర్శించి, రూ.5000 ఆర్థిక సాయం అందించారు. అనంతరం పలువురు కార్యకర్తలను పరామర్శించారు. తపాలాపూర్‌ రోటి గూడ చింతగూడ మహమ్మదాబాద్‌ గ్రామాల్లో పర్యటించి పంట నష్టం రోడ్ల మరమ్మతులు పై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజా మనోహర్‌ రెడ్డి, ఎంపీడీఓ శశికళ, ఎస్‌ఐ రాజ వర్ధన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, ఆర్‌ఐ బాను చందర్‌, పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్‌ అలీ ఖాన్‌, ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, నాయకులు సయ్యద్‌ ఇషాక్‌, పసియుల్లా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Spread the love