వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడికి టీఎన్జీవో, టీజీవో ఖండన

– నిరసనగా నేడు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తోపాటు కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డిపై కొంతమంది రైతుల పేరు మీద జరిపిన దాడిని టీఎన్జీవో, టీజీవో తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఆయా సంఘాల అధ్యక్షులు మారం జగదీశ్వర్‌, ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శులు ముజీబ్‌ హుస్సేనీ, ఎ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి నిరసనగా వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన చేపడతారని తెలిపారు. నిందితులు ఎంతటి వారైనప్పటికీ చట్ట పరిధిలో శిక్షలు విధించాలనీ, జిల్లా అత్యున్నత అధికారైన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌పై జరిగిన దాడి పట్ల ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజాసేవలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకునే మార్గం తప్పక ఉంటుందని తెలిపారు.

Spread the love