– గ్రూపు-1 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలి
– సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంతాలకు, పట్టింపులకు పోకుండా జీవో 29ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. ఆదివారం ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. సోమవారం పరీక్ష ఉన్నా ఆదివారం కూడా అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్నారంటేనే దాని తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులంతా కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదనను అర్ధం చేసుకోవాలని విన్నవించారు. గ్రూపు-1 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో 29 వల్ల గ్రూపు-1 పరీక్షల్లో 5003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హలయ్యారని తెలిపారు. 563 పోస్టులకు గుండుగుత్తగా 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయమని పేర్కొన్నారు. అందులో 354 పోస్టులు రిజర్వుడు కేటగిరీలో ఉన్నాయని తెలిపారు. జీవో 29 వల్ల ఓపెన్ కేటగిరిలో అర్హత సాధించిన వారినీ రిజర్వుడు కేటగిరీలో చేర్చడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ జీవోవల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే…. ఓసీలు1:65 శాతం మేరకు అర్హత సాధించారని వివరించారు. జీవో నెంబర్ 29 రాజ్యాంగ స్పూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకమని పేర్కొన్నారు. 29 జీవో వల్ల రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయబోతున్నారనే చర్చ మొదలైందని తెలిపారు. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.