దిగుమతి సుంకం పెంపుతో రైతులకు ఊరట

– టీజీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ ఎస్‌కే. యాస్మీన్‌ బాషా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని 27.5 శాతానికి పెంచడం రైతులకు ఊరట అని టీజీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ ఎస్‌కే యాస్మీన్‌ బాషా అని చెప్పారు. రైతులకు అధిక ధరలను అందించి, ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించేందుకు ఇది మరింత తోడ్పడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ గెలల ధర టన్నుకు రూ.19,144కు పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ చొరవతో టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.6000కు పెరగడం ఆయిల్‌ పామ్‌ రైతులకు శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. ఆయిల్‌ ఫెడ్‌ మిల్‌లో 2023-24లో నమోదైన నూనె రికవరీ శాతం రికార్డు స్థాయిలో ఉన్నందున ఈ వచ్చే ఆయిల్‌ ఇయర్‌ 2024-25లో ఆయిల్‌ పామ్‌ గెలల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రైతులు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలనే ఉద్దేశంతోనే ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులు పెద్ద ఎత్తున ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టి దేశంలోని రైతాంగానికి మార్గదర్శకంగా నిలవాలని కోరారు.

Spread the love