కాలం చెల్లిన మందులు

– తప్పుడు ప్రకటనలతో మోసం
– డీసీఏ దాడుల్లో బయటపడుతున్న మోసాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రతి రోజు దాడులు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహిస్తున్న దాడుల్లో పలు రకాల మోసాలు బయటపడుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌ సీతాఫల్‌ మండిలోని గాయత్రి మెడికల్‌, జనరల్‌ స్టోర్స్‌పై నిర్వహించిన దాడుల్లో కాలం చెల్లిన మందులను నిల్వ ఉంచినట్టు కనుగొన్నారు. వీటితో పాటు అనుమతి లేకుండా అబార్షన్‌ కిట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రూ.1.25 లక్షల విలువైన నిల్వలను సీజ్‌ చేశారు. నమూనాలను పరీక్షలు పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్‌ రామాంతపూర్‌లోని మెడికల్‌ స్టోర్‌లో కంటి వైద్యానికి పని చేస్తుందంటే అమ్మకానికి పెట్టిన క్లోరోమ్‌ ఫెనికోల్‌ పి.డి.కోల్‌ ఐ ఆయింట్‌ మెట్‌ (మధ్యప్రదేశ్‌ లోని ఇండర్‌ కు చెందిన ప్యాక్‌ సుల్స్‌ దీన్ని తయారు చేస్తున్నది) సీజ్‌ చేశారు. ఒక రోగాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలు ఇస్తే డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమెడీస్‌ (ఆబ్జెక్షనబుల్‌ అడ్వర్టైజ్మెంట్‌) యాక్ట్‌, 1954, ప్రకారం శిక్షార్హులని డీసీఏ డైరెక్టర్‌ జనరల్‌ వీ.బీ.కమలాసన్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Spread the love