రామన్నపేటలో సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్దే వద్దు

– మాజీమంత్రి జి .జగదీష్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రామన్నపేటలో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని మాజీ మంత్రి జి .జగదీష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామన్నపేట ప్రజలు వ్యతిరేకిస్తున్నా సర్కార్‌ మొండిగా ముందుకు పోతున్నదని విమర్శించారు.కంపెనీకిచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరారు. అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలం కకావికలమవుతుందని హెచ్చరించారు. మూసీ, ప్రభుత్వ నిర్ణయాలపై కోదండరామ్‌, హరగోపాల్‌ ఎందుకు గొంతు విప్పడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దామగుండం, రామన్నపేట సిమెంట్‌ ఫ్యాక్టరీతో మూసీ నది కాలుష్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండకు మూసీ ద్వారా త్రాగునీరు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రామన్నపేటలో సిమెంట్‌ ఫ్యాక్టరీకి ఎలా అనుమతిచ్చిందని నిలదీశారు.
శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయి : ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌
రాష్ట్రంలో రోజు రోజుకూ శాంతి భద్రతలు దిగజారి పోతున్నాయని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్యలు, దోపిడీలు, అరాచకాలు మితిమీరుతున్నా సర్కార్‌ తనకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అంబర్‌పేట్‌లో రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ లింగారెడ్డి దంపతులు దారుణ హత్యపై ఇప్పటి వరకు పోలీసులు ఒక్క నిందితుడిని అరెస్టు చేయలేదని గుర్తు చేశారు.

Spread the love