ఉద్యోగులకు డీఏలు ప్రకటించాలి

– ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను చెల్లించాలి
– మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి : సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఐదు విడతల డీఏలను ప్రకటించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ నెల 26న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బుధవారం ఆయన లేఖ రాశారు. ఈ-కుబేర్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్‌, టీజీజీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, సరెండర్‌ లీవులు, లీవ్‌ సాలరీ, సప్లిమెంటరీ బిలులో చేసిన సాలరీలు వంటి బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి రిటైర్‌ అయిన ఉద్యోగుల చెల్లింపులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో వివిధ రకాల బిల్లుల చెల్లింపులకు క్రమపద్ధతి ప్రకారం డిసెంబర్‌లోగా చెల్లించేందుకు తగు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. రెగ్యులర్‌ ఉపాధ్యాయులకిస్తున్న వేతన స్కేలులో మినిమం బేసిక్‌ పేను వర్తింప చేసేందుకు తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ప్రతిఏటా కొంత జీతం పెంచాలంటూ పీఆర్సీ సిఫారసు చేసిందని గుర్తు చేశారు. వారి జీతాన్ని ఏటా 10 శాతం చొప్పున పెంచేందుకు తగు నిర్ణయం చేయాలని పేర్కొన్నారు. ఈ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో తగు నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Spread the love